గార్బేజ్ ఎంజైమ్‌ను థాయ్‌లాండ్‌కి చెందిన డా. రోసుకాన్ ఆవిష్కరించారు.
తయారీవిధానం : కూరగాయలు, పండ్ల తొక్కలు, ముక్కలు, మార్కెట్లో చెత్త కుప్పలో వేసిన మిగలపండిన పండ్లు, కూరగాయల వ్యర్థాలకు కొంచెం నల్లబెల్లం లేదా మొలాసెస్ లేదా సేంద్రియ పంచదార కలిపి 90 రోజులు మురగబెడితే గార్బేజ్ ఎంజైమ్ తయారవుతుంది.
కావలసిన పదార్థాలు :
- మూత బిగుతుగా పెట్టడానికి వీలుపడే గాజు లేదా ప్లాస్టిక్/ఫైబర్ డ్రమ్ము
- కూరగాయలు, పండ్ల వ్యర్థాలు (తొక్కలు, మొక్కలు కుళ్ళినవి 3 పాళ్ళు)
- నల్లబెల్లం లేదా మొలాసెస్ లేదా సేంద్రియ (బ్రౌన్) సుగర్ – 1 పాలు
- నీరు Ð 10 పాళ్ళు
పైవాటినిన్నంటినీ బాగా కలపాలి. దుకాణాల్లో మిగిలిపోయిన, కుళ్ళిపోయిన కూరగాయలు, పండ్లను ముక్కలు చేసి కలపవచ్చు. మిగిలిపోయిన అన్నం, కూరలు కూడా కలపవచ్చు. ఈ మిశ్రమాన్ని ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి గాలిచొరబడకుండా గట్టిగా మూత బిగించాలి. ఎండ తగులకుండా సాధారణ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ ఉంచాలి. మొదటి 30 రోజుల పాటు, రోజుకోసారి మూత తీసి వాయువులు బయటికి వెళ్ళాక, మరలా గట్టిగా మూత బిగించాలి. ఆ తర్వాత 60 రోజుల పాటు మూత తీయనక్కర్లేదు. 90 రోజులకు గార్బేజ్ ఎంజైమ్ సిద్ధమవుతుంది. ద్రావణం పులియటం వల్ల తెల్లటి పొర ఏర్పడుతుంది. మొత్తం 90 రోజులు గడిచాక ద్రావణాన్ని వడపోసి నిల్వ చేసుకుని 60 రోజుల వరకు వాడుకోవచ్చు. వడపోతలో వచ్చిన వ్యర్థాలను ఎండబెట్టి మొక్కలకు ఎరువుగా వాడవచ్చు. లేదా మళ్ళీ గార్బేజ్ ఎంజైమ్ తయారీకి వాడవచ్చు.
ప్రయోజనాలు : దీనిలో ఉన్న సూక్ష్మ జీవరాశులు, ఔషధ గుణాలు నేలను సారవంతం చేస్తాయి. ఇది సహజ ఎరువుగా, కీటకనాశినిగా, శిలీంద్ర, బాక్టీరియా, వైరస్ తెగుళ్ళ నివారణిగా పనిచేస్తుంది. దీనిని వాడితే పంటల్లో నత్రజనిని గ్రహించే శక్తి పెరుగుతుంది. దీనిని నీటిలో తగినపాళ్ళలో కలిపి వాడుకోవాలి.
- ఎరువుగా : 1:1000 పాళ్ళలో కలిపి నేలలో పోయవచ్చు. లేదా పంటలపై పిచికారి చేయవచ్చు.
- పురుగులు / తెగుళ్ళ నివారణకు : 1:100 పాళ్ళలో కలిపి పిచికారి చేయవచ్చు.
- దిగుబడి పెంచడానికి : 1:500 పాళ్ళలో కలిపి పిచికారి చేయాలి.
- పశుపోషణకు, కోళ్ళ పెంపకానికి ఉపయోగించవచ్చు.
- ఇల్లు, మరుగుదొడ్డి పరిశుభ్రతకు వాడవచ్చు.