ఏరువాకలో ముందస్తు సందడి

  • రాష్ట్రంలో మొదలైన వానాకాలం సీజన్‌
  • నారు పోస్తూ.. దుక్కులు దున్నుతూ పొలాల్లో రైతులు
  • 1.34 కోట్ల ఎకరాల సాగు లక్ష్యం
  • ప్రభుత్వపరంగా సన్నద్ధత

తెలంగాణా రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ముందస్తుగా ప్రవేశించడంతో వానాకాలం సీజన్‌ మొదలైంది. రోజూ వర్షాలు కురుస్తుండటంతో రైతులు సైతం ముందస్తు సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే వరి నారు పెంపకం ప్రారంభించగా, ఇతర పంటలకు దుక్కులు దున్ని విత్తనాలు వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం కార్యాచరణ ప్రణాళిక అమలుకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ సీజన్‌లో 1.34 కోట్ల ఎకరాల్లో పంటల సాగు లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. గత వానాకాలం సీజన్‌లో 1.29 కోట్ల ఎకరాల్లో సాగు కాగా.. ఈసారి అదనంగా 5 లక్షల ఎకరాలు ప్రతిపాదించింది. సాధారణంగా జూన్‌ నెలలో రైతులు పొలాలను దున్ని సాగుకు సిద్ధం చేసుకుంటారు. ఈసారి మార్చి నుంచే అడపాదడపా వర్షాలు పడుతూనే ఉన్నాయి. గత పది రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో రైతులు పంటల సాగుపై దృష్టి సారించారు.

రాష్ట్రంలో పదేళ్లుగా సాగు, ఉత్పత్తులు ఏటేటా పెరుగుతున్నాయి. ఆ మేరకు విత్తనాల సరఫరాకు వ్యవసాయశాఖ సిద్ధమవుతోంది. సన్న ధాన్యానికి బోనస్‌ దృష్ట్యా 40 లక్షల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇందుకోసం 16.70 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయి. వీటి కంటే అధిక అంచనాలతో 60.11 లక్షల ఎకరాల్లో సన్నాలు, 38.21 లక్షల ఎకరాల్లో దొడ్డు రకాలు కలిపి 98.32 లక్షల ఎకరాలకు సరిపడా విత్తనాలను వ్యవసాయశాఖ సిద్ధం చేసింది. పత్తికి సైతం 1.08 కోట్ల ఎకరాలకు అవసరమైన విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ ప్రారంభమైంది. 

రాష్ట్రవ్యాప్తంగా విత్తనోత్పత్తి కోసం వచ్చే నెల 2న వ్యవసాయ విశ్వవిద్యాలయం సిద్ధం చేసిన విత్తనాలను గ్రామానికి ముగ్గురు చొప్పున ఆదర్శ రైతులకు పంపిణీ చేయనున్నారు. వ్యవసాయవర్సిటీ.. 3వ తేదీ నుంచి సాగు విత్తనాలను రైతులకు అందించనుంది. 

వానాకాలం సీజన్‌కు రాష్ట్రానికి 9.80 లక్షల టన్నుల యూరియా సరఫరా చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇందులో ఏప్రిల్‌, మే నెలల్లో 1.72 లక్షల టన్నులు వచ్చింది. వచ్చే నెల మొదటి వారం నుంచి పంపిణీ చేసే అవకాశం ఉంది.

పంటల బీమా అమలు:
ఈ సీజన్‌లో ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రీమియంలో సగం కేంద్రం, మరో సగం రాష్ట్ర ప్రభుత్వం భరించనున్నాయి. రైతులందరికీ పంటల బీమా వర్తింపజేయడంతో స్థూల పంట విస్తీర్ణంలో 98 శాతానికి ఈ పథకం వర్తిస్తుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

నకిలీల నివారణపై దృష్టి:
రాష్ట్రంలో నకిలీ విత్తనాలు, ఎరువుల బెడద లేకుండా పోలీసు, వ్యవసాయశాఖలు సంయుక్తంగా టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేసి తనిఖీలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వరంగల్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌ జిల్లాల్లో ఈ బృందాలు దాడులు నిర్వహించి నకిలీ విత్తనాల ముఠాలను పట్టుకున్నాయి. ఎరువుల నివారణకు వ్యవసాయశాఖ ద్వారా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. ఈ నెల 5 నుంచి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం జరుగుతోంది.

Read More

ఈసారి వర్షాలు పుష్కలం!

ఐఎండీ అంచనా

నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ సారి దేశంలో పుష్కలంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేస్తోంది. జూన్‌ నెలలో సాధారణం కంటే ఎక్కువ వానలు కురిసి, గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది. దీర్ఘకాలిక సగటు (166.9 మి.మీ.) తో పోలిస్తే 108% వర్షాలు కురుస్తాయని తెలిపింది. జూన్‌ నుంచి సెప్టెంబరు మధ్య సగటు (87 మి.మీ.) కంటే 106% వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఒడిశా, చుట్టుపక్కల ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా, వాయవ్య భారతదేశంలో సాధారణంగా, ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువగా వర్షాలు పడతాయని తెలిపింది. మధ్య, దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాల్లో కూడా సాధారణ సగటుకు మించిన వానలు పడతాయని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర తెలిపారు. మరోవైపు పసిఫిక్‌ ప్రాంతంలో ఎల్‌నినో తటస్థంగా ఉంది. ఈసారి రుతుపవనాలపై ఎల్‌నినో ప్రభావం చూపబోదని ఐఎండీ తెలిపింది.

Read More

ఎన్నికల వేళ… భయపెడుతున్న  నైరుతి 

నైరుతి 2023 ఆలస్యంగా ప్రారంభమై రైతులలో ఆందోళనకు, అలజడికి కారణం అయింది.  రైతులపై ప్రభావం చూపుతోంది. రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించటానికి సకాలంలో రుతుపవనాల ప్రారంభ అంచనాలు అవసరం. చాలా కీలకం కూడా. ఎందుకంటే నైరుతి రుతుపవనాల రాక అనేది వ్యవసాయం మీద  ఆధారపడి జీవనోపాధి పొందే కోట్లాది ప్రజానీకం ఎంతో ఎదురుచూసే విషయం. ఇది వారి జీవితాలతోపాటు దేశ ఆర్థిక ప్రగతిని ప్రభావితం చేస్తుంది కనుక. రుతుపవన కాలం జూన్‌ నుండి సెప్టెంబర్‌ వరకు కొనసాగటమే కాకుండా ఇది దేశ వ్యవసాయ రంగానికి కీలకం. దేశ వార్షిక వర్షపాతంలో నైరుతి వాటా 70% పైగా ఉంటుంది. వర్షాకాలం సకాలంలో వచ్చి కొనసాగితే  రైతు జీవితం సాఫీగా సాగిపోతుంది. లేదంటే  సాగు  సజావుగా సాగటం కోసం వర్షాల కోసం ఎదురు చూపులు అయితే మాత్రం రైతులకు ఆశ బదులు నైరాశ్యం ఆవహిస్తుంది. భయాందోళనలు పెరుగుతాయి. తెలియని అయోమయం ఏర్పడుతుంది. వర్షాభావంతో పాటు, ఒక్కోసారి ఒక్కో వర్షానికి మధ్య పెరిగే కాలం, అతివృష్టి తదితర కారణాల వల్ల పంటకి నష్టము జరిగి, రైతు ఆర్థికంగా నష్టపోవలసి వస్తుంది. 

దేశంలో, ప్రపంచంలో ఎందరో శాస్త్రవేత్తలు, సంస్థలు వాతావరణ మార్పులు చేర్పుల గురించి సకాలంలో అందించేందుకు పరిశోధనల ద్వారా కృషి చేస్తూ రైతులకు సాయం చేస్తున్నారు. 

రుతుపవనాల ప్రారంభానికి సంబంధించిన ఖచ్చితమైన దీర్ఘకాలిక సూచనలను అందించడం ద్వారా  రైతులకు చేదోడు వాదోడుగా  భారత వాతావరణ శాఖతోపాటు పలు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కూడా నిరంతరం పనిచేస్తూనే ఉన్నాయి. ఈ సంవత్సరం ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా  ఉండే  అవకాశం ఉందని అన్నారు. అలానే  రుతుపవనాల గమనం ఉంది. విస్తరణ కూడా అలానే ఉండటంవల్ల వారి  అంచనాలు బలపడ్డాయి. అడపాదడపా వర్షము కురిసినపుడు కుంభవృష్టి, ఒక వర్షంకు మరో వర్షానికి ఎక్కువ కాలం ఉండటం,  నిరంతరము వర్షాల తీరు తెన్నుల గురించి వివరణాత్మక సమాచారాన్ని అందిస్తున్నాయి. రుతుపవనాల ఖచ్చితమైన సమయం, ప్రదేశాన్ని తెలుసుకోవడం ద్వారా, అలాగే ప్రారంభ వర్షపాతం తరువాత పొడి వాతావరణం ఏర్పడితే వచ్చే  ప్రభావం  తెలుసుకోవడం ద్వారా, రైతులు సకాలంలో పొలం పనుల గురించి మంచి సమాచారంతో సకాలంలో సరైన  నిర్ణయాలు తీసుకోవచ్చు.

ఈ సంవత్సరం మార్చి, ఏప్రిల్‌లో, దక్షిణ హిందూ మహాసముద్రంలో సాధారణం కంటే ఎక్కువ గాలి ఉష్ణోగ్రతలు ఏర్పడ్డాయి. తర్వాత భూమధ్యరేఖ తూర్పు పసిఫిక్‌ మహాసముద్రం క్రమంగా వేడెక్కటం, ఈ వేడెక్కడం ఎల్‌నినో పరిస్థితులలో మార్పుకు సంకేతం కావటం చూశాం. దీనితో జూన్‌లో నైరుతి రుతుపవనాలు వచ్చినపుడు  భూమధ్యరేఖ పసిఫిక్‌ మహాసముద్రంలో ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉంటుంది, దీనివల్ల రుతుపవనాలు స్థిరపడక ముందే ప్రత్యామ్నాయ అడపాదడపా వర్షాలు, పొడి గాలులు ఏర్పడతాయి. ఇది కూడా చూశాం. ఇటువంటి మార్పులు గత కొద్ది కాలంగా జరగటం, దీనికి కారణం వాతావరణ మార్పులు అని నిపుణులు నిగ్గు తేల్చారు. వీటిని తట్టుకునేందుకు  పరిష్కార మార్గాలు ఉన్నాయి. వాటిని అందరూ ప్రపంచ వ్యాప్తంగా ఆచరించాలి. ఇది ఒక్కరి సమస్య కాదు. అంతర్జాతీయ సమస్య కూడా. అయితే ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాలలో నైరుతి బాగా ఆలస్యం అయ్యింది. దానికి తోడు విస్తరణ కూడా ఆశాజనకంగా లేదు. అందువల్ల ప్రస్తుతానికి సాగు పనులు ఆశాజనకంగా లేవు. జూలై నెలలో రాబోయే  వర్షాలు పడి విస్తరిస్తేనే పంటకాలం సజావుగా సాగుతుంది. ఇటీవల కాలంలో ప్రతి పంట కాలంలో ఈ సమస్య చూస్తున్నాం.  రోజురోజుకు అధికమౌతున్న వాతావరణ మార్పులతో ఎదురౌతున్న సమస్యలు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలి. వారిని సాగుకు సమాయత్తం చేయాలి. మరీ ముఖ్యంగా రుతుపవనాలు ఆలస్యం అయితే వారికి  ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేసి అందించాలి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలకు ముఖ్యంగా  పాలక పక్షాలకు నైరుతి నైరాశ్యం, దిగులు, గుబులు పుట్టిస్తోంది. అందువల్ల రైతులకు అందాల్సిన సహకారం తప్పనిసరిగా అందే అవకాశం ఉంది, ఉంటుంది కూడా. ఏ మాత్రం తేడా వచ్చినా ఫలితాలు మరో రకంగా ఉంటాయి కదా! అందువల్ల నైరుతి నైరాశ్యం నుంచి రైతు గట్టెక్కగలరనే నమ్మకముంది. 

– వేంకటేశ్వరరావు

Read More