రైతు గిట్టుబాటు ధర పొందాలంటే అనుసరించవలసిన మార్గాలు

ఆరు కాలాలు కష్టపడి పంటలు పండించే రైతుకు ప్రకృతి వైపరీత్యాలు, ముఖ్యంగా వాతావరణ మార్పులతో ఏర్పడే ప్రతికూల పరిస్థితులు అనేక సవాళ్లను సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం లోపించడం, వర్షాలు అసమానంగా కురవడం, అధిక ఉష్ణోగ్రతలు, నేలలో తేమ తగ్గడం వంటి పరిస్థితులు వ్యవసాయంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం చాలా వరకు వర్షపాతం పరిస్థితులతో ముడిపడి ఉంది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల వర్షపాతం సాధారణం కంటే 50.7 శాతం తక్కువగా ఉంది. రాష్ట్రంలోని 25 జిల్లాలు లోటు వర్షపాతాన్ని, 3 జిల్లాలు అధిక లోటు వర్షపాతాన్ని నమోదు చేశాయి. 2026–27 ఖరీఫ్‌ సీజన్‌లో రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం సుమారు 15 శాతం తగ్గినట్లు ప్రాథమిక అంచనాలు సూచిస్తున్నాయి.

ఎల్‌నినో అంటే తప్పనిసరిగా కరువు అని అర్థం కాదు. ప్రాంతీయ వర్షపాతం ఇతర వాతావరణ అంశాలపై కూడా ఆధారపడి ఉంటుంది. అందువల్ల ముందస్తు వాతావరణ సమాచారం, పంటల ప్రణాళిక, నీటి సంరక్షణ, పంట వైవిధ్యీకరణ, మార్కెట్ సమాచారాన్ని సమర్థంగా వినియోగించడం ద్వారా రైతులు ప్రతికూల పరిస్థితులను కొంతవరకు ఎదుర్కోవచ్చు. ఇలాంటి తరుణంలో ‘సంక్షోభం నుంచి శ్రేయస్సు వైపు’ ప్రయాణించాలంటే కొన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలి. ‘అవసరమే ఆవిష్కరణలకు తల్లి’ కాబట్టి విపత్కర పరిస్థితుల్లో నూతన మార్గాలను అన్వేషించడంలో, పంట వైవిధ్యీకరణ, నీటి సంరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులు మరియు విలువ జోడింపు వంటి చర్యలపై ప్రభుత్వాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు రైతులకు అండగా ఉండాలి.

ప్రతి పంట ఉత్పత్తి వినియోగదారునికి ఏదో ఒక ఉపయోగాన్ని అందిస్తుంది. అయితే ఆ ఉపయోగ స్థాయి వస్తువు యొక్క రూపం, స్థలం, సమయం మరియు దానిని వినియోగదారునికి ఉపయోగకరంగా మార్చే ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. పంట ఉత్పత్తుల ఉపయోగ విలువను పెంపొందించడంలో ముఖ్యమైన మూడు మార్గాలు ఉన్నాయి. అవి:

  1. ఆకార లేదా రూప ఉపయోగం – పంట ఉత్పత్తి రూపాన్ని మార్చి అధిక విలువ కలిగిన ఉత్పత్తిగా మార్చడం.
  2. స్థల ఉపయోగం – ఉత్పత్తిని తక్కువ ధర ఉన్న ప్రాంతం నుంచి ఎక్కువ ధర లభించే మార్కెట్‌కు తరలించడం.
  3. కాల ఉపయోగం – పంటను వెంటనే విక్రయించకుండా, అవసరమైన సమయంలో లేదా ధర మెరుగ్గా ఉన్నప్పుడు విక్రయించడం.
    ప్రముఖంగా ఉత్పత్తి రంగం ఆకార ఉపయోగాన్ని సృష్టిస్తుంది. చాలా సందర్భాలలో ముడి పదార్థాలు (raw materials) తమ అసలు రూపంలో ఉపయోగకరంగా ఉండవు. అవి ప్రాసెసింగ్ లేదా తయారీ ప్రక్రియల ద్వారా వినియోగదారునికి సరిపడే రూపంలోకి మారతాయి. ఈ మార్పు వల్ల వస్తువుల విలువ పెరుగుతుంది. ఈ ఉపయోగం ద్వారా తయారీదారులు, కార్మికులు, పరిశ్రమల ఏర్పాటుకు దోహదం చేస్తుంది. ఉత్పత్తుల విలువలను పెంచే క్రమంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు స్థాపించబడి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఈ పరిణామ క్రమంలో పల్లెలు మరియి పట్టణాల మధ్య ఉండే తక్కువ-ఎక్కువ అనే భేధభావం తగ్గుతుంది.ఇది ఆర్థిక అభివృద్ధికి, ఉపాధికి, మరియు వస్తువుల విలువ పెరుగుదలకు దోహదపడుతుంది. ఇక్కడ పరిగణనలోనికి తీసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, రూపం మార్చడం వలన రైతు పొందే ధర ఖచ్చితంగా రూపం మార్చడం కోసం అయ్యే ఖర్చు కంటే ఎక్కువగా ఉండాలి అన్నది జగమెరిగిన సత్యం. ఉధాహరణకు, మిరపకాయలను కారంగా మార్చడం ద్వారా గాని, బెల్లాన్ని వివిద రూపాలలో తయారు చేసి అమ్మడం ద్వారా 20% నుండి 25% అధికంగా లాభాలు ఆర్జించ వచ్చు అని వివిధ పరిశోదనా ఫలితాలు తెలియజేస్తున్నాయి. ప్రస్తుత తరుణం లో తడిచిన ధాన్యాన్ని ‘పారాబాయిల్డ్ రైస్’ లేక నూకల రూపం లో అమ్ముకుంటే రైతు కు లాభసాటి. ఆదే రకంగా వాస్తవిక పరిస్థితులను బట్టి రైతులు తాము పండిచే పంటలకు తగు చర్యలు తీసుకోవాలి. రెండవది, స్థల ఉపయోగం అనగా వస్తువును పండించిన చోటనే కాకుండా ఎక్కువ ధర పలికే ప్రదేశంకు తరలించి అమ్ముకోవడం. ఊదాహరణకు హిమాచల్ ప్రదేశ్లో పండిన ఆపిల్స్ను చెన్నై మార్కెట్లకు రవాణా చేయడం, తీరప్రాంతాలలో పట్టిన చేపలను వేరే ప్రాంతాలకు పంపడం, గ్రామాల నుండి పంటలను పట్టణ మార్కెట్లకు సరఫరా చేయడం మొదలగునవి. స్థాన ఉపయోగం ద్వారా రవాణా, రోడ్లు, రైల్వేలు, పోర్టులు, మార్కెట్ వ్యవస్థలు సృష్టించబడతాయి. ఇది ప్రాంతీయ అభివృద్ధి, వాణిజ్య విస్తరణ మరియు ధరల స్థిరీకరణకు దోహదపడుతుంది. ఇక్కడ పరిగణనలోనికి తీసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, స్థాన మార్పు ద్వారా రైతు పొందే ధర ఖచ్చితంగా రవాణాకు ఆయ్యే ఖర్చు కంటే ఎక్కువగా ఉండాలి. 07 మార్చి 2025 నుంచి నూకల (Broken Rice) ఎగుమతి విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ‘నిషేధిత’ నుంచి ‘స్వేచ్ఛా’ విధానంగా మార్చింది. ఏందుకంటే పశువులదాణాగా చైనా మరియు మనుషులు తినడం కోసం ఆఫ్రికా దేశాలైన సెనెగల్, జిబౌటి మొదలగు దేశాలు దిగుమతులను అనుమతిస్తున్నాయి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ఇంకొక అవకాశం ఏమిటంటే, ‘పారాబాయిల్డ్ రైస్’ పై కేంద్ర ప్రభుత్వం ఎగుమతుల సుంకాన్ని పూర్తిగా తొలగించినది. మూడవది, కాల ఉపయోగం, వినియోగదారునికి అవసరమైన సమయానికి వస్తువులను అందుబాటులో ఉంచినప్పుడు ఏర్పడే ఉపయోగం. ఎందుకు అంటే, వ్యవసాయ ఉత్పత్తులు సీజన్ వారీగా పండుతాయి, కానీ వాటి వినియోగం సంత్సరాంతం ఉంటుంది. ఉదాహరణకు ఫలాలను నిల్వ ఉంచి సీజన్ కాకపోయినప్పుడు విక్రయించడం. కాల ఉపయోగం వలన వేర్‌హౌస్‌లు, నిల్వ కేంద్రాలు, నిల్వ వాణిజ్య వ్యవస్థలు సృష్టించబడతాయి. ఇది సరఫరా-డిమాండ్ సమతుల్యాన్ని నిలబెట్టడంలో మరియు ధరలు నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

రైతులు తమ యొక్క ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు ఎలా ఉంటాయో ముందస్తుగా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంటూరులో ప్రధాన వ్యవసాయ పంటల ముందస్తు ధరలను అంచనా వేయుటకు “వ్యవసాయ మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రం” 2018-19 సంవత్సరం లో స్థాపించబడింది. గత అనుభవంలో ఈ కేంద్రం అంచనా వేసిన ధరలు 90% వరకు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి మరింత సమాచారం కోసం https://angrau.ac.in/downloads/AMIC/PriceForecast సందర్శించవచ్చు. వీటిని దృష్టిలో పెట్టుకొని రైతు తమ ఉత్పత్తులకు ఆదాయ వ్యాయాల నిష్పత్తిని లెక్కించుకొని, వీటితో పాటు వివిధ మార్కెట్లలో తమ పంట ఉత్పత్తులకు ఎంత ధర ఉందో తెలుసుకొని దానికి అనుగుణoగా నిర్ణయం తీసుకోవాలి. నికి తోడు, రైతులు తమ ఉత్పత్తులను అదేవిదంగా అమ్మకుండా, దానికి విలువ జోడించినట్లయితే అధిక ధరలను పొందవచ్చు.

ఎల్‌నినో పరిస్థితుల్లో ప్రభుత్వ జోక్యం కూడా అవసరం
వ్యవసాయం నుండి ఉత్పత్తులు ‘సీజన్’ ఆధారంగా ఉంటాయి, కానీ వాటి యొక్క వినియోగం సంవత్సరం పొడవునా ఉంటుంది. అందుచేత గిరాకి మరియు సరఫరాల మద్య తారతమ్యాలు తక్కువగా ఉండాలి అంటే ‘ప్రభుత్వ జోక్యం’ అనేది తప్పనిసరి. ఏపంటలో ఆయిన ధరలు 20 శాతం కంటే ఎక్కువ పెరిగినప్పుడు ప్రభుత్వం నిల్వ ఉన్న సరుకులను మార్కెట్ లోకి అందుబాటులో ఉండేటట్లు చూడాలి. దీనికోసం ప్రత్యేకంగా ‘ధరల స్థిరీకరణ నిధి’ ఏర్పాటు చేయాలి. ఇప్పటి పరిస్థితులలో మన రాష్ట్ర ప్రభుత్వం మిగతా రాష్ట్రాల మాదిరిగా పంట ఉత్పత్తులలో నాణ్యత తగ్గినా కొనుగోలు చేయాలి.

వాతావరణ పరిస్థితులు రైతు నియంత్రణలో ఉండకపోవచ్చు. కానీ పంటను ఎలా ఉత్పత్తి చేయాలి, ఎప్పుడు విక్రయించాలి, ఎక్కడ విక్రయించాలి, ఏ రూపంలో విక్రయించాలి అనే నిర్ణయాల్లో కొంతవరకు రైతుకు అవకాశం ఉంటుంది. అందువల్ల ఎల్‌నినో వంటి వాతావరణ సవాళ్లను కేవలం ఉత్పత్తి నష్టంగా చూడకుండా, పంట ప్రణాళిక, నీటి నిర్వహణ, విలువ జోడింపు, మార్కెట్ ఎంపిక, నిల్వ మరియు సరైన సమయంలో విక్రయం వంటి అంశాలను సమగ్రంగా చూడాలి. వినియోగదారుడి సంతృప్తి అనేది ఎప్పటికైనా అంతిమ లక్ష్యం. ఆకార, స్థల మరియు కాల ఉపయోగాలు సమాజంలో వ్యవసాయ ఉత్పత్తులను వినియోగదారునికి సరైన రూపంలో, సరైన ప్రదేశంలో, సరైన సమయంలో అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇవి కలిపి ఆర్థిక సమృద్ధిని మరియు వినియోగదారుని సంతోషాన్ని పెంచుతాయి. వీటన్నింటి సంగమమే “సరైన వస్తువు – సరైన రూపంలో – సరైన సమయానికి – సరైన వ్యక్తికి” చేరేలా చేస్తాయి. ఇవి ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా నడపడానికి, రైతులు మరియు వినియోగదారుల మద్య సమతుల్యాన్ని నెలకొల్పడానికి మరియు సామాజిక సంక్షేమాన్ని పెంచడానికి దోహదపడతాయి.

డా. కె. జె. వి. కె. శిరీష, రీసెర్చ్ అసోసియేట్, డా. ఐ. వి. వై. రామారావు, ప్రధాన వ్యవసాయ ఆర్ధిక శాస్త్రవేత్త,
సాగు ఖర్చు విభాగం, ఆచార్య ఏన్. జీ. రంగా వ్యవసాయ విశ్వవిధ్యాలయం, లాం, గుంటూరు – 522 304
ఈమెయిల్: ivy.ramarao@angrau.ac.in, ఫోన్:9493660918.

Read More

వాతావరణ మార్పులు – రైతుల సాగు విధానాల్లో మార్పులు అవసరం

వ్యవసాయం ప్రకృతిపై అత్యధికంగా ఆధారపడే రంగం. వర్షపాతం, ఉష్ణోగ్రత, గాలి వేగం, తేమ, సూర్యకాంతి వంటి వాతావరణ అంశాల్లో స్వల్ప మార్పులు కూడా పంటల పెరుగుదల, పుష్పించడం, కాయలు ఏర్పడడం, దిగుబడి మరియు నాణ్యతపై ప్రభావం చూపుతాయి. ఇటీవలి సంవత్సరాల్లో అకాల వర్షాలు, దీర్ఘకాలిక పొడి పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులు, తక్కువ వ్యవధిలో అధిక వర్షపాతం, వర్షాల విరామాలు వంటి వాతావరణ అస్థిరతలు వ్యవసాయంలో సవాళ్లను పెంచుతున్నాయి.

ఎల్‌నినో (El Niño) లాంటి పరిస్తితులు కూడా కొన్ని సంవత్సరాల్లో వర్షపాతం మరియు ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపి, ముఖ్యంగా వర్షాధార వ్యవసాయ ప్రాంతాల్లో పంటల ఉత్పాదకతను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అయితే, ఎల్‌నినో ఒక్కటే ప్రతి ప్రాంతంలో ఒకే విధమైన వర్షాభావానికి కారణమవుతుందని భావించకూడదు. స్థానిక వాతావరణ పరిస్థితులు, రుతుపవనాల   వ్యవస్థ, నేల స్వభావం, పంట కాలం మరియు సాగు విధానాలు కూడా పంటలపై ప్రభావం చూపుతాయి.

అందువల్ల “వాతావరణం మారినప్పుడు వ్యవసాయ విధానం కూడా మారాలి” అనే దృక్పథంతో రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలి. వాతావరణ మార్పులను పూర్తిగా నియంత్రించలేకపోయినా, వాటి ప్రభావాన్ని తగ్గించే వాతావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులు (Climate-resilient agriculture) అవలంబించడం ద్వారా పంట నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చు.

వాతావరణ మార్పులు పంటలపై ఎలా ప్రభావం చూపుతాయి?
పంటల పెరుగుదలలో ప్రతి దశకు నిర్దిష్ట ఉష్ణోగ్రత మరియు తేమ అవసరం. వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతలు ఏర్పడినప్పుడు మొక్కలలో ఆవిరిపోతనం (భాస్పోత్సేకం) మరియు నేల నుండి నీరు ఆవిరి అవ్వడం పెరుగుతుంది. ఫలితంగా నేలలోని నీరు వేగంగా తగ్గిపోతుంది. నీటి కొరత ఏర్పడినప్పుడు మొక్కలు తమ రంధ్రాలను మూసుకోవడం వల్ల కిరణజన్య సంయోగక్రియ తగ్గి, మొక్కల పెరుగుదల మందగిస్తుంది.

పుష్పించే దశలో అధిక ఉష్ణోగ్రతలు ఏర్పడితే పుష్పాలు రాలిపోవడం, పుప్పొడి జీవనశక్తి తగ్గడం, ఫలదీకరణలో అంతరాయం ఏర్పడటం వల్ల కాయధారణ మరియు గింజల సంఖ్య తగ్గవచ్చు. ముఖ్యంగా పుష్పించే మరియు గింజ పోసుకునే దశల్లో ఏర్పడే ఉష్ణోగ్రత ఒత్తిడి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అదేవిధంగా, తక్కువ వ్యవధిలో భారీ వర్షాలు కురిస్తే నేల కోత, నీటి నిల్వ, పోషకాలు కొట్టుకుపోవడం, వేర్లకు ఆక్సిజన్ కొరత వంటి సమస్యలు ఏర్పడతాయి. దీనికి విరుద్ధంగా వర్షాల మధ్య ఎక్కువ విరామం ఏర్పడితే మట్టిలో తేమ కొరత (moisture stress) ఏర్పడి పంట పెరుగుదల దెబ్బతింటుంది. అందువల్ల వాతావరణ మార్పుల నేపథ్యంలో “ఎక్కువ నీరు వచ్చినప్పుడు సంరక్షించడం, తక్కువ నీరు వచ్చినప్పుడు సమర్థంగా వినియోగించడం” అనే రెండు వ్యూహాలు రైతులకు అత్యంత ముఖ్యమైనవి.

రైతుల సాగు విధానాల్లో చేయాల్సిన ముఖ్యమైన మార్పులు

  1. వాతావరణ ఆధారిత పంటల ప్రణాళిక
    విత్తనాలు వేయడానికి ముందు స్థానిక వాతావరణ సూచనలు, వర్షపాత అంచనాలు మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు/వ్యవసాయ శాఖలు అందించే వ్యవసాయ వాతావరణ సలహా సేవలను రైతులు పరిశీలించాలి. ముఖ్యంగా వర్షాధార ప్రాంతాల్లో వర్షాలు ఆలస్యమైతే వెంటనే సాధారణ పంటలనే వేయకుండా తక్కువ కాలంలో పూర్తయ్యే, తక్కువ నీటి అవసరం కలిగిన పంటలు లేదా రకాలను ఎంపిక చేయడం మంచిది.

పంటల ఎంపికలో ప్రధానంగా:

  • తక్కువ కాల పరిమితి గల రకాలు
  • బెట్టను తట్టుకునే రకాలు
  • స్థానిక వాతావరణానికి అనుకూలమైన రకాలు
  • తక్కువ నీటి అవసరమున్న పంటలు
  • మిశ్రమ మరియు అంతర పంటలు ……….వంటి విధానాలను పరిగణనలోకి తీసుకోవాలి.
  1. నేలలో తేమను సంరక్షించాలి
    వాతావరణ మార్పుల సమయంలో నేలలో తేమ సంరక్షణ పంట ఉత్పాదకతకు కీలకం. వర్షం పడిన వెంటనే నీరు పొలాన్ని వదిలి వెళ్లకుండా, సాధ్యమైనంత వరకు నీరు నేలలోకి చొచ్చుకుపోయేలా చర్యలు చేపట్టాలి. దీనికి:
  • పంట అవశేషాలను నేలపై ఉంచడం
  • మల్చింగ్ చేయడం
  • పొలంలో చిన్న కట్టలు/బండ్లు ఏర్పాటు చేయడం
  • కాంటూర్ బండింగ్
  • అవసరమైన ప్రాంతాల్లో వేసవి లోతు దుక్కులు చేపట్టడం
  • సేంద్రియ పదార్థాలు వేసి నేలను గుల్లబర్చడం
  • తక్కువ దుక్కి లేదా సంరక్షణ వ్యవసాయ పద్ధతులు వంటివి ఉపయోగపడతాయి.

పంట అవశేషాలను కాల్చకుండా నేలలో కలపడం లేదా ఉపరితలంపై మల్చ్‌గా ఉపయోగించడం వల్ల నేల ఉష్ణోగ్రతల తీవ్ర మార్పులు తగ్గడంతో పాటు, నేల తేమ ఆవిరైపోవడం తగ్గుతుంది. దానితో పాటు కలుపు మొలకెత్తకుండా చూసుకోవచ్చు.

  1. నేల సారాన్ని పెంచడం – వాతావరణ ప్రతిఘటనకు పునాది
    సేంద్రియ పదార్థం అధికంగా ఉన్న నేలలు నీటిని ఎక్కువగా నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల నేలలో సేంద్రియ కార్బన్ (Soil Organic Carbon) పెంపు వాతావరణ ప్రతికూలతలను ఎదుర్కొనే ముఖ్యమైన వ్యూహం. పంట అవశేషాలు, పశువుల ఎరువు, కంపోస్ట్, పచ్చిరొట్ట ఎరువులు, గొర్రెలు ఆపడం, పంటల అవశేషాల నిర్వహణ వంటి పద్ధతులను అవలంబించాలి.

అయితే కేవలం సేంద్రియ ఎరువులపైనే ఆధారపడకుండా సమీకృత పోషక యాజమాన్యం (Integrated Nutrient Management) పాటించాలి. నేల పరీక్ష ఆధారంగా నత్రజని, భాస్వరం, పొటాషియం మరియు అవసరమైన సూక్ష్మపోషకాలను సమతుల్యంగా అందించాలి. ముఖ్యంగా పొటాషియం మొక్కల నీటి సమతుల్యత, కణాల దృఢత్వం మరియు వివిధ ఒత్తిళ్లను తట్టుకునే సామర్థ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి నేల పరీక్ష ఆధారంగా పొటాషియం లోపం ఉన్న నేలల్లో తగిన మోతాదులో పొటాషియం ఎరువులు అందించడం ప్రయోజనకరం. కొన్ని నేలల్లో పోటాష్ ఎక్కువగా ఉన్నప్పటికీ మొక్కకు అందుబాటులోకి రాదు. ఇలాంటి పరిస్థితులలో పోటాష్ మొబలైజింగ్ బ్యాక్టీరియా వంటివి ఉపయోగకరంగా ఉంటాయి.

  1. నీటి యాజమాన్యంలో మార్పులు
    వాతావరణ మార్పుల పరిస్థితుల్లో నీటిని అపరిమితంగా ఉపయోగించే సాగు విధానాలకు బదులుగా “More crop per drop” సూత్రాన్ని అనుసరించాలి.

సాధ్యమైన చోట:

  • డ్రిప్ మరియు స్ప్రింక్లర్ పద్ధతులు
  • పంట అవసరానికి అనుగుణంగా నీటిపారుదల
  • ఉదయం లేదా సాయంత్రం నీటి వినియోగం
  • నేల తేమ ఆధారంగా నీటి నిర్ణయం
  • పొలంలో వర్షపు నీటి సంరక్షణ పద్దతులైన కాంటూర్ గట్లు చేపట్టాలి.
    నీటి కొరత ఉన్న సమయంలో పంటకు అత్యంత కీలకమైన పుష్పించే, కాయఏర్పడే దశ మరియు గింజ నిండే దశల్లో అందుబాటులో ఉన్న నీటిని ప్రాధాన్యతతో వినియోగించాలి.
  1. పంటల వైవిధ్యీకరణ – ఒకే పంటపై ఆధారపడకండి
    వాతావరణ అనిశ్చితి పెరిగినప్పుడు ఒకే పంటపై ఆధారపడటం రైతుకు అధిక ప్రమాదాన్ని కలిగిస్తుంది. అందువల్ల పంటల వైవిధ్యీకరణ (Crop diversification) అవసరం. ధాన్య పంటలతో పాటు పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాలు మరియు స్థానికంగా అనుకూలమైన పంటలను పంటల ప్రణాళికలో చేర్చాలి.
    ఉదాహరణకు వర్షాధార ప్రాంతాల్లో జొన్న, సజ్జ, రాగి, కంది, పెసర, మినుము వంటి పంటలు పరిస్థితులకు అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చు. అలాగే అంతర పంటలు (Intercropping) కూడా ప్రతికూల వాతావరణ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఒక పంట ప్రతికూల వాతావరణంతో నష్టపోయినా, మరో పంట ద్వారా కొంత ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
  2. ఎరువుల వినియోగంలో సమతుల్యత
    వాతావరణ ఒత్తిడి సమయంలో అధిక నత్రజని వినియోగం ఎల్లప్పుడూ ప్రయోజనకరం కాదు. అధిక నత్రజని వల్ల మృదువైన, అధిక శాఖీయ పెరుగుదల ఏర్పడి, కొన్ని పరిస్థితుల్లో నీటి ఒత్తిడి మరియు పురుగు/తెగుళ్ల సమస్యలకు పంట సున్నితంగా మారవచ్చు. అందువల్ల నేల పరీక్ష ఆధారిత సమతుల్య ఎరువుల యాజమాన్యం పాటించాలి.

వర్షాభావం ఉన్నప్పుడు నేలలో తగిన తేమ లేకుండా అధిక మోతాదులో ఎరువులు వేయడం నివారించాలి. తేమ అందుబాటులో ఉన్న సమయంలో సిఫార్సు చేసిన విధంగా ఎరువులను అందించాలి. అవసరాన్ని బట్టి శాస్త్రీయంగా సిఫార్సు చేసిన పంట పైన పోషక ద్రావణాలను కూడా పిచికారి చేసుకోవచ్చు. అయితే పంట, దశ, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ శాస్త్రవేత్తల సిఫార్సు మేరకే వాటిని ఉపయోగించాలి.

  1. అధిక ఉష్ణోగ్రతల సమయంలో పంట రక్షణ
    ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు పంటలో నీటి నష్టం వేగంగా జరుగుతుంది. ఈ సమయంలో:
    మల్చింగ్ + నేల తేమ సంరక్షణ + సరైన నీటి యాజమాన్యం + సమతుల్య పోషక యాజమాన్యం అనేవి అత్యంత ముఖ్యమైన సమగ్ర విధానం.
    పుష్పించే దశలో తీవ్ర వేడి ఉంటే పుష్పాలు రాలడం లేదా పరాగసంపర్కం తగ్గడం వంటి సమస్యలు రావచ్చు. అందువల్ల పంటకు కీలక దశల్లో తేమ ఒత్తిడి రాకుండా ముందస్తు నీటి ప్రణాళిక అవసరం.
  2. అధిక వర్షాల సమయంలో కూడా ముందస్తు చర్యలు అవసరం
    వాతావరణ మార్పు అంటే కేవలం వర్షాభావం మాత్రమే కాదు. కొన్ని సందర్భాల్లో తక్కువ సమయంలో అధిక వర్షపాతం కూడా పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది.

అందువల్ల పొలంలో:

  • అదనపు నీరు బయటకు వెళ్లే కాలువలు
  • సరైన డ్రైనేజీ
  • నీటి నిల్వను నివారించడం
  • నేల కోత నియంత్రణ
  • వర్షం తరువాత పోషక లోపాల నివారణ వంటి చర్యలు చేపట్టాలి.

నీరు ఎక్కువసేపు నిలిచే పరిస్థితుల్లో వేర్లకు ఆక్సిజన్ అందక వేరుకుళ్ళు మరియు ఇతర తెగుళ్లు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అధిక వర్షాల తరువాత పొలాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలి.

  1. పురుగులు మరియు తెగుళ్లపై నిరంతర నిఘా
    ఉష్ణోగ్రత మరియు తేమలో మార్పులు అనేక పురుగులు, తెగుళ్ల జీవచక్రాన్ని ప్రభావితం చేయవచ్చు. అందువల్ల వాతావరణ మార్పుల నేపథ్యంలో సమీకృత తెగుళ్ల మరియు పురుగుల యాజమాన్యం మరింత ప్రాధాన్యం పొందుతుంది.

రైతులు వారానికి కనీసం ఒకసారి పొలాన్ని పరిశీలించి:

  • పురుగుల ఉనికి
  • గుడ్లు/లార్వా
  • ఆకుల నష్టం
  • తెగుళ్ల లక్షణాలు గుర్తించాలి
  • శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించాలి.
  1. వాతావరణ సమాచారాన్ని రైతు నిర్ణయాల్లో భాగం చేయాలి
    ఈ రోజుల్లో వాతావరణ సమాచారం రైతులకు చాలా ఉపయోగకరమైన సాధనంగా మారింది. వర్ష సూచనలు, ఉష్ణోగ్రత, గాలివేగం, తేమ వంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకుని:
  • విత్తనాలు వేసే సమయం
  • ఎరువులు వేయడం
  • పురుగుమందుల పిచికారీ
  • నీటిపారుదల
  • కోత
  • పంట సంరక్షణ…….వంటి నిర్ణయాలు తీసుకోవచ్చు.

“వాతావరణ సూచనను తెలుసుకుని – వ్యవసాయ నిర్ణయం తీసుకోవడం” భవిష్యత్ వ్యవసాయంలో ముఖ్యమైన భాగం కావాలి.

రైతు మాత్రమే కాదు – శాస్త్రవేత్తల పాత్ర కూడా కీలకం

వాతావరణ మార్పులను ఎదుర్కోవడం రైతు బాధ్యత మాత్రమే కాదు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, విస్తరణ అధికారులు, వ్యవసాయ శాఖ, వాతావరణ శాస్త్రవేత్తలు కలిసి స్థానిక పరిస్థితులకు అనుగుణమైన సాంకేతిక పరిష్కారాలను రైతులకు అందించాలి.

శాస్త్రవేత్తల స్థాయిలో:

  1. కరువు మరియు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే రకాల అభివృద్ధి
  2. తక్కువ నీటితో అధిక ఉత్పాదకత సాధించే పద్ధతుల అభివృద్ధి
  3. వాతావరణ ఆధారిత పంటల సిఫార్సులు
  4. నేల తేమ సంరక్షణ సాంకేతికతల ప్రదర్శనలు
  5. పంటల వైవిధ్యీకరణ నమూనాలు
  6. వాతావరణ ఆధారిత పురుగు–తెగుళ్ల హెచ్చరిక వ్యవస్థలు
  7. గ్రామస్థాయిలో వ్యవసాయ సలహాలు అందించడం …….వంటి చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
  • చివరిగా….* వాతావరణ మార్పులు వ్యవసాయానికి ఒక దీర్ఘకాలిక సవాలు. అయితే శాస్త్రీయ పద్ధతులు, ముందస్తు ప్రణాళిక మరియు స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణమైన సాగు విధానాలను అవలంబించడం ద్వారా వాటి ప్రభావాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. సరైన పంట + సరైన రకం + సరైన సమయంలో విత్తడం + నేలలో తేమ సంరక్షణ + సమతుల్య పోషక యాజమాన్యం + సమర్థవంతమైన నీటి వినియోగం + సమగ్ర పంట రక్షణ + వాతావరణ ఆధారిత నిర్ణయాలు ఇవే వాతావరణ అనుకూల వ్యవసాయానికి ప్రధాన సూత్రాలు. రైతులు వాతావరణ మార్పులను కేవలం సమస్యగా కాకుండా ముందస్తు ప్రణాళికతో ఎదుర్కోవాల్సిన వ్యవసాయ ప్రమాదంగా చూడాలి. ఒకే పంట, ఒకే సాగు విధానం, ఒకే నీటి వనరుపై ఆధారపడకుండా పంటల వైవిధ్యీకరణ, నేల ఆరోగ్య పరిరక్షణ, నీటి సంరక్షణ మరియు శాస్త్రీయ సలహాలను కలిపి అమలు చేయడం ద్వారా వ్యవసాయాన్ని మరింత స్థిరమైనది, లాభదాయకమైనది మరియు వాతావరణ ప్రతిఘటన కలిగినదిగా మార్చవచ్చు.

“వాతావరణాన్ని మనం మార్చలేము; కానీ వాతావరణానికి అనుగుణంగా మన వ్యవసాయాన్ని మార్చుకోవచ్చు. ముందస్తు ప్రణాళికే రైతు నష్టాన్ని తగ్గించే మొదటి అడుగు.”

*డా. ఎస్. బాలాజీ నాయక్, 9177340314, సీనియర్ శాస్త్రవేత్త (భూసార శాస్త్రం)
డా. పి. సుజాతమ్మ, ప్రధాన శాస్త్రవేత్త మరియు సమన్వయకర్త
ఏరువాక కేంద్రం, కర్నూలు

Read More

అసాధారణ వాతావరణ పరిస్థితులకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక

వాతావరణ మార్పుల ప్రభావం వల్ల వ్యవసాయ రంగం ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. భారతదేశ వ్యవసాయం ప్రధానంగా వర్షాధారం పై ఆధారపడి ఉంది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1వ తేదీన కేరళ తీరాన్ని చేరుకొని, క్రమంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో సాధారణంగా జూన్ మొదటి లేదా రెండవ వారంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. రైతులు ఈ వర్షాలను ఆధారంగా చేసుకొని ఖరీఫ్ పంటల సాగును ప్రారంభిస్తారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా నైరుతి రుతుపవనాల రాక ఒకటి నుండి మూడు వారాల వరకు ఆలస్యమవుతోంది. దీని కారణంగా విత్తనాల మొలక ఆలస్యం కావడం, సాగు విస్తీర్ణం తగ్గడం, నేలలో తేమ కొరత ఏర్పడడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అదేవిధంగా, వర్షపాతం ఆలస్యంగా ప్రారంభమవడం, ఒకేసారి అధిక వర్షపాతం నమోదవడం, పంట పెరుగుదల మధ్యలో పొడి విరామాలు (డ్రై స్పెల్స్) ఏర్పడడం, తుఫానులు, వడగాల్పులు మరియు ఉష్ణోగ్రతలలో తీవ్రమైన హెచ్చుతగ్గులు వంటి అసాధారణ వాతావరణ పరిస్థితులు పంటల పెరుగుదల మరియు దిగుబడిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు ముందస్తు ప్రణాళికతో స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన ప్రత్యామ్నాయ పంటలను మరియు తక్కువ వ్యవధిలో పరిపక్వత చెందే పంట రకాలను ఎంపిక చేసుకొని సాగు చేయడం ద్వారా నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక, విత్తే సమయాల్లో అవసరమైన మార్పులు, స్వల్పకాలిక పంట రకాల వినియోగం, నేలలో తేమ మరియు నీటి సంరక్షణ చర్యల అమలు, అలాగే అందుబాటులో ఉన్న సహజ వనరులను సమర్థవంతంగా వినియోగించడం వంటి అంశాలు ప్రధానంగా ఉంటాయి.
  1. వర్షాకాలం ఆలస్యమైనప్పుడు
    వర్షాలు జూన్ నెలలో ప్రారంభం కాక జూలై లేదా ఆగస్టు వరకు ఆలస్యం అయితే సాధారణంగా సాగు చేసే దీర్ఘకాలిక పంటలకు బదులుగా స్వల్పకాలిక పంటలను ఎంచుకోవాలి. పెసర, మినుము, ఉలవలు, నువ్వులు, జొన్న, సజ్జ, కొర్రలు వంటి పంటలు తక్కువ వ్యవధిలో పూర్తవుతాయి మరియు తక్కువ నీటితో కూడా మంచి దిగుబడిని ఇస్తాయి.
  2. మధ్యలో పొడి విరామం ఏర్పడినప్పుడు
    వర్షాలు ప్రారంభమైన తరువాత కొన్ని వారాలు వర్షాభావం ఏర్పడితే నేలలో తేమను కాపాడటం అత్యంత ముఖ్యం. కలుపు నివారణ చేయడం, నేలపై మల్చింగ్ చేయడం, అంతరకృషి నిర్వహించడం, అవసరమైతే జీవరక్షక నీటిపారుదల ఇవ్వడం ద్వారా పంటను రక్షించవచ్చు. ఆకుల ద్వారా పోషకాలు అందించడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
  3. అధిక వర్షాలు కురిసినప్పుడు
    భారీ వర్షాల వల్ల పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా వెంటనే బయటకు వెళ్లేలా డ్రైనేజీ సౌకర్యం కల్పించాలి. నీరు నిల్వ ఉండటం వల్ల వేరుకుళ్లు, శిలీంధ్ర వ్యాధులు మరియు పోషక లోపాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందువల్ల అవసరమైన మొక్కల సంరక్షణ చర్యలు వెంటనే చేపట్టాలి.
  4. వర్షాలు ముందుగానే ముగిసినప్పుడు
    వర్షాకాలం త్వరగా ముగిసి నేలలో తేమ తగ్గినప్పుడు తక్కువ కాలంలో పూర్తయ్యే పంటలు లేదా రబీ సీజన్‌లో తక్కువ నీటితో సాగు చేయగల పంటలను ఎంచుకోవాలి. నేలలో తేమను సంరక్షించేందుకు మల్చింగ్, కన్జర్వేషన్ టిల్లేజ్ వంటి పద్ధతులు ఉపయోగించాలి.
  5. దీర్ఘకాలిక కరవు పరిస్థితులు: పంట ఎదుగుదల దశలో వర్షాలు ఆగిపోతే, మొక్కల సంఖ్యను తగ్గించి, కలుపును తీసివేసి వాటిని నేలపై కప్పి ఉంచడం ద్వారా తేమను కాపాడుకోవాలి. నీటి ఎద్దడిని తట్టుకునే పంటలను (అలసందలు) వంటివి సాగు చేయడం మేలు.

ప్రత్యామ్నాయంగా సాగు చేయదగిన పంటలు
• వేరుశెనగకు బదులుగా – పెసర, నువ్వులు, ఉలవలు
• వరికి బదులుగా – జొన్న, సజ్జ, రాగులు
• పత్తికి బదులుగా – పెసర, మినుము, నువ్వులు
• మొక్కజొన్నకు బదులుగా – జొన్న, కొర్రలు, సజ్జ

రైతులు పాటించాల్సిన ముఖ్య సూచనలు
• వాతావరణ శాఖ సూచనలను ప్రతిరోజూ గమనించాలి.
• స్థానిక వ్యవసాయ అధికారుల సలహాలను పాటించాలి.
• ధృవీకరించిన విత్తనాలను మాత్రమే వినియోగించాలి.
• వర్షపు నీటిని సంరక్షించే చర్యలు చేపట్టాలి.
• పంటల బీమా పథకాలలో నమోదు చేసుకోవాలి.
• సమగ్ర పంటల నిర్వహణ పద్ధతులను అనుసరించాలి.

నేలలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉండటం వల్ల మొక్కల ఎదుగుదల మెరుగుపడి, వర్షాభావ పరిస్థితుల్లో కూడా పంటలు నిలదొక్కుకుని మంచి దిగుబడిని ఇస్తాయి.
• వేసవి దుక్కి: వేసవిలో లోతుగా దున్నడం వల్ల వర్షపు నీరు నేలలోకి బాగా ఇంకి తేమ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అలాగే కలుపు మొక్కలు మరియు కొన్ని కీటకాల సమస్య కూడా తగ్గుతుంది.
• వాలు ప్రాంతాల్లో భూమి సమోన్నత రేఖలకు అనుగుణంగా దున్నడం వల్ల వర్షపు నీటి ప్రవాహం తగ్గి నేల కోత నివారించబడుతుంది.
• పొలాన్ని చిన్న చిన్న గట్లుగా విభజించడం ద్వారా వర్షపు నీరు పొలంలోనే నిలిచి నేలలోకి ఇంకుతుంది.
• మల్చింగ్: పంట అవశేషాలు, గడ్డి లేదా ప్లాస్టిక్ మల్చ్ను నేలపై పరచడం ద్వారా నేల నుంచి నీటి ఆవిరీభవనం తగ్గి తేమ ఎక్కువ కాలం ఉంటుంది. అలాగే కలుపు మొక్కల పెరుగుదల కూడా తగ్గుతుంది.
• అంతరకృషి: పంటల మధ్య తేలికగా దున్నడం వల్ల నేలపై ఏర్పడే గట్టి పొర తొలగి నీటి చొరబాటు మెరుగుపడుతుంది మరియు తేమ నష్టం తగ్గుతుంది.
• సమయానికి కలుపు నివారణ: కలుపు మొక్కలు నేలలోని తేమను ఎక్కువగా వినియోగిస్తాయి. కాబట్టి వాటిని తొలగించడం ద్వారా ప్రధాన పంటకు తేమ ఎక్కువగా అందుతుంది.
• వెడల్పు వరుసల సాగు: నీరు సులభంగా చొరబడేలా వెడల్పు బెడ్లు మరియు కాలువలు ఏర్పాటు చేయడం ద్వారా నీటి నిల్వ, పారుదల రెండూ మెరుగుపడతాయి.
• సేంద్రీయ పదార్థాల వినియోగం పశువుల ఎరువు, కంపోస్ట్, పంట అవశేషాలను నేలలో కలపడం వల్ల నేల నిర్మాణం మెరుగుపడి నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం పెరుగుతుంది.

ప్రస్తుతం వాతావరణ మార్పులు వ్యవసాయానికి ప్రధాన సవాలుగా మారాయి. అయితే అసాధారణ వాతావరణ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, తగిన ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను అమలు చేయడం ద్వారా రైతులు పంట నష్టాలను తగ్గించుకొని స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం, వాతావరణ ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం మరియు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేయడం ద్వారా వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చుకోవచ్చు.

ఇ. ప్రియాంకబాయి, రిసెర్చ్ అసోసియేట్, యాజమాన్య విభాగము,
వ్యవసాయ పరిశోధన స్థానం, కదిరి, ఫోన్ : 7674886210

Read More

‘ఎల్ నినో’ ముప్పు: వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సవాళ్లు – నివారణ చర్యలు

ప్రస్తుతం 2026లో ఎల్ నినో (El Niño) అధికారికంగా ప్రారంభమైందని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO), అమెరికాకు చెందిన నోవా (NOAA) శాస్త్రవేత్తలు ధృవీకరించారు. ఇది రాబోయే శరదృతువు (Autumn) నాటికి మరింత బలపడి, ప్రమాదకరమైన “సూపర్ ఎల్ నినో” (Super El Niño) స్థాయికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ కేంద్రాలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి.

ఎల్ నినో అంటే పసిఫిక్ మహాసముద్రం (Pacific Ocean) యొక్క మధ్య మరియు తూర్పు భాగాలలో సముద్ర ఉపరితల నీటి ఉష్ణోగ్రత సాధారణం కంటే పెరగడం అనే ఒక వాతావరణ దృగ్విషయం. ఇది సాధారణంగా ప్రతి 2 నుండి 7 సంవత్సరాలకు ఒకసారి సంభవిస్తుంది మరియు 9-12 నెలల నుండి కొన్నిసార్లు 2 సంవత్సరాల వరకు కొనసాగవచ్చు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం, ఉష్ణోగ్రత మరియు గాలుల నమూనాలను మారుస్తుంది. ఇది El Niño–Southern Oscillation (ENSO) అనే పెద్ద వాతావరణ వ్యవస్థలో ఒక దశ. ENSO లో మూడు దశలు ఉన్నాయి:

  1. El Niño (వేడి దశ),
  2. La Niña (చల్లని దశ) మరియు
  3. Neutral (సాధారణ స్థితి).

ఎల్ నినో లక్షణాలు:
• సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుదల (+0.5°C లేదా అంతకంటే ఎక్కువ)
• గాలుల నమూనాలలో మార్పులు
• వర్షపాత నమూనాలలో మార్పులు
• దక్షిణ అమెరికా ప్రాంతంలో భారీ వర్షాలు
• ఆస్ట్రేలియా మరియు భారతదేశంలో కరవు పరిస్థితులు

ముఖ్య గమనిక: ఎల్ నినో మాత్రమే వర్షపాతాన్ని నిర్ణయించదు. ఇండియన్ ఓషన్ డైపోల్ (IOD), స్థానిక వాతావరణ వ్యవస్థలు వంటి ఇతర అంశాలు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. అందువల్ల, కొన్నిసార్లు ఎల్ నినో ఉన్నప్పటికీ మంచి వర్షాలు కురవవచ్చు (IOD పాజిటివ్‌గా ఉంటే).
భారతదేశంలో వ్యవసాయంపై ఎల్ నినో ప్రభావాలు

భారతదేశ వ్యవసాయం వర్షంపై చాలా ఎక్కువగా ఆధారపడి ఉంటుంది, ముఖ్యంగా నైరుతి రుతుపవనాలపై (south-west monsoon). ఎల్ నినో సంభవించిన సంవత్సరాల్లో రుతుపవనాల వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం మరియు కరవు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఉదాహరణకు 2002, 2009 మరియు 2015 లలో ఎల్ నినో కారణంగా వర్షపాత కొరత ఏర్పడింది.

  1. వర్షపాత కొరత (Drought): ఎల్ నినో సమయంలో వర్షపాతం తగ్గడం వల్ల కరవు పరిస్థితులు ఏర్పడతాయి. దీనివల్ల నీటి కొరత ఏర్పడి పంటలు ఎండిపోయే అవకాశం ఉంది.
  2. పంట ఉత్పత్తి తగ్గడం: వరి, జొన్నలు, గోధుమలు, పప్పుధాన్యాలు మొదలైన ముఖ్యమైన పంటల ఉత్పత్తి తగ్గుతుంది. దీనివల్ల రైతులకు నష్టం వాటిల్లుతుంది.
  3. నీటిపారుదల సమస్య: జలాశయాలు (రిజర్వాయర్లు) మరియు భూగర్భ జలాల మట్టాలు తగ్గిపోతాయి. దీనివల్ల పంటలకు నీటిపారుదల సౌకర్యం కల్పించడం కష్టమవుతుంది.
  4. కీటకాలు మరియు తెగుళ్ల పెరుగుదల: వాతావరణ మార్పుల కారణంగా కొన్ని రకాల కీటకాలు మరియు వ్యాధులు/తెగుళ్లు పెరుగుతాయి. ఇది పంటల నాణ్యతను మరియు ఉత్పత్తిని దెబ్బతీస్తుంది.

నివారణ చర్యలు

  1. కరవు తట్టుకునే పంటలు: రాగులు, జొన్నలు, సజ్జలు మొదలైన తక్కువ నీరు అవసరమయ్యే పంటలను పండించడం ఉత్తమం.
  2. నీటి సంరక్షణ: వర్షపు నీటి నిల్వ (వాటర్ హార్వెస్టింగ్), వ్యవసాయ కుంటల నిర్మాణం చేయడం.
  3. సరైన పంట ప్రణాళిక: వాతావరణ సమాచారం ఆధారంగా పంట ఎంపిక మరియు విత్తే సమయాన్ని నిర్ణయించడం.
  4. సూక్ష్మ నీటిపారుదల సాంకేతికత: బిందు (డ్రిప్) మరియు తుంపర (స్ప్రింక్లర్) నీటిపారుదల పద్ధతులను ఉపయోగించడం నీటి పొదుపునకు సహాయపడుతుంది.
  5. పంట బీమా (Crop Insurance): పంట నష్టం నుండి రక్షణ పొందడానికి బీమాను ఉపయోగించుకోవడం.

రైతులకు వ్యవసాయ సలహాలు మరియు ముందస్తు జాగ్రత్తలు
జూన్ నెల ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి కీలకమైన సమయం. భారత వాతావరణ శాఖ (IMD) మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయాల ముందస్తు అంచనాల ప్రకారం, ఈ ఏడాది జూన్ నెల వాతావరణం మరియు రైతులు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తల సంక్షిప్త సమాచారం:

వ్యవసాయ భూమి సిద్ధం చేయడం మరియు విత్తడం
• నేలను సిద్ధం చేయడం: తొలకరి జల్లులు మరియు ప్రారంభంలో కురిసే వర్షాలను ఉపయోగించుకుని భూమిని లోతుగా దుక్కి దున్ని సిద్ధం చేసుకోండి. ఇది మట్టిలో తేమను పట్టి ఉంచడానికి సహాయపడుతుంది.
• విత్తడానికి తొందరపడవద్దు: కనీసం 50 నుండి 60 మి.మీ. మేర మంచి వర్షం పడి, మట్టిలో తగినంత పదును (తేమ) ఏర్పడే వరకు విత్తే కార్యక్రమాన్ని ప్రారంభించవద్దు.
• కరవును తట్టుకునే రకాల ఎంపిక: వర్షపాత కొరత సూచనలు ఉన్నందున, తక్కువ కాలపరిమితిలో చేతికి వచ్చే మరియు తక్కువ నీరు అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటలు మరియు రకాలను (ఉదాహరణకు: జొన్న, సజ్జ, పెసర, మినుము, కంది మొదలైనవి) ఎంపిక చేసుకోవడం ఉత్తమం.
• భూగర్భ జలాల సద్వినియోగం: వర్షాల అస్థిరత ఉన్నందున వ్యవసాయ కుంటలు (ఫార్మ్ పాండ్స్), బోర్‌వెల్ మరియు బిందు సేద్యం (Drip Irrigation) పద్ధతిని ఉపయోగించడానికి ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకోండి.

సారాంశం
ప్రపంచవ్యాప్త ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా ఎల్ నినో పరిణామాలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇది వాతావరణ మార్పులకు ఒక ముఖ్యమైన సూచిక. “2026 లో పూర్తి కరవు లేదా పూర్తిగా మంచి వర్షాలు కురుస్తాయని ఖచ్చితంగా చెప్పలేం – కానీ ‘అస్థిర వాతావరణం’ అనేది మాత్రం నిజం.” ఎల్ నినో అనేది ఒక సహజ వాతావరణ ప్రక్రియ అయినప్పటికీ, దాని ప్రభావాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా వ్యవసాయం మరియు ఆహార భద్రతపై ఇది పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల, విజ్ఞాన ఆధారిత వ్యవసాయం, వాతావరణ సమాచారం మరియు సరైన ప్రణాళికల ద్వారా మనం దీని ప్రభావాన్ని తగ్గించవచ్చు.

“ఎల్ నినోను నిరోధించడం సాధ్యం కాదు, కానీ దాని ప్రభావాలను తగ్గించడం మన చేతుల్లోనే ఉంది”

డా. బి. చంద్ర శేఖర్, నేల (మృత్తికా) శాస్త్ర అధ్యాపకులు, పీజీఐహెచ్ఎస్ (PGIHS), ములుగు, సిద్దిపేట,
శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం (SKLTGHU)

Read More

వ్యవసాయ కమిషన్ బృందం ఇక్రిశాట్‌ను సందర్శించింది

అంతర్జాతీయ మెట్ట ప్రాంతాల పంటల పరిశోధన సంస్థ (ఇక్రిశాట్)ని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ బుధవారం సందర్శించింది. కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు గడుగు గంగాధర్, భవానిరెడ్డి, కేవీఎన్ రెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి కమిషన్ బృందంలో ఉన్నారు. పంట క్షేత్రాలను ప్రయోగశాలలను పరిశీలించింది. జొన్న, వేరుసెనగ, శనగ, కంది, ఇతర తృణధాన్య పంటల గురించి అక్కడి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ హిమాన్ష్‌పాఠక్, అధికారులు, శాస్త్రవేత్తలతో బృందం సమావేశమై.. పంటల మార్పిడి, ఆరుతడి పంటలు, నీటి సంరక్షణ, సుస్థిర వ్యవసాయం, రైతుల ఆదాయం పెంపు, చీడ, పీడల బెడద లేకుండా సాగు తదితర అంశాలపై చర్చించింది.

Read More