తేనెటీగల విషంలో ఔషధ గుణాలు
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయం ఆవరణలోని సమీకృత తేనెటీగల పెంపక కేంద్రంలో తేనెటీగల నుంచి విషాన్ని సేకరిస్తున్నారు. బ్యాటరీ ఛార్జింగ్ కలిగిన బీ వీనం కలెక్టర్ (బీవీసీ) అనే ఎలక్ట్రానిక్ పరికరాన్ని తేనెటీగల పెట్టె ప్రవేశద్వారం చెంత అమర్చారు. పెట్టె వద్ద తేనెటీగలు రాకపోకలు సాగించేటప్పుడు అవి బీవీసీ కంపార్టుమెంట్‌పై వాలగానే ఎలక్ట్రిక్ వైబ్రేషన్‌కు గురై వాటికున్న స్టింగ్‌ల ద్వారా విషపూరిత స్రావాన్ని విడుదల చేస్తున్నాయి. ఆ స్రావాలు కంపార్టుమెంటులోని అద్దంపై మైనంలా ఏర్పడుతున్నాయి. వాటిని సేకరించి గాజుసీసాలో భద్రపరుస్తున్నారు. తేనెటీగలు కుట్టినప్పుడు విడుదల చేసే విషపూరిత స్రావాల్లో వివిధ రసాయనాలుంటాయని, వీటిని చర్మ సమస్యలు, అర్ధరైటిస్ వంటి చికిత్సల్లో ఉపయోగిస్తారని కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. ఒక గ్రాము విషాన్ని సేకరించడానికి సుమారుగా 10 వేల నుంచి 15 వేల తేనెటీగలను పరికరంలోకి పంపాల్సి ఉంటుందని చెప్పారు.

