వ్యవసాయ పంపుసెట్లకు… రూ.508 కోట్లతో విద్యుదీకరణ పథకం
తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్తు సంస్థ కొత్తగా వ్యవసాయ పంపు సెట్ల విద్యుదీకరణ పథకాన్ని రూపొందించింది. రూ. 508.95 కోట్ల విలువైన ఈ పథకానికి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నల్గొండ, సూర్యాపేట, సరూర్‌నగర్, మెదక్, వికారాబాద్, యాదాద్రి, నారాయణపేట్, రాజేంద్రనగర్, గద్వాల్, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఆపరేషన్ సర్కిళ్లకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. ప్రస్తుత విద్యుత్తు లైన్లకు దూరంగా ఉన్న పొలాలకు ఈ పథకంలో ప్రాధాన్యమివ్వనున్నారు. ఈ పథకం కింద 25 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ నుంచి నాలుగైదు హెచ్‌పీ పంపు సెట్లకు కనెక్షన్ ఇవ్వనున్నారు. 25కేవీఏ ట్రాన్స్ఫార్మర్, దానికి అవసరమైన 11 కేవీ కండక్టర్, ఎల్టీ కేబుల్, పోల్స్ వంటివి ఏర్పాటు చేయాలంటే దాదాపు రూ.3 లక్షల వరకు ఖర్చవుతుంది. ఒక్కో కనెక్షన్‌కు రూ. 75 వేల వ్యయం కానుంది. ఒక వ్యవసాయ కనెక్షన్‌కు రైతు చెల్లించేది రూ. 5 వేలు మాత్రమే. మిగిలిన రూ. 70 వేలను ప్రభుత్వం రాయితీ కింద భరించనుంది. దీనికి సంబంధించిన పనులన్నీ సంస్థ పరిధిలోనే జరుగుతాయి.

