సన్న వడ్లకు బోనస్‌ వలన ఇతర పంటల విస్తీర్ణం తగ్గుతుంది

వరి సన్నాలకు బోనస్‌ ఇవ్వడంతో దాని సాగు వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. దీని వల్ల ఇతర పంటల విస్తీర్ణం తగ్గుతుంది కాబట్టి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం వరితో పాటు ఇతర పంటలను ప్రోత్సహించాలని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ సూచించారు. సోమవారం ఆయన వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ కార్యాలయంలో ఛైర్మన్‌ కోదండరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. వ్యవసాయ నిపుణుడు నరసింహారెడ్డి, కమిషన్‌ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరగోపాల్‌ మాట్లాడుతూ.. ఆ పంటల విస్తీర్ణం పెరిగేందుకు కృషి చేయాలన్నారు. కొత్త విత్తన చట్టం వస్తే రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు.

Read More

పంట పండించిన రైతులకే కొనుగోలు కేంద్రాల్లో ప్రవేశం

తెలంగాణలో పంట పండించిన రైతులు మాత్రమే తమ ఉత్పత్తులను మార్క్‌ఫెడ్‌, ఇతర ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలి. తప్పనిసరిగా వారు ఆధార్‌ కార్డు కలిగి ఉండాలి. ధ్రువీకరణ కోసం కొనుగోలు కేంద్రాల్లో ఇ పోస్‌ (ఎలక్ట్రానిక్‌ పాయింట్‌ ఆఫ్‌ సేల్‌) యంత్రాలతో ధ్రువీకరణ అనంతరమే రైతుల నుంచి పంట తీసుకుంటారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పెసలు, కందులు, జొన్నలు, సోయా, పొద్దుతిరుగుడు వంటి పంటలకు సరైన ధరలు రానప్పుడు ప్రభుత్వం మార్కెఫెడ్‌ ద్వారా వాటిని మద్దతు ధరకు కొంటోంది. ఈ కేంద్రాలకు దళారుల బెడద ఎక్కువైంది. రైతుల వద్ద తక్కువ ధరకు పంట కొన్న వ్యాపారులు.. కొనుగోలు కేంద్రాలకు వచ్చి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వీరికి అడ్డుకట్ట వేసేందుకు అన్ని రాష్ట్రాల్లో ఆధార్‌ కార్డుల నమోదు ఆధారిత కొనుగోళ్ల విధానం చేపట్టాలని, దీనికోసం నోడల్‌ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఇటీవల లేఖ రాసింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ను నోడల్‌ ఏజెన్సీగా నియమిస్తూ కొత్త విధానంపై ఉత్తర్వులు జారీ చేసింది.రాష్ట్రంలో ప్రతి కొనుగోలు కేంద్రంలో ఇపోస్‌ యంత్రం ఏర్పాటు చేసి వాటిలో రైతులందరి భూముల సర్వే నంబర్లు, పంటల సమాచారం (వ్యవసాయశాఖ పంట నమోదు) ద్వారా అనుసంధానం చేస్తారు. రైతులు తమ పంట ఉత్పత్తులతో ఆయా కేంద్రాలకు వచ్చినప్పుడు ముందుగా ఆధార్‌ కార్డుతో ఇపోస్‌ నమోదు చేసుకోవాలి. అందులో రైతు సాగు చేసిన పంట వివరాలను, తెచ్చిన పంట సరిచూసి.. తర్వాత కొనుగోళ్లకు అనుమతిస్తారు. ఇపోస్‌ యంత్రంలో రైతు భూమి, పంటల వివరాలున్నా.. ఆధార్‌ కార్డు లేకపోయినా, పేరు, ఇతర వివరాల్లో తప్పులున్నా.. జాయింట్‌ కలెక్టర్‌ వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకొని ఆ పత్రాన్ని తెచ్చి సమర్పిస్తే పంటను కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం ధాన్యం, పత్తేతర కొనుగోలు కేంద్రాలకే పరిమితం చేశారు. త్వరలో పౌరసరఫరాల శాఖ, సీసీఐల ద్వారా జరిగే వరి, పత్తి కేంద్రాల్లోనూ అమలు చేయనున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా కొత్త విధానం అమలుకు మార్క్‌ఫెడ్‌ సిద్ధమైంది. తమ పరిధిలోని అన్ని కొనుగోలు కేంద్రాలు, సహకార సంఘాల్లో వెంటనే ఇపోస్‌ యంత్రాలను కొనుగోలు చేయాలని సంస్థ ఎండీ శ్రీనివాస్‌ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో త్వరలో పెసలు కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. 58,728 ఎకరాల్లో పెసర పంట వేయగా.. 16,326 క్వింటాళ్ల దిగుబడిని అంచనా వేస్తున్నారు. దీంతో ఖమ్మం, సంగారెడ్డి, వికారాబాద్‌ తదితర జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు.

Read More

తెలంగాణలో ప్రతి జిల్లాలో రైతు విజ్ఞాన కేంద్రం!

పంటల సాగులో ఆధునిక సాంకేతికతను అందుబాటులో ఉంచడంతోపాటు ప్రయోగాలు, ఆవిష్కరణల ఫలాలను తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు అందించేందుకు వీలుగా ప్రతి జిల్లాకో రైతు విజ్ఞాన కేంద్రం (ఆర్‌వీకే) స్థాపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆచార్య జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ మేరకు ఆర్‌వీకేలపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 9 ఏరువాక కేంద్రాలు, 8 కృషి విజ్ఞాన కేంద్రా(కేవీకే)లు పనిచేస్తున్నాయి. ఇందులో కొద్దిమంది శాస్త్రవేత్తలే పని చేస్తున్నారు. ఏకంగా 15 జిల్లాల్లో శాస్త్రవేత్తలు లేరు. రైతులకు వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడం, పంటల మార్పిడి ఆవశ్యకతను వివరించడం, నేరుగా వరి విత్తనం వేయడం, పత్తిలో కలుపు మొక్కల నివారణ వంటి వాటిని ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. డ్రోన్లు, యంత్రాల వినియోగం, కృత్రిమ మేధ, రోబోటిక్స్‌ వంటి ఆధునిక సాంకేతిక సేవలను అందించాలని యోచిస్తోంది. వీటన్నింటి అమలుకు ప్రత్యేకంగా రైతు విజ్ఞాన కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించింది. దీనిపై ప్రతిపాదనలు రూపొందించాలని అగ్రివర్సిటీని ఆదేశించింది.

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 17 ఏరువాక, కేవీకేలను ఆర్‌వికెలుగా మారుస్తారు. మరో 15 జిల్లాల్లో కొత్త ఆర్‌వికెలను ఏర్పాటు చేస్తారు. అప్పుడు 32 జిల్లాల్లో విజ్ఞాన కేంద్రాలు అందుబాటులోకి వస్తాయి. ప్రతి కేంద్రంలో ఆరుగురు చొప్పున శాస్త్రవేత్తలను నియమిస్తారు. ఇతర సహాయ సిబ్బంది ఉంటారు. వాటిలో ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తారు. వాటికి అనుబంధంగా విత్తన, సాగు క్షేత్రాలు ఉంటాయి. వాటిలో డ్రోన్లు, యంత్రాలపై శిక్షణ ఇస్తారు. నిత్యం పరిశోధనలు, ప్రయోగాలకు, రైతు శిక్షణ కార్యక్రమాలకు అవకాశం కల్పిస్తారు. అంకుర సంస్థలకు సైతం స్థలాలను కేటాయిస్తారు.

Read More

తెలంగాణ రాష్ట్రంలో రాయితీలతో ఉద్యాన పంటలకు ఊతం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించాయి. మిషన్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌, నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఎడిబుల్‌ ఆయిల్స్‌-ఆయిల్‌ పామ్‌, రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన తదితర పథకాలను అమలు చేస్తూ రాయితీలను అందజేస్తున్నాయి.
సమీకృత ఉద్యాన అభివృద్ధి.. పథకం ద్వారా పండ్ల తోటలు, నీటి కుంటలు, కూరగాయల సాగును ప్రోత్సహిసున్నారు. రాయితీతో కూరగాయల నారును అందించడంతోపాటు, ప్రస్తుత సంవత్సరం డ్రాగన్‌ ఫ్రూట్‌, బొప్పాయి, మామిడి, జామ, కూరగాయలు, తదితర పంటల సాగుకు సైతం రాయితీని కల్పిస్తున్నారు.

ఆయిల్‌పామ్‌ సాగు
తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ సాగును పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది.ఈ సాగును పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం రైతులకు బిందు, తుంపర సేద్యంపై రాయితీ ఇస్తున్నారు. ఎకరాకు రూ.4,200 ల చొప్పున నాలుగేళ్లపాటు రాయితీ అందుతుంది.

రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన
20 గుంటల విస్తీర్ణంలో పందిరి నిర్మాణానికి రూ.50 వేల సబ్సిడీ అందిస్తున్నారు. గరిష్టంగా 2.20 ఎకరాల వరకు రాయితీ అందుతుంది. సన్నకారు రైతులు ఈ పథకం ద్వారా శాశ్వత పందిరి ఏర్పాటు చేసుకొని కూరగాయలు సాగు చేపట్టొచ్చు. రైతులకు అవగాహన కల్పిస్తూ వీటిపై మొగ్గు చూపేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

జాతీయ వెదురు పథకం
సాగుకు యోగ్యం కాని భూముల్లో, పొలం గట్లపైన, వెదురు మొక్కలు నాటే రైతులకు ప్రభుత్వం రెండేళ్ల వరకు నిర్వహణ ఖర్చు కింద మొదటి సంవత్సరం రూ. 75 రెండో సంవత్సరం రూ. 45 చొప్పున అందజేస్తారు.

బిందు సేద్యం
ఉద్యాన పంటలు సాగు చేయడానికి డ్రిప్‌, స్ప్రింకర్లను సబ్సిడీపై అందించనున్నారు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం రాయితీతో పరికరాలను అందిస్తున్నారు. బీసీ రైతులకు 90 శాతం, అయిదెకరాల్లోపు ఉన్న ఓసీ రైతులకు 80 శాతం సబ్సిడీని ప్రభుత్వం అందిస్తోంది. తుంపర సేద్యం పరికరాలకు అందరికీ 75 రాయితీని అందిస్తున్నారు.

రైతులు సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, రాయితీలు పొందేందుకు రైతులు పట్టాదారు పాస్‌బుక్‌, బ్యాంకు పాస్‌బుక్‌, ఆధార్‌ కార్డు జిరాక్స్‌, పాస్‌పోర్టు సైజు ఫొటోతో సంబంధిత ఉద్యాన శాఖ అధికారులకు దరఖాస్తు అందజేయాలి. గరిష్ఠంగా అయిదెకరాల భూమి కలిగిన రైతులు అర్హులు.
-కేఆర్‌ లత, రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారిణి

Read More

రైతుముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమానికి అనూహ్య స్పందన – PJTAU ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య

600 గ్రామాల్లో 37,000 రైతులతో అవగాహన కార్యక్రమం

  • రైతుల్లో అసంతృప్తి లేదు.. కానీ చేయాల్సింది చాలా ఉంది

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ శాఖ సహకారంతో నిర్వహిస్తున్న వినూత్న కార్యక్రమం ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ రాష్ట్రవ్యాప్తంగా నిరాటంకంగా, విజయవంతంగా సాగుతోంది. మే 5వ తేదీన వికారాబాద్ జిల్లా ధరూర్ లో ఈ కార్యక్రమాన్ని శాసనసభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ శ్రీ M. కోదండ రెడ్డి, PJTAU ఉపకులపతి డాక్టర్ అల్దాస్ జానయ్య లాంచనంగా ప్రారంభించారు. ఆరోజు నుండి ఈ కార్యక్రమం నేటి వరకు 600 గ్రామాల్లో నిర్వహించగా సుమారు 31,000 మంది పురుషులు, 6,000 మంది మహిళలు పాల్గొనటం జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తం 37,000 మంది రైతులతో శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ విద్యార్థులు ముఖాముఖిగా మాట్లాడారు. ఇప్పటివరకు ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ MP డాక్టర్ మల్లురవి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ G. చిన్నారెడ్డి, రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు, ఎమ్మెల్సీలు, సుమారు 25 మంది శాసనసభ్యులు, వివిధ స్థాయి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అదేవిధంగా శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ విద్యార్థులతో పాటు వారంలో ఒకరోజు ఉపకులపతి, ఇతర విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. PJTAU శాస్త్రవేత్తలు, విద్యార్థులు, వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులు, అభ్యుదయ రైతులు, రైతు గ్రూపులు, సంఘాల ప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఆరు అంశాలైన తక్కువ యూరియా వాడి సాగు ఖర్చును తగ్గించడం, అవసరం మేరకే రసాయనాలను వాడి నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడడం, వివిధ ఇన్ పుట్స్ కొనుగోలుకు సంబంధించిన రశీదులని భద్రపరచుకోవడం, సాగునీటిని ఆదా చేయడం, పంట మార్పిడులను పాటించి సుస్థిరాదాయాన్ని పొందడం, చెట్లను నాటి పర్యావరణాన్ని రక్షించడం వంటి వాటిపై శాస్త్రవేత్తలు, వ్యవసాయ విద్యార్ధులు రైతాంగానికి అవగాహన కల్పిస్తున్నారు. అలాగే రైతులు అడుగుతున్న అనేక సందేహాలను శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో నివృత్తి చేస్తున్నారు.

ఉపకులపతి సమీక్ష :-

   మూడు వారాలుగా సాగుతున్న 'రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు' కార్యక్రమం పై ఉపకులపతి అల్దాస్ జానయ్య ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ కార్యక్రమానికి రైతాంగం నుంచి మంచి స్పందన వస్తుందని వివరించారు. ప్రభుత్వం రైతాంగానికి అమలు చేస్తున్న కార్యక్రమాలు, ప్రస్తుత వ్యవసాయ పరిస్థితుల పై రైతాంగంలో ఎటువంటి అసంతృప్తి లేదని జానయ్య స్పష్టం చేశారు. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాల కారణంగా రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతుందని తెలిపారు. అలాగే ఇంకా కొన్ని వ్యవసాయ అంశాలకి ప్రభుత్వపరంగా ప్రోత్సాహం ఇవ్వవలసిందిగా రైతులు కోరుతున్నారని జానయ్య అన్నారు.  ముఖ్యంగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఎదురయ్యే నష్టాల్ని అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం పంటల బీమా సదుపాయం ప్రవేశపెట్టాలని రైతులు కోరుకుంటున్నారని, అలాగే చిన్న, సన్నకారు రైతులకి ఆధునిక వ్యవసాయ పనిముట్లని మరియు పచ్చి రొట్ట విత్తనాలను రాయితీపై  అందించాలని, విస్తృతంగా భూసార పరీక్షలు నిర్వహించాలని రైతాంగం కోరుకుంటున్నారని అల్దాస్ జానయ్య వివరించారు. ఇదే స్ఫూర్తితో రైతు సోదరులు, మహిళలు, అభ్యుదయ రైతులు, రైతు గ్రూపులు, సంఘాల ప్రతినిధులు, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొని  దీన్ని ఒక సామాజిక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఉపకులపతి కోరారు.
Read More