కార్పోరేషన్ల ప్రగతిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు సచివాలయంలో టిజి అగ్రోస్, హాకా, టిజిఆర్ఐసి, టిజి కోఆపరేటివ్ యూనియన్, టిజి వేర్‌హౌస్ కార్పోరేషన్ల ప్రగతిని సమీక్షించారు. సమీక్ష సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఏర్పడ్డ కార్పోరేషన్లు, మారుతున్న రైతుల, ప్రభుత్వ ప్రాధాన్యతలను బట్టి వాటిని నిర్వహించే విధంగా బాధ్యత తీసుకొంటేనే అవి మనుగడ సాగించగలవని, అదేవిధంగా ఒకే కార్యకలాపాల్ని నిర్వహించే సంస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాల్సి ఉందని తెలిపారు. తదనుగుణంగా సదరు సంస్థలన్నింటిని రానున్న సంవత్సరాలలో వారు నిర్వహించే కార్యకలాపాల మీద మరియు సంస్థల ఆర్థికస్థితి గురించి నివేదిక అందిన వెంటనే ఆయా సంస్థల బలోపేతానికి లేదా విలీనానికి సంబంధించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అంతిమంగా ప్రభుత్వం గాని, ప్రభుత్వ అనుబంధ సంస్థల ముఖ్యోద్ధేశం రైతులకు మరింత సమర్ధవంతంగా సేవలు అందించడమే అని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఐఏఎస్, మేనేజింగ్ డైరెక్టర్ చంథ్రేఖర్ రెడ్డి, ఐఏఎస్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి డా. కె.లక్ష్మీ, ఐఏఎస్, ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, శ్రీరాములు మరియు శ్రీమతి అన్నపూర్ణ తదితర అధికారులు పాల్గొన్నారు.

