బహుళ ప్రయోజనకారి ‘మైకోరైజా (వ్యామ్)’

మైకోరైజా బహుళ ప్రయోజనకారి. పంటలను వేరుకుళ్ళు, ఎండుతెగులు వంటి తెగుళ్ళనుండి కాపాడటమేగాక, వర్షాభావ పరిస్థితుల్లో సుదూర లోతులో ఉన్న నీరు, పోషకాలను సంగ్రహించి మొక్కల వేర్లకు అందిస్తుంది. మైకోరైజాను రైతు వ్యవసాయ క్షేత్రంలోనే స్వయంగా తయారు చేసుకోవచ్చు.

తయారీ విధానం : 4 మీ. పొడవు, వెడుల్పు, అరగజం లోతులో గొయ్యి తీసుకోవాలి. అందులో మట్టి మృదువుగా ఉంటే అదే మట్టిని వాడుకోవచ్చు లేదా బయట నుండి మెత్తని మన్ను సేకరించి ఎండబెట్టి శుద్ధి చేసుకుని గోతిలో నింపాలి. దానిలో మెత్తని పశువుల ఎరువు లేదా వర్మికంపోస్టు కలుపుకోవాలి. గోతిలో ప్లాస్టిక్ షీట్ పరవాలి. అందులో ఎరువు కలిపిన మట్టిని వేసి దానిలో 100 గ్రా. మైకోరైజా కల్చర్ ని కలిపి దానిలో వివిధ రకాల పప్పుధాన్యపు గింజలు, తృణధాన్యపు గింజలు, కూరగాయల గింజలు వరుసల వారీగా విత్తుకుని 40 రోజుల వరకు పెంచాలి. పెరిగిన పైరుకు వారం రోజుల పాటు నీటి తడిని ఆపి మట్టి పొడిబారిన తర్వాత మొక్కలపై కాండాలను కోసి వేయాలి. వేర్లను మట్టితో పాటు పెకలించి పొడి చేసుకుని సంచుల్లో నింపుకోవాలి. క్వింటాళ్ల కొద్ది మైకోరైజా వేర్లు అందుబాటులోకి వస్తాయి. వీటిని మెత్తగా దంచి అన్ని రకాల పైర్ల సాగులో, నారు మడుల పెంపకంలో వినియోగించుకోవచ్చు.

Read More

జీవ ఎరువుల తయారీ కోసం వియత్నాం సంస్థతో ఒప్పందం

హైదరాబాద్‌లోని జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆధునిక సాంకేతికతతో దేశంలోనే తొలిసారిగా ఆరు గంటల్లోనే వివిధ జీవ వ్యర్థ పదార్థాల(బయోవేస్ట్‌)ను పోషకాలు అధికంగా ఉండే ఎరువు(బయో ఫెర్టిలైజర్‌) గా మార్చే భారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఈ మేరకు వియత్నాంకు చెందిన ప్రసిద్ధ జీవ ఎరువుల తయారీ సంస్థ ‘బయోవే’తో అగ్రి వర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ)లో రెండు నెలల్లో దీన్ని ఏర్పాటు చేసి ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు వర్సిటీ ఉపకులపతి అల్దాస్‌ జానయ్య తెలిపారు. బయోవే.. 11 దేశాలకు జీవ ఎరువులను ఎగుమతి చేస్తోంది. ఇటీవల విదేశీ పర్యటన సందర్భంగా ఈ కంపెనీ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపిన జానయ్య.. అగ్రివర్సిటీలో ప్లాంటును ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి వారు అంగీకరించి.. ఒప్పందం కుదుర్చుకున్నారు. వీసీ సమక్షంలో బయోవే సీఈవో లీతి కామ్‌టెన్‌, అగ్రి వర్సిటీ రిజిస్ట్రార్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌లు దీనిపై సంతకం చేశారు. ఈ సంస్థ అగ్రి వర్సిటీలో ఎకరం స్థలంలో ప్లాంటు ఏర్పాటుచేసి.. రెండేళ్లపాటు ఉత్పత్తి, ప్లాంటు నిర్వహణ బాధ్యతలను చూసుకుంటుంది. ప్రస్తుతం మన దేశంలో జీవ ఎరువుల తయారీకి ఆరు నుంచి ఏడు రోజుల సమయం పడుతోంది. కొన్ని వ్యర్థాలను మాత్రమే దీనికి వినియోగిస్తున్నారు. బయోవే సంస్థ మాత్రం తమ దేశంలో లభించే వరి, మక్క, ఇతర ఆహార, ఉద్యాన పంటల వ్యర్థాలు, మాంసం వ్యర్థాలు, కుళ్లిపోయిన కూరగాయలు, పండ్లు, గుర్రపుడెక్కతోపాటు ఆహార పదార్థాల వ్యర్థాలను మర ఆడించి ఆ మిశ్రమంలో వాల్కనో నుంచి ఉద్భవించిన బ్యాక్టీరియాను కలిపి ఆరు గంటల్లోనే జీవ ఎరువులను తయారు చేస్తోంది. పది డాలర్ల విలువైన 35 కిలోల ఎరువుల బస్తాను ప్రస్తుతం ఎకరం పొలంలో వాడుతుండగా అది సత్ఫలితాలను ఇస్తోంది. అధిక దిగుబడితోపాటు ఆరోగ్యకరమైన పంటలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ ఎరువుల సాయంతో మేలిమి రకం వరిసాగులో వియత్నాం అగ్రస్థానంలో నిలుస్తోంది.

Read More