చిన్న జీవాల పెంపకంలో పోషకాహార లోపాలు – నివారణ చర్యలు

ఆరోగ్యకరమైన గొర్రెల మంద కావాలంటే వాటికి సరైన పోషక ఆహారం మరియు మంచి యాజమాన్య పద్ధతులను విధిగా రైతులు పాటించాలి. గొర్రెలు పుట్టినప్పటి నుండి జాగ్రత్తగా పోషకాహారాలు సరియైన మోతాదులో సక్రమంగా ఇస్తే తక్కువ కాలంలో జీవాలు బరువు పెరిగి అధిక మాంస ఉత్పత్తిని ఇస్తాయి. ఆరోగ్యముగా, బలముగా గొర్రెలను పెంచాలంటే వాటికిచ్చే ఆహారములో సరిపడిన పిండిపదార్థములు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, ఖనిజలవణాలు మరియు విటమినులు ఉండేలా చూసుకోవాలి.

పిండిపదార్థాలు: గొర్రెలకు మనము పెట్టే గడ్డిలో తగిన మోతాదులో పిండిపదార్థాలు ఉండేటట్లు చూసుకోవాలి. శారీరక కార్యక్రమాల నిర్వహణకు కావలసిన శక్తి 50% వరకు ఈ పిండి పదార్థాల ద్వారా లభిస్తుంది. ఒకగ్రాము పిండిపదార్థం 4 కిలో కాలరీల శక్తిని ఇస్తుంది. గొర్రెల ఆహారములో ముఖ్యంగా పచ్చగడ్డి, ఎండుగడ్డి, చెట్ల ఆకులతో పాటు గింజ ధాన్యములైన జొన్న, మొక్కజొన్న, గోధుమ, రాగి, సజ్జల పొడి చేసుకొని తవుడుతో పాటు ఇవ్వడము వలన శక్తిలోపాన్ని నివారించవచ్చును. ఈ ధాన్యములను గొర్రెల బరువుకు తగినట్లుగా 250-300 గ్రా. వరకు ఇవ్వవలెను. ఈ విధంగా చేసుకున్న దాణాను ప్రతిరోజు పచ్చగడ్డితోపాటు ఒక్కింటికి 300 గ్రాముల చొప్పున నీటితో తడిపి ఉదయం/సాయంత్రం ఇవ్వడం వలన గొర్రెల ఆహారంలో శక్తిని సరియైన పాళ్ళలో అందించగలుగుతాము. 

మాంసకృత్తులు: జీవాల శరీర నిర్మాణానికి, పెరుగుదలకు, రోగనిరోధక శక్తికి, హిమోగ్లోబిన్‌ రవాణాకు ఇవి తోడ్పడతాయి. ఆహారంలో ఆమ్లాలు లోపిస్తే శరీర కణాలలో మాంసకృత్తుల ఉత్పాదకత తగ్గి గొర్రెలు ఆహారం తినడము, ఆహారాన్ని వినియోగించుకొనే సామర్థ్యం కూడా తగ్గుతుంది. మాంసకృత్తుల లోపాల వలన చిన్నజీవాల్లో బరువు తగ్గడము, రక్తహీనత, శరీరములో నీరు చేరడము, కండరాల బలహీనత వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. కాబట్టి మాంసకృత్తులు అధికముగా లభ్యమయ్యే పచ్చిమేతలు బొబ్బర్లు, జనుము, పిల్లిపెసర, ఉలవలు, సుబాబుల్‌, అవిశె ఆకులను గొర్రెల ఆహారములో ఇస్తే మాంసకృత్తుల లోపాల్ని నివారించవచ్చు.

ఖనిజ లవణములు: గొర్రెల శరీరములో 22 రకాల ఖనిజలవణాలు అవసరం ఉంటుంది. వీటిలో అతిముఖ్యమైనవిగా 8 ఖనిజాలను గుర్తించారు. గొర్రెల ఆహారములో ఉప్పు (సోడియంక్లోరైడ్‌), కాల్షియంను సమృద్ధిగా అందించాలి. ఎముకల పొడిని దాణాలో కలిపి ఇవ్వడం వలన భాస్వరం లోపాలను నివారించవచ్చు. అప్పుడప్పుడు రాళ్ళ ఉప్పును దాణాలో కలిపితే సోడియం క్లోరైడ్‌ లోపాలను నివారించవచ్చు. ఖనిజలవణ మిశ్రమాలు పొడి రూపంలోను, ఇటుకల రూపంలోను లభ్యం అవుతున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాలలో ఉన్న గొర్రెలకు ఒకే విధమైన లవణ మిశ్రం చేయడం కష్టమవుతుంది. ప్రాంతాలను, భూములను బట్టి వీటి లోపం ఉంటుంది. కావున రైతులు తమ ప్రాంతంలో ఉన్న లోపాలను గుర్తించి వాటికి సంబంధించిన ఖనిజలవణములను వాడవలెను.

విటమిన్స్‌: పచ్చికబయళ్ళలో సూర్యరశ్మి కలిగిన ప్రాంతాలలో విటమిన్‌ ‘ఎ’ మరియు ‘డి’ లోపాలు రావు. విటమిన్‌ బి12 తయారీకి కోబాల్టు ఖనిజలవణం అవసరము. 3 నెలల వయస్సు దాటిన గొర్రెల ఆహారంలో బి-కాంప్లెక్స్‌ విటమినుల అవసరం ఉండదు. 2-8 వారాల వయస్సు ఉన్న గొర్రె పిల్లల ఆహారములో విటిమన్‌ ఇ లేక సెలీనియం లోపిస్తే వాటిలో కండరాల జబ్బు వస్తుంది. కావున ఆహారంలో విటమినుల లోపం లేకుండా చూసుకోవాలి.

కొవ్వు పదార్థాలు: ఇవి శరీరముకు శక్తిని ఇస్తాయి. శరీరమునకు అత్యవసరమైన విటమిన్స్‌ ఎ, డి సక్రమంగా వినియోగపడేందుకు  కొవ్వు పదార్థాలు దోహదపడతాయి. జీవాల సక్రమ పునరుత్పత్తికి కావాల్సిన శక్తిని ఇస్తాయి. 1 గ్రాము కొవ్వు పదార్థం 9 కిలోక్యాలరీల శక్తిని ఇస్తుంది. వేరుశనగ పిండి, కొబ్బరిపిండి, నూనెగింజల చెక్క, గోధుమ మరియు వరి తవుడు మొదలగు ఆహార పదార్థాల్లో కొవ్వు పదార్థాలు ఉంటాయి. కావున వాటిని ఆహారములో భాగము చేయవలెను.

నీరు: నీరు ఆహారములోని వివిధ పోషక పదార్థాలను సంగ్రహించడానికి మరియు శరీరములోని వివిధ భాగాలకు పోషకాలను చేర్చడానికి, శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి, చర్మం సాగే గుణం కలిగి ఉండడానికి, వ్యర్థ పదార్థాల విసర్జనక్రమంలో దోహదపడుతుంది. కావున జీవాలకు తగినంత శుభ్రమైన నీరును అందించాలి.

టి. చంద్రావతి (9440579895), యం. జీవనలత (9490292468), బి. వెంకట్రామిరెడ్డి (7249936266), పాథాలజీ విభాగము, పశువైద్య కళాశాల, మామునూరు, తెలంగాణ.

Read More

సరైన మెలకువలతోనే పొట్టేళ్ళ పెంపకం లాభసాటి

జనాభాలో మన దేశం చైనాను దాటి ప్రపంచంలో అత్యధిక జనాభాగల దేశం అయ్యింది. మన దేశ జనాభా ఏయేటికాయేడు పెరుగుతూనే ఉంది. జనాభాతో పాటు నిరుద్యోగుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. పెరుగుతున్న నిరుద్యోగుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు దొరుకుతున్నవా? అంటే సమాధానం కాదు అని వస్తుంది. ప్రస్తుతం మన దేశంలో పరిశ్రమలు మరియు ఇతర సేవా రంగాల ద్వారా లభించే ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులందరికి ఉద్యోగాలు కల్పించలేకపోతున్నాయి. పెరుగుతున్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే సత్తా మన దేశంలో వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాలకే ఉంది. కాని వివిధ రకాల కారణాల వలన ఈ రంగాలలోకి అడుగు పెట్టడానికి విముఖత చూపడము వల్ల వ్యవసాయ మరియు దాని అనుబంధ రంగాల నుంచి వేరే రంగాలకు వలసలు జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ రంగాలలో శారీరక శ్రమ ఎక్కువగా ఉండడము, కొన్ని విలాసవంతమైన సౌకర్యాలకు దూరంగా ఉండవలసి రావడం, ఈరంగాలలో ఉండే అబ్బాయిలకు పెళ్ళిళ్లు జరగడము ఇబ్బందిగా ఉండడము లాంటి వివిధ రకాల కారణాల వలన వ్యవసాయం మరియుఅనుబంధ రంగాల నుంచి ఉద్యోగ, వ్యాపార రంగాల వైపు అడుగులు వేగంగా పడ్డాయని చెప్పవచ్చు. కానీ ఇటీవల కాలంలో ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన పెరగడము, ఆరోగ్యాన్ని కాపాడుటలో శారీరకశ్రమ ప్రధాన పాత్ర పోషించటం, వ్యవసాయరంగంలో శారీరక శ్రమ తప్పకుండా ఉంటుంది కాబట్టి ఆరోగ్యం కాపాడుకోవాలంటే తప్పనిసరి శారీరక శ్రమ ఉండే వ్యవసాయ రంగమే సరైన దారి అని గ్రహించటం, గ్రామాలలో కూడా నగరాలలో, పట్టణాలలో అనుభవించే సౌకర్యాలు, ప్రత్యేకించి ఇంటర్నెట్‌, యూట్యూబ్‌, వాట్సప్‌ లాంటి సౌకర్యాలు అందుబాటులోకి రావడము లాంటి మారిన పరిస్థితులలో ఉద్యోగ, వ్యాపార రంగాల నుంచి తిరిగి వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలకు మెల్లమెల్లగా వలసలు మొదలయ్యాయి అని చెప్పవచ్చు. కానీ ఉద్యోగ, వ్యాపార రంగాల నుంచి వ్యవసాయరంగంలో అడుగు పెట్టిన వారిలో చాలామంది వివిధ రకాల కారణాల వలన పంటల సాగులో అనుకున్న లాభాలు ఆర్జించలేకపోతున్నారు. పంటల సాగు లాభసాటిగా లేకపోవడముతో కొత్తగా ఈ రంగంలో అడుగు పెట్టినవారు నిరుత్సాహపడి వ్యవసాయరంగాన్ని వదలివేయాలని ఆలోచిస్తున్నారు. ఇలాంటి వారికి పొట్టేళ్ల పెంపకం సరైనదారి అని నిరూపిస్తున్నాడు నకిరేకల్‌ మండలం కడపత్రి గ్రామానికి చెందిన సైదిరెడ్డి.

వ్యవసాయ నేపధ్యానికి చెందిన సైదిరెడ్డి 10వ తరగతి వరకు చదువుకుని అందరి లాగానే వ్యవసాయ రంగాన్ని వీడి బొంబాయిలో టాక్సీడ్రైవరుగా పని చేయడం మొదలు పెట్టాడు. ఎంతయినాకాని వ్యవసాయ రంగం నుండి వచ్చిన వారు తమ మూలాలను మరువలేరు కాబట్టి సైదిరెడ్డి కూడా తన మూలాలను మరచిపోలేక 10 సంవత్సరాలు టాక్సీడ్రైవరుగా బాధ్యతలు నిర్వర్తించిన తరువాత వ్యవసాయాన్ని మరిచిపోలేకపోవడం, పిల్లల చదువులు, సొంత గ్రామంలో ఉండాలనే ఆలోచన లాంటి వివిధ రకాల కారణాల వలన చేస్తున్న ఉద్యోగాన్ని వదలి తమ స్వగ్రామం తిరిగి వచ్చి పంటల సాగు మొదలు పెట్టి పత్తి, వరి, నిమ్మ లాంటి పంటలు పండిస్తూ వస్తున్న సమయంలో పంటల సాగులో నష్టాలను చవిచూడవలసి రావటం మొదలయ్యి వేరే రంగాల గురించి ఆలోచించగా గొర్రె పొట్టేల పెంపకం సరైనదారి అని తెలుసుకుని 2020 వ సంవత్సరం గొర్రె పొట్టేళ్ళ పెంపకం మొదలు పెట్టాడు. 

పొట్టేళ్ళ పెంపకం లాభసాటిగా ఉండాలంటే సొంతంగా పశుగ్రాసాలను పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రహించి 15 గుంటలలో సూపర్‌ నేపియర్‌, 15 గుంటలలో హెడ్జ్‌లూసర్న్‌ సాగు మొదలు పెట్టాడు. మొదటి బ్యాచ్‌ కింద 20 పిల్లలను కొనుగోలు చేసుకుని రెండు నెలలు మేపిన తరువాత 40 వేల లాభంతో వాటిని అమ్మకం చేశాడు. మొదటి బ్యాచ్‌లో లాభాలు రావడముతో రెండవ బ్యాచ్‌లో 40 పిల్లలను కొనుగోలు చేయగా అది వర్షాకాలం కాబట్టి వివిధ రకాల జబ్బులతో 10 పిల్లలు చనిపోగా రెండవ బ్యాచ్‌లో నష్టాలు చవిచూశాడు. కానీ వెనుకంజ వేయకుండా ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే పొందాలనే నానుడి గుర్తు చేసుకుని తాను చేసిన పొరబాట్ల నుంచి గుణపాఠం నేర్చుకుని గొర్రె పిల్లలకు అవసరమయిన దాణా, మందులు, రోగాలబారి నుండి కాపాడటానికి అవసరమయిన టీకాల గురించి కక్షుణ్ణంగా తెలుసుకుని, తెలుసుకున్న వాటిని తు.చ. తప్పకుండా పాటిస్తూ ప్రతి రెండు, మూడు నెలలకొక బ్యాచిని అమ్ముతూ, కొనుగోలు చేస్తూ తాను ఉద్యోగంలో సంపాదించిన సొమ్మును సొంత గ్రామంలో కుటుంబంతో ఆనందంగా గడుపుతూ సంపాదిస్తున్నాడు.

పొట్టేలు పిల్లల పెంపకంతో పాటు వరి, పత్తి, నిమ్మ లాంటి పంటలు పండిస్తూ వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలను నమ్ముకుని అన్ని మెళకువలతో కొనసాగిస్తూ, శారీరక శ్రమ చేయగలిగితే ఈ రంగాలు ఎంతమందికయినా ఉపాధి అవకాశాలు కల్పించగలవు అని సైదిరెడ్డి నిరూపిస్తున్నాడు.

పశుగ్రాసాలు

పొట్టేళ్ళ పెంపకంలో ఖర్చులు తగ్గించుకోవాలంటే నాణ్యమైన పశుగ్రాసాలను సొంతంగా పెంచుకోవాలని గ్రహించి 15 గుంటల ధాన్యపు జాతి బహువార్షిక పశుగ్రాసం సూపర్‌నేపియర్‌, 15 గుంటల్లో పప్పుజాతి బహువార్షిక పశుగ్రాసం థరథ గడ్డి (హెడ్జ్‌లూసర్న్‌)ని పెంచుతూ పొట్టేలు పిల్లలకు అందిస్తున్నాడు. వర్షాకాలంలో పచ్చిగ్రాసాలు అందించలేని పరిస్థితులలో మేతగా అందించటానికి వీలుగా వేరుశనగ కట్టెను నిల్వ చేసుకుని తప్పనిసరి పరిస్థితిలో అందిస్తున్నాడు.

ఆరోగ్య పరిరక్షణ

పొట్టేలు పిల్లల పెంపకంలో ఆరోగ్యపరిరక్షణ ప్రధాన పాత్ర పోషిస్తుంది. మొదటలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న సైదిరెడ్డి అనుభవం పెరిగిన కొద్దీ తెలిసిన వారి ద్వారా, పశువైద్య నిపుణుల ద్వారా రోగాలు, మందుల గురించి కక్షుణ్ణంగా తెలుసుకుని పిల్లలు చనిపోకుండా కొనుగోలు చేసిన పిల్లలన్నింటిని అమ్ముకోగులుగుతున్నాడు. ఎండాకాలంలో పెంచే పిల్లల కంటే వర్షాకాలంలో పెంచే పిల్లలకు రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వ్యాక్సిన్లు తప్పనిసరిగా అందిస్తున్నాడు. ఎండాకాలం అంటే అక్టోబరు నుంచి జూన్‌ వరకు పెంచే పిల్లలకు పిపిఆర్‌, హెచ్‌ఎస్‌, షీప్‌ ఫాక్స్‌ వ్యాక్సిన్లను, వర్షాకాలం అంటే జూన్‌ నుంచి అక్టోబరు వరకు పెంచే పిల్లలకు హెచ్‌ఎస్‌, బ్లూటంగ్‌, ఎఫ్‌ఎండి, పిపిఆర్‌ వ్యాక్సిన్లను అందిస్తున్నాడు. వీటన్నిటితోపాటు తొలకరి వర్షాలకు కొత్త మొలకలు తిన్న గొర్రెపిల్లలకు చిటుక రోగం రాకుండా మే నెలలో జూఊ వ్యాక్సిన్‌ను అవసరాన్నిబట్టి వేయిస్తుంటాడు. పిల్లలకు తప్పనిసరిగా ప్రతిరోజు క్యాల్షియంను దాణాతో అందించడంతో పాటు నెలకు 5 రోజులు లివర్‌ టానిక్‌ను అందిస్తున్నాడు. ఇలాంటి మెలకువలు తెలుసుకుని పాటిస్తున్నాడు కాబట్టి అప్పటి నుంచి కొనుగోలు చేసిన పిల్లలో మరణాలు లేకుండా కాపాడగలుగుతున్నాడు. మొదటలో 10 పిల్లలు చనిపోయిన తరువాత అవగాహన పెంచుకుని అప్పటి నుండి ఒక పిల్ల కూడా చనిపోకుండా కాపాడుకోగలుగుతున్నాడు. సాధారణంగా వచ్చే జ్వరం, దగ్గు, పురుగు ముట్టడము లాంటి సమస్యలకు కూడా మందులు అందిస్తూ పిల్లలను కాపాడుకోగలుగుతున్నాడు. పొట్టేళ్ళ పెంపకం మొదలు పెట్టిన కేవలం 3 సంవత్సరాల్లోనే తోటి పెంపకం దార్లు తనను సలహాలు అడిగే స్థాయికి సైదిరెడ్డి ఎదిగాడు కాబట్టి గొర్రె పొట్టేళ్ల ఆరోగ్య విషయంలో తోటి పెంపకందార్లు తన సలహాలు పాటిస్తున్నారని సైదిరెడ్డి వివరించారు. 

చాఫ్‌కట్టర్‌

పశుగ్రాసాల వృథాను అరికట్టడంతో పాటు పశుగ్రాసాలు సక్రమంగా ఉపయోగపడాలంటే పశుగ్రాసాలను చాఫ్‌కట్టర్‌ ద్వారా ముక్కలు చేసి అందించటమే సరైన దారి అని గ్రహించి అప్పట్లో 18000/- పెట్టి 3 హెచ్‌.పి., 3 ఫేజ్‌ పవర్‌తో నడిచే చాఫ్‌కట్టరును కొనుగోలు చేసి ఉపయోగిస్తున్నాడు. సూపర్‌ నేపియర్‌ని చాఫ్‌కట్టర్‌తో ముక్కలు చేసి గొర్రె పిల్లలకు మేతగా అందిస్తున్నాడు.

దాణా:  పచ్చిమేతను అందించడంతో పాటు గొర్రెపిల్లలు త్వరగా పెరగాలంటే దాణా కూడా తప్పనిసరిగా ఇవ్వాలి కాబట్టి మొక్కజొన్న, తవుడు, బియ్యం నూకలను సమపాళ్ళు అంటే గొర్రె పిల్లల వయస్సు 25 కిలోలు దాటిన తరువాత 3 కిలోల మొక్కజొన్న రవ్వ, 3 కిలోల తవుడు, 3 కిలోల నూకలకు 100 గ్రాముల మినరల్‌ మిక్చర్‌ కలిపి ప్రతి రోజు 30 పొట్టేలు పిల్లలకు దాణాగా అందిస్తున్నాడు. 

మరిన్ని వివరాలు సైదిరెడ్డి 9515470375 కు ఫోను చేసి తెలుసుకోగలరు.

Read More