ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రె సంతతిని జన్యు సవరణ (జీన్ ఎడిటింగ్) ద్వారా సృష్టించడంలో జమ్మూ కశ్మీర్‌లోని షేర్-ఎ-కశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీకి (ఎస్‌కేయూఏఎస్‌టీ) చెందిన పరిశోధకులు విజయం సాధించారు. ఇది భారత్‌లో తొలి జన్యు సవరణ గొర్రె అని, చరిత్రాత్మక మైలురాయి అని వారు వివరించారు. గొర్రెల్లో కండరాల అభివృద్ధిని నియంత్రించే మయోస్టాటిన్ జన్యువును సవరించడం ద్వారా వారు దీనిని సాధించగలిగారు. నాలుగేళ్లుగా సాగిన ఈ పరిశోధనకు విశ్వవిద్యాలయ పశు వైద్య విభాగం డీన్ రియాజ్ అహ్మద్ షా నాయకత్వం వహించారు. ‘జన్యు సవరణ ద్వారా 30 శాతం ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రె సంతతిని సృష్టించగలిగాం. భారతీయ రకాల్లో సహజంగా మాంసం వాటా తక్కువగా ఉంటుంది. అయితే కొన్ని ఐరోపా గొర్రె జాతుల్లో మాంసం అధికంగా ఉండేలా జన్యు నిర్మాణం ఉంటుంది’ అని అహ్మద్ షా తెలిపారు. ‘సంకరం ద్వారా కాకుండా జన్యు సవరణ ద్వారా జన్యు మార్పిడి సాధించడం ఒక నవ్య సాంకేతిక ఘన విజయం. ఇది 21వ శతాబ్దంలో ఆవిర్భవించిన కృత్రిమ మేధ లాంటిదే’ అని పేర్కొ న్నారు. ‘ఇది కేవలం ఒక గొర్రె పిల్లను పుట్టించడం కాదు. జన్యు ఆధారిత పశుగణాభివృద్ధిలో ఒక కొత్త ఆవిష్కారం. కొత్త జన్యు పదార్థాన్ని ప్రవేశపెట్టకుండా ప్రయోజనకరమైన జన్యు సవరణ చేసే సత్తా మనకుందని చాటుకున్నాం’ అని ఆయన వివరించారు. అహ్మద్ షా నేతృత్వంలోని పరిశోధక బృందం 2012లో అత్యంత ఖరీదైన ఉన్నిని అందించే కశ్మీరీ పష్మీనా గొర్రె ‘నూరీ’ అనే జన్యు సమరూప జీవిని (క్లోన్) ఆవిష్కరించింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.
మనది వ్యవసాయక దేశం. ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారనే విషయం అందరికి తెలిసిందే. గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే ఎక్కువమంది రైతులు పంటల సాగుతో పాటు పాడిని కూడా పోషిస్తూ ఉండేవారు. పంట వ్యర్థాలను పశువులకు, పశువుల వ్యర్థాలకు పంటలకు అందిస్తూ కొనసాగేవారు. పాడి పశువులతో పాటు అవకాశం ఉన్న రైతులు కోళ్ళు, గొర్రెలు, మేకల పెంపకం లాంటివి కూడా కొనసాగిస్తూ ఉండేవారు. అప్పట్లో వాతావరణ కాలుష్యం తక్కువగా ఉండేది. ప్రజలకు గాని, పశువులకు గాని విష రసాయనాలు లేని ఆహారం అందుబాటులో ఉండేది కాబట్టి తినే ఆహారం ద్వారా అనారోగ్య సమస్యలు పెద్దగా వచ్చేవి కావు. కాని కాలం గడిచే కొలది పరిస్థితులలో వివిధ రకాలు మార్పులు సంభవించి తినే ఆహారంతో పాటు, త్రాగే నీరు, పీల్చే గాలి, పండించే నేల .. అన్నీ కలుషితం అయ్యాయి కాబట్టి ప్రజలతో పాటు పశు పక్ష్యాదులకు కూడా అనారోగ్య సమస్యలు ఏఏటికాయేడు పెరుగుతూ వస్తున్నాయి. పశు పక్ష్యాదులలో మిగతా వాటితో పోల్చుకుంటే గొర్రెలలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టే గొర్రెల పెంపకందారులు తమ విలువైన గొర్రెలను నష్టపోవలసి వస్తుంది. మారిన పరిస్థితులకు అనుగుణంగా గొర్రెల పెంపక విధానంలో మార్పులు చేసుకొని మెళకువలు పాటిస్తే గొర్రెల పెంపకంలో విజయం సాధించవచ్చని తోటి రైతులకు తెలియచేయడానికి నల్లగొండకు చెందిన అభ్యుదయ రైతు అంజిరెడ్డి కృషి చేస్తున్నాడు.
అంజిరెడ్డి గారివి వ్యవసాయ మూలాలు. ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి పదవీ విరమణ పొందిన తరువాత ప్రత్యక్షంగా వ్యవసాయ రంగంలోకి దిగి వివిధ రకాల పంటలు పండిస్తూ, తన పంటల సాగులో ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా కేవలం సేంద్రియ పద్దతులను మాత్రమే పాటిస్తూ ఆరోగ్యకరమైన పంట దిగుబడులు సాధిస్తూ వస్తున్నాడు.
అంజిరెడ్డి ప్రతినిత్యం లాభసాటి వ్యవసాయం గురించి ఆలోచిస్తూ పంటల సాగును లాభాల బాట పట్టించడానికి అవసరమయిన వివిధ రకాల మార్గాల గురించి ఆలోచించి సమీకృత వ్యవసాయం రైతులకు లాభసాటిగా ఉంటుందని గ్రహించి తన పంటల సాగుని కొనసాగిస్తూనే గొర్రెల పెంపకాన్ని చేపట్టాలని తలంచి అందుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం మొదలుపెట్టాడు. అంజిరెడ్డి గారి పెద్దలు గతంలో గొర్రెల పెంపకం చేపట్టారు కాబట్టి ఆ అనుభవం అంజరెడ్డిగారికి బాగా ఉపయోగపడింది. దానికి తోడు ప్రభుత్వం కూడా గొర్రెల పెంపకానికి ప్రోత్సాహాన్ని అందిస్తున్న విషయం తెలుసుకుని విచారించగా ఎన్‌ఎల్‌ఎం (నేషనల్ లైవ్ స్టాక్ మిషన్) స్కీము ద్వారా కేంద్ర ప్రభుత్వం గొర్రెల పెంపకానికి ప్రోత్సాహకాలను అందిచటాన్ని తెలుసుకున్న అంజిరెడ్డి తాను ఈ స్కీము ద్వారా ప్రభుత్వ సహాయాన్ని పొంది గొర్రెల పెంపకం చేపట్టినట్లయితే అన్నివిధాలుగా ప్రయోజనం ఉంటుందని గ్రహించి అటువైపు అడుగులు వేసి ఎన్‌ఎల్‌ఎమ్ స్కీముకు అవసరమయిన అర్హతలను పొంది 2023 వ సంవత్సరంలో గొర్రెల పెంపకంలో అడుగు పెట్టాడు.
ఎన్‌ఎల్‌ఎమ్ స్కీమ్‌లో కోటి రూపాయల ప్రాజెక్ట్ వివరాలు
నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ లోని ఒక కోటి రూపాయల ప్రాజెక్టును అంజిరెడ్డిగారు ఎంపిక చేసుకుని అందుకుగాను ముందుగా బ్యాంకు వారి నుంచి (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) కోటి రూపాయల లోనుకు సంబంధించిన అనుమతి పొందడం జరిగింది. కోటి రూపాయల లోనుకు గాను అవసరమయిన గ్యారంటీలను అంజరెడ్డి గారు బ్యాంకు వారికి చూపించిన తరువాత గొర్రెల పెంపకంలో అనుభవం ఉండటానికి సంబంధించిన ధృవపత్రాన్ని అందచేయడముతో పాటు ఎన్‌ఎల్‌ఎమ్ స్కీములోఇంకొక అర్హత అయినవంటి 5 ఎకరాల భూమిని కూడా చూపించడం జరిగింది. కోటి రూపాయల ప్రాజెక్టుకు గాను కనీసం 5 ఎకరాల సొంత భూమి లేదా కౌలు (కనీసం 7 సంవత్సరాలు) పొలం అయినా సరిపోతుంది. కోటి రూపాయలు ప్రాజెక్టు క్రింద 500 ఆడ గొర్రెలు మరియు 25 మగ గొర్రెలు (పొట్టేళ్ళు)ను పోషించవలసి ఉంటుంది. అంజిరెడ్డి గారికి అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి కోటి రూపాయల ప్రాజెక్టును మొదలు పెట్టారు. అలాంటి అవకాశాలు లేని వారికి కూడా తక్కువ అంటే 100 గొర్రెలు, 200 గొర్రెలు, 300 గొర్రెలు లకు సంబంధించిన ప్రాజెక్టులు కూడా అందుబాటులోకి తెచ్చారు అని అంజిరెడ్డి గారు వివరించారు. కోటి రూపాయల ప్రాజెక్టులో 50 లక్షల రూపాయల సబ్సిడీ ఉంటుంది. సబ్సిడీలో సగం అయినటువంటి 25 లక్షల సబ్సిడీని అంజిరెడ్డి గారు అందుకోవడం జరిగింది. త్వరలో మిగతా 25 లక్షలు సబ్సిడీని కూడా అందుకుంటాను అని అంజిరెడ్డి గారు వివరిస్తున్నారు.
గొర్రెలకు మేత
ఎన్‌ఎల్‌ఎమ్ గైడ్‌లైన్స్ ప్రకారం కనీసం 5 ఎకరాల పొలం ఉండాలి. కాని అంజిరెడ్డి గారి అభిప్రాయం ప్రకారం 525 గొర్రెలు మరియు వాటికి పుట్టే పిల్లలకు స్టాల్ ఫీడింగ్ చెయ్యాలంటే కనీసం 15 ఎకరాల పొలంలో పశుగ్రాసాలను పెంచుకోవాలి. అందులో ఏడు ఎకరాల సూపర్ నేపియర్ లాంటి ధాన్యపు జాతి పశుగ్రాసాలను, ఏడు ఎకరాల థరథగడ్డి/హెడ్జ్‌లూసర్న్ లాంటి పప్పుజాతి పశుగ్రాసంతో పాటు ఒక ఎకరంలో అవిశ, మునగ లాంటివి సాగు చేయాలి అని అంటున్నాడు. కాని తాము ప్రస్తుతానికి 4 ఎకరాలలో సూపర్ నేపియర్, 5 ఎకరాలలో హెడ్జ్‌లూసర్న్, రెండు ఎకరాలలో చిలకడ దుంపలను పశుగ్రాసాలుగా సాగు చేస్తున్నాము. ఈ పశుగ్రాసం సరిపోవడం లేదు కనుక ప్రక్కనే అందుబాటులో ఉన్న పొలం ఆరు ఎకరాలను కౌలుకు తీసుకుని జూన్ తరువాత పశుగ్రాసాలను సాగు చేయాలనే ప్రణాళికతో ఉన్నాడు. వీటితో పాటు వేరుశనగ, శనగ మొదలగు పంట వ్యర్థాలను, దానా కింద మొక్కజొన్న తవుడు, నూకలు లాంటివి అందిస్తూ వస్తున్నాడు. వీటన్నింటితోపాటు పొలంలో అందుబాటులో ఉన్న మునగ, సుబాబుల్, వేప ఆకులను అవసరాన్ని బట్టి అందిస్తున్నాడు. షెడ్‌లో అక్కడక్కడ మినరల్ మిక్చర్ ఇటుకలను వ్రేలాడదీస్తుంటాడు.
గొర్రెలు: అందుబాటులో ఉన్న వివిధ రకాల గొర్రెలలో మాచర్ల చుక్క రకాన్ని పోషించాలని నిర్ణయించుకొని ఆ రకం గొర్రెలు దొరికే ప్రదేశాలు తిరిగి వివిధ ప్రాంతాలలో నేరుగా రైతుల దగ్గర నుంచి, సంతలలో, ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ ఎన్ని అందుబాటులో ఉంటే అన్ని కొనుగోలు చేయడం జరిగింది. ప్రస్తుతానికి మొత్తం 500 పైగా గొర్రెలు 25 పొట్టేళ్ళతో పాటు 100కు పైగా పిల్లలు ఉన్నాయి. మాచర్ల చుక్క రకం గొర్రెలకు మంచి మార్కెట్ ఉండడముతో పాటు మన వాతావరణానికి బాగా తట్టుకుంటాయనే ఆలోచనతో ఈ రకం గొర్రెలను ఎంపిక చేసుకున్నాడు. అమ్మకానికి సిద్ధం అయిన గొర్రెలను అవకాశాన్ని బట్టి లైవ్ వెయిట్ కిలో 400 నుంచి 450 రూపాయల చొప్పున స్థానికంగానే అమ్మకం చేసుకుంటూ వస్తున్నాడు.
గొర్రెలకు వసతి సౌకర్యం
ఎన్‌ఎల్‌ఎమ్ గైడ్ లైన్స్ ప్రకారం ఆడ గొర్రెలకు ఒక్కొక్క దానికి 10 చదరపు అడుగులు, మగ గొర్రెల (పొట్టేళ్ల)కు ఒక్కొక్క దానికి 15 చదరపు అడుగుల స్థలం కావాలి. కాని నేను మొత్తం 9000 చదరపు అడుగుల షెడ్ నిర్మాణం చేసుకున్నాను. భూమి మీద గొర్రెల పెంపకం చేపట్టినట్లయితే గొర్రెలకు కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు కూలీల ఖర్చు ఎక్కువగా అవుతుంది. కాబట్టి నేను ఎత్తులో ఎలివేటెడ్ షెడ్‌ని నిర్మాణం చేసుకున్నాను. ఎత్తులో షెడ్ నిర్మాణం చేసుకోవడం వలన పెట్టుబడి పెరుగుతుంది కాని భవిష్యత్తులో చాలా రకాల ప్రయోజనాలు ఉటాయి కాబట్టి ఖర్చు ఎక్కువ అయినా ఆలోచించకుండా ఈ విధంగా నిర్మించుకున్నాను. షెడ్‌ని ఉత్తర, దక్షిణ దిక్కులలో నిర్మించుకుంటే తూర్పు నుంచి మా పొలం నుంచి చల్లని గాలులు వీస్తుంటాయి కాబట్టి షెడ్‌ని ఉత్తర, దక్షిణాలలో నిర్మించుకుంటే తూర్పు నుంచి వచ్చే చల్లగాలులు షెడ్‌లోకి బాగా రావడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశ్యంతో ఈ విధంగా నిర్మించుకోవడం జరిగింది. చలికాలంలో చల్లనిగాలులు, వర్షాకాలంలో వచ్చే వర్షాల నుంచి రక్షణ కొరకు షేడ్ నెట్‌లు ఏర్పాటు చేసుకున్నాను. గొర్రెలు ఎక్కడానికి మరియు క్రిందకు దిగటానికి వీలుగా ర్యాంపును నిర్మించుకున్నాను. గొర్రెల మేతకు మరియు నీటి వసతి కొరకు షెడ్‌లో తగిన ఏర్పాట్లు చేసుకున్నాను. ఎండు మేతలు అంటే వేరుశనగ చెత్త, శనగ చెత్త లాంటి వాటిని నిల్వ చేసుకోవడానికి గాను 5 లక్షల ఖర్చుతో వేరుగాఇంకొక షెడ్‌ని ప్రక్కనే నిర్మించుకున్నాను అని అంజిరెడ్డి వివరించాడు.
గొర్రెల పెంపకం విజయవంతం కావడానికి అవసరమయిన మెళకువలను చాలా వరకు పాటిస్తూ అంజిరెడ్డి ముందుకు సాగుతున్నాడు. మరిన్ని వివరాలు 99482 55544 కి ఫోను చేసి తెలుసుకోగలరు.