పాడి రైతులకు అండగా పశువుల బీమా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ద్వారా అమలు చేస్తున్న పశువుల బీమా పథకం పాడి రైతులను ఆదుకుంటోంది. ఇటీవల అంతుపట్టని వ్యాధులు, విద్యుత్ఘాతాలు, చెరువులు, నదీ జలాల్లో పశువులు మునిగి చనిపోవడం వంటి ఘటనల వలన ఆసరాగా ఉంటున్న పాడి పశువు మృతితో పోషకులు జీవనోపాధి కోల్పోతున్నారు. మరో పాడి పశువు కొనుగోలుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆయా సమస్యలకు బీమా పథకంలో చేరడం ఒక్కటే పరిష్కార మార్గమని పశువైద్యాధికారి కె. మాధవ రావు సూచిస్తున్నారు.
- 80 శాతం రాయితీపై గేదెలు, ఆవులకు పథకం అమలు చేస్తారు.
- ఎస్సీ, ఎస్టీ, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు వర్తిస్తుంది.
- ఒకసారి బీమా చెల్లిస్తే మూడేళ్లపాటు అమల్లో ఉంటుంది.
- పశువుకు చెవి పోగు వేయించి బీమా నమోదు చేసుకోవాలి.
- పూర్తి వివరాలకు రైతు సేవా కేంద్రం, సమీప పశు వైద్యశాలలో సంప్రదించాలి.


