గుర్తు తెలియని దొంగలకు రైతుల విజ్ఞప్తి
గుర్తుతెలియని దొంగలకు పంజాబ్లోని ఫరీద్ కోట్ జిల్లా పఖి కలాన్ గ్రామ రైతులు ఓ విజ్ఞప్తి చేశారు. “వరి సీజను మొదలైంది. దయచేసి, నీటి మోటార్ల జోలికి రాకండి. మీరు బ్యాంకు ఖాతా తెరిచి, ఆ వివరాలు మాకు పంపండి. మా పైర్ల రక్షణ నిధిగా అందులో డబ్బులు జమ చేస్తాం” అంటూ అన్నదాతలు సామూహికంగా చేసిన ఓ వినూత్న వీడియో వైరల్గా మారింది. ఈ రైతుల పొలాల నుంచి రెండు నెలల కిందట 15 నీటి మోటార్లు అపహరణకు గురయ్యాయి. ఆ తర్వాత పొలాల్లో ఉంచిన 25 ద్విచక్ర వాహనాలు ఒకేరోజు రాత్రి దొంగలపాలయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పరిస్థితిలో మార్పు లేకపోవడంతో తమకు మరో మార్గం తోచలేదని రైతులు అంటున్నారు.

