ఆహార భద్రతలో ఆంగ్రూ పాత్ర కీలకం
ఐకానిక్ భవనానికి నిధులు ఇస్తాం – వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు
ప్రజలకు ఆహార భద్రత కల్పించడంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఆంగ్రూ) పాత్ర చాలా కీలకమైనదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖా మంత్రి కె. అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. గుంటూరు లాంఫాంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవాల కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అరవై ఏళ్ల కాలంలో అనేక రకాల వరి వంగడాలను అందించిన ఘనత ఈ విశ్వవిద్యాలయానికి ఉందన్నారు. కృత్రిమ మేధను కూడా వ్యవసాయంలో వర్తింపజేయాలన్నారు. సేంద్రియ సాగు, ప్రకృతి వ్యవసాయాన్ని జోడించి రైతులకు మేలు జరిగేలా పరిశోధనలు చేయాలని సూచించారు. ఆంగ్రూ ఐకానిక్ భవనానికి అవసరమైన నిధుల మంజూరుకు కృషి చేస్తామన్నారు. సమావేశంలో ఆంగ్రూ వీసీ డాక్టర్ ఆర్.శారద జయలక్ష్మీదేవి, పీజేటీఎస్ ఏయూ వీసీ అల్దాస్ జానయ్య, నాబార్డు మాజీ చైర్మన్ గోవిందరాజులు, వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్, డైరెక్టర్ దిల్లీరావు తదితరులు పాల్గొన్నారు.


