ఖాళీ స్థలాల్లో గోదాములు నిర్మించండి
గిడ్డంగుల సంస్థకు మంత్రి తుమ్మల ఆదేశాలు
తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకాంక్షించారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఖాళీ స్థలాల్లో కొత్త గోదాములను నిర్మించాలని, ఆహార ఉత్పత్తుల నిల్వ సౌకర్యాలు పెంచాలని గిడ్డంగుల సంస్థ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన సచివాలయంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థపై సమీక్ష నిర్వహించారు. సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఎండీ కొర్రా లక్ష్మి ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ”ఈ ఏడాది కొత్తగా 30,000 టన్నుల సామర్థ్యాన్ని అందుబాటులోకి తెచ్చాం. మరో 1,03,800 టన్నుల నిల్వ సామర్థ్యంతో 8 ప్రాంతాల్లో కొత్త గిడ్డంగుల నిర్మాణం చేపట్టాం. గోదాముల్లో సరకుల నిల్వ, రవాణా, వాహనాల రాకపోకలపై నిఘా ఏర్పాట్లు ప్రారంభించాం. మార్కెట్లో గిట్టుబాటు ధరలు రాని సందర్భంలో అన్నదాతలు గోదాముల్లో సరకులను నిల్వ చేసుకోవాలి. సన్న, చిన్నకారు రైతులు ధాన్యం, పంట ఉత్పత్తులను నిల్వ చేస్తే వారికి 35 శాతం రాయితీ ఇస్తున్నాం. నిల్వ చేసిన సరకు ద్వారా బ్యాంకులను నుంచి రుణాలు సైతం పొందవచ్చు” అని మంత్రి తెలిపారు.

