రైతులు వ్యవసాయంతో పాటు కోళ్ల పెంపకం, చేపల పెంపకంతోపాటు కౌజు పిట్టల పెంపకం కూడా చేస్తున్నారు. ఇవి చూడటానికి పిచ్చుకల మాదిరిగా ఉంటూ కాస్త పెద్దగా ఉంటాయి. ఇవి రుచిగా ఉంటాయి. అలాగే ఎన్నో పోషక విలువలను కలిగి ఉంటాయి. అందుకే వీటిని తినడానికి మాంసపు ప్రియులు ఇష్టపడతారు. దాంతో మార్కెట్‌లో వీటికి డిమాండ్‌ కూడా ఎక్కువగానే ఉంటుంది. రైతులు వీటిని పెంచడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

షెడ్డులో పెంచుకోవడానికి జపనీస్‌ క్వయిల్‌ అనువైన రకం. ఈ జపనీస్‌ క్వయిల్‌ను మాంసం, గ్రుడ్లు ఉత్పాదన కోసం పెంచుకోవచ్చు. మిగతా కోళ్ల రకాలతో పోలిస్తే కౌజు పిట్టలకు వ్యాధి నిరోధకత చాలా ఎక్కువ. ఎటువంటి టీకాలు అవసరం లేదు. ఇకపోతే ఈ పిట్టలను ఐదు వారాలకే మాంసం కోసం అమ్ముకోవచ్చు. లేదంటే ఆరోవారం నుంచి గ్రుడ్లు పెడతాయి.

ఐదు వారాల వయస్సులో ఇవి 100-200 గ్రా. వరకు బరువు తూగుతాయి. వీటి మాంసంలో మాంసకృత్తులు మిగతా కోళ్ల మాంసం కంటే అధిక మోతాదులో లభిస్తాయి. దేశంలోని మొత్తం కోళ్ల సంఖ్యలో 1.8 శాతం కౌజు పిట్టలున్నాయి. మారిన ఆహారపు అలవాట్లు, పెరిగిన తలసరి ఆదాయం, కలిగిన అవగాహన వల్ల నేడు రైతులు ప్రత్యామ్నాయ కోళ్ల పట్ల మక్కువ చూపిస్తున్నారు. ఇవి బూడిద రంగులో ఉంటాయి. బయట మార్కెట్లో పిల్లలు లభ్యం అవుతాయి. పిల్లలు 7-9 గ్రాముల బరువు ఉండి సున్నితంగా ఉంటాయి. వీటికి మొదటి వారంలో 95-99 ఫారెన్‌హీట్‌ డిగ్రీల వరకు వేడిని అందించాలి.

మొదటి వారంలో తీసుకునే జాగ్రత్తలు దాదాపు కోడి పిల్లల బ్రూడింగ్‌ మాదిరిగానే చేసుకోవాలి. కాకపోతే కౌజు పిట్టలు చిన్నపాటి శరీరం వలన వాటికి మామూలు ఇతర కోడి పిల్లల కంటే అధిక ఉష్ణోగ్రతను అందించాలి.

ఒక బ్రూడర్‌ 100-150 అంగుళాలు వెడల్పుగా ఉండే దానిలో 250-300 వరకు పిల్లలను ఉంచవచ్చు. మొదటివారం తర్వాత నుంచి ఉష్ణోగ్రతను ఐదు ఫారన్‌హీట్‌ డిగ్రీల చొప్పున తగ్గిస్తూ అది 70-75 ఫారన్‌హీట్‌ డిగ్రీలు వచ్చేవరకు బ్రూడింగ్‌ చేయాలి. దాదాపు మూడు వారాల వయస్సు వచ్చేసరికి ఈకలు బాగా పెరిగిన తరువాత ఆడ కౌజులను వేరు చేయవచ్చు.

సాధారణంగా మగవాటి కన్నా కూడా ఆడ కౌజులు ఎక్కువ బరువు పెరుగుతాయి. ఐదు వారాలు జాగ్రత్తగా పెంచితే మంచి లాభాలను పొందవచ్చు. గ్రుడ్ల కోసం అయితే ఆరోవారం నుంచి పధ్నాలుగు వారాల వరకు ఇవి గ్రుడ్లు పెడతాయి. ఏడాదికి దాదాపు 250 నుండి 270 గ్రుడ్లను ఉత్పత్తి చేస్తాయి. గ్రుడ్లు 10 నుండి 12 గ్రాముల బరువు ఉండి, పెంకు కొంచెం నల్లని మచ్చలతో ఉంటుంది.

పోషణ పరంగా కోడిగ్రుడ్డు కంటే రెండు శాతం అధిక మాంసకృత్తులు ఇందులో లభ్యమవుతాయి. కౌజు పిట్టలకు, మిగతా కోళ్ల కంటే కొంచెం అధిక మోతాదులో మాంసకృత్తులు అవసరం. 

బయట మార్కెట్లో ప్రత్యేకంగా కౌజు పిట్టల దాణా లభిస్తే దొరికిన దాణాకి కొద్ది మోతాదులో అవసరం మేరకు సోయా చెక్కని కలిపి వాడుకోవాలి. దాణా విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే అవి మంచి సైజు పెరుగుతాయి. కాస్త జాగ్రత్త పడాలి అప్పుడే కౌజు పిట్టల పెంపకంలో ఆదాయాన్ని పొందవచ్చు. 4 నుండి 5 వారాల్లో ఒక్కో పిట్ట 500 గ్రాముల వరకు దాణా తీసుకుంటుంది.

దాణా కోసం 15 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం ఒక్కో కౌజు పిట్టను 5 వారాల పాటు పెంచేందుకు 26 రూపాయల ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం హోల్‌సేల్‌ వ్యాపారులకు ఒక్కో కౌజు పిట్టను 50 రూపాయలకు విక్రయించవచ్చు. వీటి గ్రుడ్లను అమ్మటం ద్వారా ఆదాయం పొందవచ్చు.

కౌజు పిట్టల పెంపకం చేపట్టాలనుకునేవారు వారానికి ఒక బ్యాచ్‌ వచ్చేలా షెడ్లును నిర్మించుకుని వాటిని విభాగాలు చేసుకోవాలి. నాలుగు బ్యాచ్‌లుగా చేసుకొని ఒక్కో బ్యాచ్‌లో 500 పకక్షులు పెంచుకుంటే నెలకు ఖర్చులు పోను 2000 పకక్షులపై 48 వేల రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు. ఇక గ్రుడ్లు ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా కలుపుకుంటే ఆ మొత్తం ఇంకా ఎక్కువగానే ఉంటుంది.

కౌజు పిట్టల పెంపకంలో ముందుగా మార్కెట్‌పై స్టడీ చేయటం అవసరం. గ్రుడ్లు, మాంసానికి ఎక్కడ ఎక్కువ డిమాండ్‌ ఉందో తెలుసుకోవాలి. పెంపకం కోసం పదే పదే పకక్షులను కొనుగోలు చేయకుండా ఒక బ్యాచ్‌ని కొనగానే వాటి నుండి వచ్చే గ్రుడ్లను పొదిగించి బ్రీడర్స్‌ను తయారు చేసుకోవటం వల్ల పకక్షుల కోసం తిరిగి ఎవరి వద్దకో వెళ్లాల్సిన పని ఉండదు. 

తక్కువ కాల వ్యవధిలో ఎక్కువ లాభాలు సంపాదించాలనుకునే వారికి కౌజు పిట్టల బిజినెస్‌ బాగా ఉపయోగపడుతుంది. చికెన్‌లో కన్నా ఎక్కువ ప్రోటీన్లు, ఇతర పోషకాలు ఇందులో లభిస్తుండటంతో ఇటీవల కాలంలో ఈ కౌజు పిట్ట మాంసానికి బాగా గిరాకీ పెరిగింది.

హోటళ్లు, రెస్టారెంట్లలో స్పెషల్‌ కౌజు పిట్టల మాంసం లభిస్తుండటంతో వీటి పెంపకం దారులు ప్రస్తుతం లాభాలబాట పడుతున్నారు. కౌజు పిట్టల బ్రీడర్స్‌ను ప్రస్తుతం హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ పశువైద్య కళాశాలలో అందిస్తున్నారు. అయితే అవి కావాలనుకునే వారు 2 నెలల ముందుగా బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వీటి పెంపకం చేపట్టాలనుకునే వారు ముందు 200 పకక్షులతో ప్రారంభించి తరువాత పెంచుకోవటం ఉత్తమం.

డా. ఆర్‌. శిరీష, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, పౌల్ట్రీ సైన్స్‌ విభాగం, వెటర్నరీ సైన్స్‌ కళాశాల, కోరుట్ల, జగిత్యాల జిల్లా. ఫోన్‌: 7207122962, 6305004498