కొబ్బరి ఉత్పత్తిలో దేశంలో నాలుగో స్థానంలో ఏపీ. లోక్‌సభలో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ వెల్లడి

కొబ్బరి ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరిందని, దేశంలో ఏపీ నాలుగో స్థానంలో ఉందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ తెలిపారు. మంగళవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో హిందూపురం తెదేపా ఎంపీ బీకే పార్థసారథి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 2023-24వ సంవత్సరం మూడో ముందస్తు అంచనాల ప్రకారం దేశవ్యాప్తంగా 23.33 లక్షల హెక్టార్లలో సాగయిన కొబ్బరి తోటలనుంచి 153.29 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి రానుందని చెప్పారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 1.07 లక్షల హెక్టార్లలో 11.81 లక్షల టన్నులపరంగా దిగుమతి రానుందని చెప్పారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ తర్వాత దేశంలో అత్యధిక పంట దిగుబడి ఏపీలోనే ఉన్నదని చెప్పారు. 2022-23లో రాష్ట్రంలో రూ.2,763.23 కోట్ల విలువైన పంట ఉత్పత్తి వచ్చినట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ రైతులు కొబ్బరి దిగుబడిలో కొత్త రికార్డు స్థాపించారని, అందుకు వారిని అభినందిస్తున్నానని అన్నారు. తెల్లదోమలాంటి తెగుళ్లు వచ్చినా వాటి నియంత్రణకు కొబ్బరి బోర్డు వివిధ పరిశోధన సంస్థలతో కలిసి పనిచేసి 8 రకాల నియంత్రణ కార్యక్రమాలను అమల్లోకి తెచ్చినట్లు చెప్పారు.
Read More

రైతులను అప్రమత్తం చేసేందుకు ఏనుగుల సంచారంపై ఏఐ

ఏనుగులు మందలుగా విరుచుకుపడి పంటల్ని సర్వనాశనం చేయడం, మనుషుల్ని తొక్కి చంపడం వంటి ఘటనలు ఇటీవల తరచూ జరుగుతున్నాయి. ఏనుగులు దాడిచేసి పంటలను నాశనం చేశాక వాటిని తరమడం కంటే వాటి రాకను ముందే గుర్తించి అప్రమత్తమైతే చాలావరకు నష్టాన్ని నివారించగలుగుతాం. ఈ దిశగా కేరళలోని అమృత యూనివర్సిటీ ‘ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌’ని ఉపయోగించి ‘అమృత ఎలిఫెంట్‌ వాచ్‌ టెక్నాలజీ’ని రూపొందించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన జీపీఏఐ సదస్సులో దానికి సంబంధించిన త్రీడీ నమూనాను ప్రదర్శించింది.
ఏనుగులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో అత్యాధునిక కెమెరాలు ఏర్పాటు చేస్తారు. రాత్రిపూట పనిచేసేందుకు వీలుగా ఇన్‌ఫ్రారెడ్‌ సపోర్ట్‌ ఉన్న కెమెరాలు వాడతారు. వాటిలోని సెన్సర్లు కెమెరా పరిధిలోకి వచ్చే జంతువుల కదలికల్ని గుర్తిస్తాయి. అవి ఏనుగులయితే అవి ఏ ప్రాంతంలో ఉన్నాయి? ఎటువైపు వెళ్తున్నాయి? వంటి వివరాలన్నీ కొన్ని సెకన్ల వ్యవధిలోనే విశ్లేషించి మెసేజ్‌ రూపంలో స్థానికులకు, రైతులకు మొబైల్‌ ఫోన్లలో పంపిస్తాయి. ఏనుగుల ఫోటోలు, వీడియోలు 5-10 సెకన్లలో అటవీశాఖ అధికారులకు చేరతాయి. కాబట్టి అవసరమైన చర్యలు వెంటనే తీసుకునేందుకు అవకాశాలు ఉంటాయి.

Read More