కేరళను ఏడు రోజులలో తాకనున్న నైరుతి రుతుపవనాలు
సాధారణం కంటే తక్కువ వర్షపాతమే ఈ ఏడాది నైరుతి రుతుపవన కాలంలో (జూన్-సెప్టెంబరు) నమోదవుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. దీర్ఘకాల సగటుతో పోలిస్తే 90% వర్షమే ఈ సీజన్లో కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. రానున్న ఏడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు తెలిపింది. ఈ మేరకు కీలక అంచనాలను ఐఎండీ శుక్రవారం వెలువరించింది. 1971 నుంచి 2020 వరకు సేకరించిన వర్షపాత గణాంకాల ఆధారంగా దీర్ఘకాలిక సగటు (ఎల్పిఏ)ను లెక్కిస్తారు. ఇది ప్రస్తుతం 87 సెంటీమీటర్లుగా ఉంది.
తాజా ఐఎండీ అంచనాల ప్రకారం..
జూన్-సెప్టెంబరు మధ్య ఈశాన్య భారత్లో సాధారణ వర్షపాతం నమోదవుతుంది. దేశవ్యాప్తంగా మిగిలిన ప్రాంతాలు సాధారణం కంటే తక్కువ వర్షపాతంతోనే సరి పెట్టుకోవాల్సి వస్తుంది.
జూన్లో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం ఎల్పీఏలో 92 % కంటే తక్కువే నమోదవుతుంది. ఎల్పీఏలో 90% కంటే తక్కువ వర్షం కురవడాన్ని లోటు వర్షపాతంగా పరిగణిస్తారు.
జూన్ ఎల్ నినో పరిస్థితులు బలహీనంగా ఉంటాయి. సెప్టెంబరులో మాత్రం మధ్యస్థాయి నుంచి బలంగా ఉండొచ్చు.
జూన్లో దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు కంటే ఎక్కువే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ జాబితాలో ఉత్తర్ప్రదేశ్, హరియాణా, పంజాబ్, బిహార్, ఒడిశా, ఛత్తీస్ఘఢ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు ఉన్నట్లు ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు.

