కాండం తొలుచు పురుగు నివారణకు నేలవేము కషాయం
నేలవేము మొక్కల్లో వున్న “ఆండ్రోగ్రాఫోలిడ” అనే రసాయనం కీటకాలకు అభివృద్ధి నిరోధకంగా, భక్షక నిరోధకంగా, క్రిమి సంహారకంగా పనిచేస్తుంది. అందువల్ల ఆకులను సస్యరక్షణలో కషాయంగా కానీ, “పంచపత్ర కషాయం”లో గానీ రైతులు ఉపయోగించుకోవచ్చు. నేలవేము కషాయంలో ఉన్న రసాయనాలు ఎంతో శక్తివంతమైనవి.
నివారించబడే పురుగులు: * రసం పీల్చు పురుగులు * ఆకులను తినే గొంగళిపురుగులు * కాండం తొలుచు పురుగులు.
తయారీ విధానం : ఒక ఎకరం పొలంలోని పంటకవసరమయ్యే కషాయం తయారు చేయడానికి సుమారు 5 కి. నేలవేము ఆకులు అవసరమవుతాయి. ఈ ఆకులను 10 లీ. నీటిలో ఒక గంటసేపు మరిగించాలి. ఈ విధంగా మరిగించిన కషాయం సుమారు 5 లీ. వరకు ఉంటుంది. ఈ కషాయాన్ని బాగా చల్లార్చి, పలుచని గుడ్డతో వడపోయాలి. వడపోసిన కషాయానికి 100 గ్రా. సబ్బు పొడి లేదా 50 గ్రా. కుంకుడు కాయల రసాన్ని కలపాలి. దీనికి 100 లీ. నీటిని కలిపి ఒక ఎకరం పొలంలో సాయంత్రంవేళ పిచికారి చేయాలి. కషాయం బాగా మరుగుతున్నపుడు మధ్య మధ్యలో కర్రతో బాగా కలుపుతూ వుండాలి.
నేలవేము కషాయాన్ని కనీసం 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు ఉపయోగించి వరిలో కాండం తొలుచు పురుగు (తెల్ల కంకి)ను నివారించవచ్చు.
తీసుకోవలసిన జాగ్రత్తలు:
- కషాయం తయారు చేసేటప్పుడు ముక్కుకి గుడ్డ కట్టుకోవాలి.
- పంట దశ, పురుగు ఉధృతిని బట్టి ఈ కషాయాన్ని 2-3 సార్లు ఉపయోగించవచ్చు.
- కషాయాన్ని ఎప్పుడూ నిల్వ చేయరాదు.



