వాతావరణ మార్పులకు అనుగుణంగా సుస్థిర వ్యవసాయం
భారత్, శ్రీలంక మధ్య ఒప్పందం
వాతావరణ మార్పులకు అనుగుణంగా సుస్థిర వ్యవసాయ విధానాల అమలుపై ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార పథకం (యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ) ద్వారా భారతదేశం, శ్రీలంక మధ్య ఒప్పందం కుదిరింది. మంగళవారం అమరావతి సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ ఎక్స్ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ భారతదేశ ప్రతినిధి, సంచాలకులు ఎలిజబెత్ ఫౌర్ పాల్గొని ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడులో ఐదేళ్లపాటు దీన్ని అమలు చేస్తారు. ఇందులో భాగంగా వైఎస్సార్ జిల్లాలో వ్యవసాయ శాఖ, ప్రపంచ ఆహార పథకం ద్వారా రైతుసాధికార సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడతారు. వాతావరణ మార్పులు, ప్రతికూల ప్రభావాల నుంచి సన్న, చిన్నకారు, మహిళా రైతుల జీవనోపాధిని సురక్షితం చేయడానికి ఈ పథకం దోహదపడుతుందని రాజశేఖర్ తెలిపారు.


