రొయ్యలపై సుంకాన్ని మినహాయించాలి 27% టారిఫ్‌పై అమెరికాతో కేంద్రం చర్చించాలి : చంద్రబాబు
భారత్ నుంచి వెళ్లే సముద్ర ఆహార ఉత్పత్తులపై 27% దిగుమతి సుంకం విధించిన అమెరికా ప్రభుత్వంతో వెంటనే చర్చలు జరపాలని ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రప్రభుత్వానికి సూచించారు. సుంకాల జాబితా నుంచి రొయ్యల ఉత్పత్తులను మినహాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌కు ఆదివారం లేఖ రాశారు. ఏపీ జీడీపీలో మత్స్యరంగం కీలక భూమిక పోషిస్తోందని, అమెరికా సుంకాల కారణంగా ఆక్వా పరిశ్రమ నష్టపోతోందని తెలిపారు. ‘భారత్ నుంచి వెళ్లే సముద్ర ఆహార ఎగుమతులపై అమెరికా ప్రభుత్వం 27% దిగుమతి సుంకం విధించింది. ఈనెల 5 నుంచే ఇది అమల్లోకి వచ్చింది. 2023-24లో మన దేశం నుంచి అమెరికాకు 2.55 బిలియన్ డాలర్ల విలువైన సముద్ర ఆహార ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. వీటిలో రొయ్యలే 92% వాటాను కలిగి ఉన్నాయి’ అని లేఖలో పేర్కొన్నారు.

