ఎరువుల కొరత సమస్యలపై 9154970454కు ఫోన్ చేయండి
ఎన్టిఆర్ జిల్లాలో ఎరువుల సరఫరాపై ఏవైనా ఫిర్యాదులు లేదా సమాచారాన్ని అందించేందుకు విజయవాడ కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ నంబర్ 9154970454కు ఫోన్ చేయవచ్చని రైతులకు కలెక్టర్ జి. లక్ష్మీశ సూచించారు. ఈ నంబర్‌ను ఎరువుల దుకాణాలు, సొసైటీల వద్ద తప్పనిసరిగా ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ నుంచి క్షేత్రస్థాయి అధికారులతో ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఖరీఫ్ వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న క్రమంలో ఎరువులు సమృద్ధిగా ఉన్నట్లు తెలిపారు. కిలో ఎరువు కూడా పక్కదారి పడడానికి వీల్లేదన్నారు. సాగు అవసరాల మేరకే ఎరువులు తీసుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎరువుల లెక్కలకు సంబంధించి ఫిజికల్, ఆన్లైన్ రికార్డులతో లావాదేవీలు పారదర్శకంగా ఉండాలన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని వివరించారు. జిల్లాలో 6,388 మెట్రిక్ టన్నుల యూరియాతో పాటు, డీఏపీ, ఎంవోపీ, ఎస్.ఎస్.పి. కాంప్లెక్సు. ఇలా మొత్తం 23,820 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ వెల్లడించారు. నానో ఎరువుల వినియోగంతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

