ఎం.ఎస్. స్వామినాథన్ అవార్డుకు బాపట్ల శాస్త్రవేత్త ఎంపిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్లకు చెందిన ప్రముఖ మొక్కజొన్న శాస్త్రవేత్త బడ్డుపల్లి మారుతీ ప్రసన్న జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక టాస్ ఎం.ఎస్. స్వామినాథన్ అవార్డుకు ఎంపికయ్యారు. పురస్కారం కింద ఆయనకు రూ. లక్ష నగదు అందజేయనున్నారు. దిల్లీకి చెందిన ట్రస్టు ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ (టాస్) ఆధ్వర్యంలో వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న శాస్త్రవేత్తలకు ఏటా ఎం.ఎస్. స్వామినాథన్ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి సురేష్ప్రభు చేతుల మీదుగా దిల్లీలో డిసెంబరు 20న మారుతీ ప్రసన్న పురస్కారం అందుకోనున్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థి అయిన ప్రసన్న ప్రస్తుతం కెన్యాలోని నైరోబీలో అంతర్జాతీయ మొక్కజొన్న పరిశోధనా కేంద్రం విబాగాధిపతిగా సేవలు అందిస్తున్నారు. గతంలో మెక్సికోలో ఇదే పరిశోధనా కేంద్రం సంచాలకుడిగా పనిచేశారు. ఉత్తర అమెరికా, ఆఫ్రికా దేశాల్లో మొక్కజొన్న దిగుబడులు పెంచడంలో ఆయన విశేష కృషి చేశారు. 1965 ఆగస్టు 31న బాపట్లలో జన్మించిన మారుతీ ప్రసన్న స్థానిక ఏజీ కళాశాలలో ఏజీ బీఎస్సీ, ఎమ్మెస్సీ కోర్సులు చదివారు. దిల్లీలోని భారతీయ కృషి అనుసంధాన పరిషత్లో పీహెచ్డీ చేశారు. 1991లో అదే సంస్థకు చెందిన ఐఏఆర్ఐలో జన్యు శాస్త్రవేత్తగా చేరి రెండు థాబ్దాల పాటు సేవలు అందించారు. మొక్కజొన్నపై విశిష్ట పరిశోధనలు చేశారు. ఉత్తమ పరిశోధనలకు పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు.

