మహిళాశక్తిలో ఆహారశుద్ధి పరిశ్రమలు
- ఇక్రిశాట్ సాంకేతిక సహకారం
- త్వరలో సీఎం సమక్షంలో ఒప్పందానికి సెర్ప్ కార్యాచరణ
మహిళాశక్తి పథకం కింద తెలంగాణలో భారీఎత్తున ఆహారశుద్ధి యూనిట్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్వయం సహాయక సంఘాల ద్వారా రానున్న మూడేళ్లలో 2,500 పరిశ్రమల ఏర్పాటుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ప్రతిపాదనలు రూపొందించింది. హైదరాబాద్ శివారులోని ఇక్రిశాట్ సంస్థ దీనికి సాంకేతిక సహకారం అందించనుంది. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందం కుదుర్చుకోనుంది. అందులో భాగంగా జిల్లాల వారీగా అందుబాటులో ఉన్న పంట ఉత్పత్తులను గుర్తించి, స్థానిక మహిళా సంఘాల ద్వారా వాటి శుద్ధి కోసం పరిశ్రమలను ఏర్పాటు చేస్తుంది. సెర్ప్ ప్రతిపాదనలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క ఆమోదం తెలిపారు.
ఏయే జిల్లాల్లో… ఏయే పరిశ్రమలంటే
వరంగల్‌లో మిర్చి, పసుపు మెదక్‌లో శనగలు, సీతాఫలాలు, ఉల్లిగడ్డ, మహబూబ్‌నగర్‌లో తృణ దాన్యాలు, సీతాఫలాలు, నిజామాబాద్‌లో పసుపు, మొక్కజొన్న, వికారాబాద్‌లో తృణ దాన్యాలు, కూరగాయలు, భద్రాద్రి-కొత్తగూడెంలో మిర్చి, జీడిపప్పు, సూర్యాపేటలో కూరగాయలు, పాలు, కరీంనగర్లో కూరగాయలు, జోగులాంబ గద్వాలలో వేరుశనగ, మహబూబాబాద్‌లో మిర్చి, పండ్లు, హనుమకొండలో పప్పులు, తృణధాన్యాలు, ములుగులో మిర్చి, సిద్దిపేటలో కూరగాయలు, మొక్కజొన్న, పండ్లు, కుమురంభీం ఆసిఫాబాద్‌లో పప్పుధాన్యాలు, పెద్దపల్లిలో కూరగాయలు, నల్గొండలో బత్తాయి, మేడ్చల్ – మల్కాజిగిరిలో ద్రాక్ష యాదాద్రి భువనగిరిలో పాడి ఉత్పత్తులు, జయశంకర్ భూపాలపల్లిలో కూరగాయలు, జగిత్యాలలో మామిడి, రంగారెడ్డిలో పండ్లు, కూరగాయలు, ఖమ్మంలో మిర్చి, పండ్లు, కూరగాయలు సిరిసిల్లలో చేపలు, కామారెడ్డిలో మొక్కజొన్న, చెరకు, నాగర్ కర్నూల్లో మామిడి, వేరుశనగ, నారాయణపేటలో సేంద్రియ పప్పు, మంచిర్యాలలో కూరగాయలు, పండ్లు, ఆదిలాబాద్‌లో సోయాబీన్, సీతాఫలాలు, కూరగాయలు, వనపర్తిలో వేరుశనగ, జనగామలో బంగాళాదుంప, సంగారెడ్డిలో అల్లం శుద్ధి యూనిట్లకు ప్రతిపాదించారు.
బ్రాండ్ ఖరారుకు కసరత్తు
ఆహారశుద్ధి పరిశ్రమలకు మార్గనిర్దేశం చేసేందుకు వీలుగా ఇక్రిశాట్‌కు అందులో భాగస్వామ్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంస్థతో సెర్ప్ సీఈవో దివ్యదేవరాజన్ సంప్రదింపులు జరిపారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటారు. ఒప్పందంలో భాగంగా శుద్ధి విధానాలు, యంత్రాల వినియోగం, పరిశ్రమల నిర్వహణపై సంఘాల సభ్యులకు శిక్షణ ఇస్తారు.. పంట ఉత్పత్తుల కొనుగోళ్లు, ఎగుమతులకు అవసరమైన సహకారం అందించనున్నారు. వీటి ఏర్పాటుకు ప్రభుత్వం బ్యాంకు రుణాల సదుపాయం కల్పించనుంది. పరిశ్రమల స్థాపన అనంతరం… ఆయా ప్రాంతాల చారిత్రక నేపథ్యం, పర్యాటక స్థలాలు తదితరాలు ప్రాతిపదికన వీటికి బ్రాండ్‌ను ఖరారు చేయనున్నారు.
సొంత పొదుపు నిధులతోనే…
ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు జాతీయ ఫుడ్ ప్రాసెసింగ్ మిషన్, ప్రధాన మంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల వ్యవస్థీకరణ పథకం తదితరాలు తోడ్పాటు అందిస్తున్నాయి. వీటికి సబ్సిడీ ఉన్నా బ్యాంకు రుణాలతో ముడిపడి ఉన్నందున.. ప్రస్తుతం మహిళా సంఘాలకు పొదుపు నిధులతో సొంతంగా పరిశ్రమలను స్థాపించేలా సెర్ప్ ప్రణాళిక రూపొందించింది. అనంతర కాలంలో భారత చిరుధాన్యాల నిర్వహణ సంస్థ(ఐఐఎంఆర్), జాతీయ గ్రామీణ వ్యవసాయాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) తదితర సంస్థలతోనూ ఒప్పందాలు చేసుకొని మరిన్ని పరిశ్రమలను స్థాపించాలని భావిస్తోంది.

