తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి వ్యవసాయం అత్యంత ప్రాధాన్యతాంశమని రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. రుణమాఫీ, రైతు భరోసా, రైతు భీమా, వడ్లకు బోనస్, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి ఎన్నో పథకాలని అమలు చేస్తున్నామని వివరించారు. ఏడాదికి వ్యవసాయ రంగానికి సుమారు 50 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని తెలిపారు. ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఆయన సందర్శించారు. రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలో జరిగిన విద్యార్థులతో ఇష్టాగోష్టి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. తన సొంత జిల్లాలో నెలకొన్న ఈ విశ్వవిద్యాలయం అంటే తనకెంతో అభిమానం అన్నారు. అలాగే తన జిల్లా పరిధిలోని తాండూర్ కందికి భౌగోళిక గుర్తింపు లభించి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించడం సంతోషదాయకం అని స్పీకర్ అన్నారు. ఈ గుర్తింపు వెనక పిజేటిఏయు కృషి ఎంతో ఉందన్నారు. సమర్థుడు, మేధావి అయిన ఉపకులపతి ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య నేతృత్వంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ ఆకాంక్షించారు. విశ్వవిద్యాలయం భూములు మరియు ఆస్తుల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అందుకు తాను పూర్తిగా సహకరిస్తానన్నారు. విశ్వవిద్యాలయానికి సంబంధించి నిధులు, నియామకాలు, బోధన బోధనేతర సమస్యల గురించి స్థానిక శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్, ఉపకులపతిని తీసుకొని ముఖ్యమంత్రితో చర్చిస్తామని హామీ ఇచ్చారు. విశ్వవిద్యాలయ సమగ్ర అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పిలుపునిచ్చారు. ఉపకులపతిగా నియమితులైన కొన్ని నెలల్లోనే ఆల్దాస్ జానయ్య విశ్వవిద్యాలయ అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టారని స్థానిక రాజేంద్రనగర్ శాసనసభ్యుడు టి. ప్రకాష్ గౌడ్ అభినందించారు. సవాళ్లను అధిగమిస్తూ విశ్వవిద్యాలయానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన సూచించారు. అందరి సహకారంతో ఈ మధ్యనే విశ్వవిద్యాలయ వజ్రోత్సవ ఉత్సవాలను ఘనంగా నిర్వహించామని ఉపకులపతి ఆల్దాస్ జానయ్య అన్నారు. రైతాంగం, విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది అభివృద్ధి, సంక్షేమం కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా విశ్వవిద్యాలయ భూములను పూర్తిగా రక్షిస్తామన్నారు. అన్యాక్రాంతం, ఆక్రమణలకు గురైన భూముల్ని వెనక్కి తీసుకుంటామన్నారు. రైతుల కళ్ళల్లో కొత్త వెలుగులు తీసుకురావడానికి కృషి చేస్తామని ఆల్దాస్ జానయ్య వివరించారు. స్కిల్ యూనివర్సిటీతో భాగస్వామ్యం కుదుర్చుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయానికి నిధులు పెంచాలని, నియామకాలు చేపట్టాలని, కొత్త వసతి గృహాలు నిర్మించాలని విద్యార్థులు కోరారు. అలాగే పరిశోధనలకి నిధులు అత్యధికంగా కేటాయించాలని, ఖాళీ పోస్టుల్ని భర్తీ చేయాలని, హెల్త్ కార్డులు, మెడికల్ రియంబర్స్మెంట్ నిధులు మంజూరు చేయాలని బోధన, బోధ నేతర సిబ్బంది కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం అధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.