శాస్త్రీయసాగు, మార్కెటింగ్‌పై రైతులు అవగాహన పెంచుకోవాలి
వ్యవసాయశాఖ ఎక్స్ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్
రైతులు శాస్త్రీయ సాగు పద్ధతులు, ప్రకృతి వ్యవసాయం, మార్కెటింగ్‌పై అవగాహన పెంచుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ ఎక్స్ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ సూచించారు. మిరపలో రసాయనాల వాడకం తగ్గించి.. ప్రకృతి వ్యవసాయ విధానాలు అవలంబిస్తే, గిట్టుబాటు ధర లభిస్తుందని చెప్పారు. ఉద్యానశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడలో మిరప, టమాటా రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు, ఉద్యాన అధికారులు, రైతులు పాల్గొని తమ అభిప్రాయాలు తెలిపారు. విత్తన నాణ్యత, మొక్కల ఎంపిక, పోషణపై శాస్త్రీయ విధానాలు పాటించాలని రాజశేఖర్ వివరించారు. ‘మిరప, టమాటాల ధరల్లో ఒడుదొడుకులు అధికంగా ఉన్నాయి. అగ్రివాచ్ ద్వారా వచ్చే సీజన్లో ఎంత ధర ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. వాతావరణ పరిస్థితుల్ని ముందే అంచనా వేసే పరిజ్ఞానం ఉన్నా.. రైతులు నష్టపోతున్నారు. ఈదురు గాలుల తీవ్రత నుంచి పంటను రక్షించుకునేందుకు విండ్ బ్రేకర్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం’ అని రాజశేఖర్ పేర్కొన్నారు. రైతులు బహుళ పంటల సాగుపై దృష్టి పెట్టాలని ఉద్యాన శాఖ కమిషనర్ శ్రీనివాసులు సూచించారు. ‘2021 నుంచి మిరపలో నల్లతామర పురుగు నివారించేందుకు రైతులు మూడు, నాలుగు రోజులకోసారి పిచికారీలు చేస్తున్నారు. దీంతో పురుగుమందుల అవశేషాల కారణంగా ఎగుమతుల్లో ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. ధర తగ్గుతోంది. రైతులు పురుగు, తెగుళ్ల మందులు, కలుపు మందుల వాడకంలో జాగ్రత్తలు తీసుకోవాలి. తద్వారా ఖర్చు తగ్గించుకోవడంతోపాటు నాణ్యమైన ఉత్పత్తిని పొందవచ్చు’ అని శాస్త్రవేత్త శిరీష వివరించారు. టమాటా పండించినా గిట్టుబాటు ధర రావడం లేదని ఈ సందర్భంగా రైతులు వివరించారు. ప్రభుత్వం రాయితీపై పరికరాలు, విత్తనాలు అందించేలా చూడాలని కోరారు. మిరపలో నల్లతామర పురుగు కారణంగా నష్టపోతున్నామని, ఎకరాకు రెండు, మూడు క్వింటాళ్లొస్తున్న పరిస్థితులున్నాయని కొందరు రైతులు వివరించారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ విజయ సునీత, ఉద్యానశాఖ అదనపు సంచాలకులు వెంకటేశ్వర్లు, అశోక్‌కుమార్, హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

