120 రోజుల్లోనే కంది పంట

  • ఏటా మూడు పంటలు.. ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి
  • కొత్త వంగడాన్ని ఆవిష్కరించిన ఇక్రిశాట్‌

కందుల ఉత్పత్తిలో స్వావలంబన సాధించే దిశగా కొత్త వంగడాన్ని ఆవిష్కరించింది హైదరాబాద్‌లోని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన సంస్థ (ఇక్రిశాట్‌). 120 రోజుల్లోనే పంట చేతికి రావడం, ఏడాదిలో మూడు పంటలు పండించుకునే అవకాశం ఉండడం.. చీడపీడలను, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవడం ఈ వంగడం ప్రత్యేకతలు. ప్రస్తుత రకాలు వర్షాకాలంలోనే సాగుకు అనుకూలమైనవి. 6 నెలల పంటకాలంతో ఎకరాకు గరిష్ఠంగా 6 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే ఇస్తున్నాయి. కొత్త వంగడం ఎకరాకు 10 క్వింటాళ్ల మేర దిగుబడి ఇస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ‘ఐసీపీవీ 25444’ వంగడాన్ని ఇక్రిశాట్‌ డైరెక్టర్‌ జనరల్‌ హిమాన్ష్‌ పాఠక్‌ సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ‘యాక్సిలరేటెడ్‌ క్రాప్‌ ఇంప్రూవ్‌మెంట్‌ గ్లోబల్‌ రీసెర్చ్‌ ప్రోగ్రామ్‌’ డైరెక్టర్‌ సీన్‌ మేయెస్‌, ఇతర శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. దేశంలో ఏటా 1.25 కోట్ల ఎకరాల్లో కంది పంట సాగవుతుండగా.. 35 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షల ఎకరాల్లో సాగవుతుండగా.. 2.01 లక్షల టన్నుల దిగుబడి వస్తోంది. దేశీయ అవసరాల కోసం ఏటా 15 లక్షల టన్నుల మేర కందులను ప్రభుత్వం దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇక్రిశాట్‌లో ఐదేళ్ల విస్తృత పరిశోధన అనంతరం సీనియర్‌ శాస్త్రవేత్త గంగిశెట్టి ప్రకాశ్‌ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు బెలియప్ప శ్రుతి, బొమ్మ నరేశ్‌ల బృందం మేలైన కంది రకం ఐసీపీవీ 25444ను అభివృద్ధి చేసింది. తెలంగాణ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో దీనిని పరీక్షించగా మంచి ఫలితాలు వచ్చాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుత రకాలు 35 డిగ్రీల ఉష్ణోగ్రతలను మాత్రమే తట్టుకుంటుండగా.. కొత్త రకం 45 డిగ్రీల ఉష్ణోగ్రతల్లోనూ పండుతుందని, ఎకరానికి 2 కిలోల విత్తనాలు సరిపోతాయని వెల్లడించారు.

పది లక్షల టన్నుల అదనపు ఉత్పత్తికి అవకాశం
నూతన వంగడంతో దేశంలో కంది సాగు, ఉత్పత్తిలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. దీని ద్వారా అదనంగా పది లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించే అవకాశం ఉంది. అన్నదాతల ఆదాయం మూడురెట్లు పెరుగుతుంది. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో వరికి ప్రత్యామ్నాయంగా కంది సాగు పెరిగేందుకు ఇది దోహదపడుతుంది.

  • హిమాన్షి పాఠక్‌, ఇక్రిశాట్‌ డైరెక్టర్‌ జనరల్‌
Read More

వ్యవసాయంలో ‘కృత్రిమ మేధ’ వినియోగం

తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయంలో ఉపయోగపడే విధంగా కృత్రిమ మేధ సాంకేతికతను వినియోగించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దీనికి అవసరమైన కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. మంత్రి బుధవారం సచివాలయంలో వివిధ సాంకేతిక కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ”పంటలకు వచ్చే చీడపీడలను ముందుగానే గుర్తించడం, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు జరిగే పంట నష్టాన్ని త్వరితగతిన అంచనా వేయడం, పంటల కొనుగోళ్లకు సంబంధించి ముందుగానే దిగుబడులు అంచనా వేయడం, నమోదైన సాగు విస్తీర్ణాలను ఉపగ్రహ ఛాయా చిత్రాల ద్వారా సరిపోల్చడం తదితర అంశాల్లో ఏఐని వినియోగించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది” అని మంత్రి పేర్కొ న్నారు. అనంతరం ఇక్రిశాట్‌, అగ్రివాస్‌ కంపెనీ ప్రతినిధులు పలు అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. సమావేశంలో వ్యవసాయ కార్యదర్శి రఘునందన్‌రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read More

వరి కంటే ఆ పంటలే లాభదాయకం

జనరల్‌ నేచర్‌ అధ్యయనంలో వెల్లడి

వరి కంటే చిరుధాన్యాలు, జొన్న, మొక్కజొన్న పంటల సాగు లాభదాయకమని జనరల్‌ నేచర్‌ కమ్యూనికేషన్స్‌ తాజా అధ్యయనంలో వెల్లడైంది. వాతావరణంలో మార్పులు, వర్షాభావం, ఇతర ప్రతికూల పరిస్థితుల్లో వరి ఉత్పత్తి ప్రభావితం అవుతోందని.. ఇది భవిష్యత్తులో ఆహారభద్రతకు సమస్యగా మారే ప్రమాదమున్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని సూచించింది. వరి నుంచి ఇతర పంటలకు మారిన అన్నదాతలు 11% లాభాలు గడించినట్లు అధ్యయనం వెల్లడించింది. వరి, జొన్న, చిరుధాన్యాలు, మొక్కజొన్నలకు సంబంధించిన గణాంకాలను ఇక్రిశాట్‌ నుంచి పొందినట్లు పేర్కొంది. అధ్యయన బృందంలో భారతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, హైదరాబాద్‌లోని ఇండియన్‌ బిజినెస్‌ స్కూల్‌ అసోసియేట్‌ ప్రొ. అశ్విని ఛాత్రే తదితరులున్నారు.

Read More