రెండేళ్ల తర్వాత మళ్లీ టన్ను ధర రూ. 20 వేలపైకిదిగుమతి సుంకం పెంపుతో రైతులకు కలిసి వస్తున్న ధర తెలంగాణా రాష్ట్రంలో ఆయిల్‌పాం సాగును గణనీయంగా పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇదే సమయంలో ఆయిల్‌పాం గెలల ధరల్లో పెరుగుదలతో రైతుల్లోనూ ఉత్సాహం కనిపిస్తోంది. గతేడాది నవంబరులో రూ. 12,440 పలికిన టన్ను గెలల ధర.. ప్రస్తుతం రూ. 20,400కు చేరింది. అంటే రూ. 8 వేల వరకూ పెరిగింది. 2022 జూన్‌లో టన్ను గెలల ధర రూ. 23,400 పలకగా.. ఆ తరువాత క్రమేపీ పతనమైంది. 2023లో టన్ను ధర రూ. 14,205 కు మించలేదు. రెండేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ పాత ధరలు వస్తుండడంతో.. సాగు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.దిగుమతి సుంకం ఆధారంగా ధరలు ఆరేళ్ల క్రితం పామాయిల్‌పై దిగుమతి సుంకం 42 శాతం ఉండగా క్రమేపీ సున్నాకు తగ్గించారు. దీంతో దిగుమతులు పెరిగి దేశంలో ఆయిల్‌పాం గెలల ధరలు పడిపోయాయి. తాజాగా కేంద్రం దిగుమతి సుంకాన్ని 27 శాతానికి పెంచడంతో మళ్లీ ధరలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 2 లక్షల ఎకరాలకు చేరింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా 19.40 శాతం ఆయిల్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ రేట్‌ (ఓఈఆర్‌) అమలు చేస్తున్నారు. ఓఈఆర్‌ పెరుగుదలకు అనుగుణంగా రైతులకు ధర వస్తుంది.ఆయిల్‌పామ్‌ గెలల ధరలో మార్పులు ఇలా.. సమయం టన్ను ధర (రూ.) 2022 నవంబరు 13,741 డిసెంబరు 13,881 2023 నవంబరు 12,440 డిసెంబరు 12,448 2024 నవంబరు 20,413శుభపరిణామం టన్ను ఆయిల్‌పాం గెలల ధర రూ. 20 వేల స్థాయిని దాటడం శుభపరిణామం అని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పంట సాగును పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ఏటా సుమారు లక్ష ఎకరాల సాగు విస్తీర్ణం పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని, రైతులకు స్థిరీకరణ ధర కోసం కేంద్రాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.