కూరగాయ పంటల్లో సత్ఫలితాలకు హెర్బల్ టీ

కావలసిన పదార్థాలు :
పిచ్చి తులసి లేదా తులసి, పాలకొడిస, తుత్తురు బెండ, పొగాకు, బోగన్ విల్లియా (కాగితం పూలు), వేప, టేకు ఆకులు, కలబంద, బొప్పాయి, ఆవు మూత్రం, పశువుల పేడ, బెల్లం

తయారు చేసే విధానం :

  • పైన తెలిపిన ఆకులను 5 కిలోలు తీసుకొని ముద్దగా చేయాలి.
  • ఈ మిశ్రమానికి 5 కిలోల పశువుల పేడను, 100 గ్రాముల బెల్లం పొడిని కలపాలి.
  • ఈ మిశ్రమాన్ని ఒక కుండలో తీసుకొని ప్రతిరోజూ ఒక కర్రతో 7 రోజుల వరకూ కలుపుతూ ఉండాలి.
  • 7 రోజుల తర్వాత “హెర్బల్ టీ” తయారవుతుంది. ఈ మిశ్రమానికి 5 లీటర్ల నీరు కలిపి పలుచని గుడ్డతో వడపోయాలి.
  • ఈ మిశ్రమాన్ని 100 లీటర్ల నీటితో కలిపి ఒక ఎకరా పొలంలో పంటపై పిచికారి చేయాలి.

ఎలా పనిచేస్తుంది? : పైన తెలిపిన వివిధ రకాల ఆకులలో ఎన్నో రకాల “ఆల్కలాయిడ్లు” ఉండుట వలన పురుగుల నియంత్రణలోనే కాకుండా కొన్ని రకాల తెగుళ్ళను అరికట్టడంలోనూ ఉపయోగపడుతుంది.

ఉపయోగాలు : ఇది చాలా శక్తివంతమైన ద్రావణం. ఈ ద్రావణం పంటలలో వచ్చే కీటక నియంత్రణలోనే కాకుండా వరిలో వచ్చే ఆకుమచ్చ తెగులు నివారణలో కూడా బాగా పని చేసినట్లు రైతుల అనుభవం. ఈ ద్రావణాన్ని అన్ని పంటలలోనూ ఉపయోగించవచ్చు. ముఖ్యంగా కూరగాయల పంటలలో ఉపయోగించి సత్ఫలితాలు పొందవచ్చు.

Read More

కీటక, శిలీంద్రనాశినిగా ‘ఇంగువ’

కీటకనాశినిగా ‘ఇంగువ’…. అన్ని రకాల పంటల మీద రసం పీల్చే పురుగుల దాడే తొలుత మొదలవుతుంది. మొక్కల ఎదుగుదలను తొలిదశలోనే స్తంభింపచేయడమే కాక ఇతర రకాల తెగుళ్లకు తివాచీ పర్చి ఆహ్వానం పలుకుతాయి. తొలి దశలోనే పైరుకు ఎదురు దెబ్బగా నిలిచే అన్ని రకాల రసం పీల్చే పురుగులను అరికట్టడానికి ఇంగువ ద్రావణం అద్భుతంగా పనిచేస్తుంది. 200 లీటర్ల నీటిలో పది లీటర్ల ఆవుమూత్రం కలపాలి. దానికి 200 గ్రాముల ఇంగువ ముద్దను గోరు వెచ్చని నీటిలో కరిగించి కలిపి పిచికారి చేస్తే అన్ని రకాల రసం పీల్చే పురుగులు పైరు నుంచి దూరంగా పారిపోతాయి.

ఆకు చుట్టు పురుగు నివారణకు… ఆకు చుట్టు పురుగు ఆశించినప్పుడు అతి స్వల్పకాలంలోనే భారీ నష్టం జరుగుతుంది. ప్రత్యేకించి మునగవంటి సున్నితమైన ఆకులు కలిగిన పంటలో నష్ట తీవ్రత మరింత ఎక్కువ. దీన్ని నివారించడానికి 200 లీటర్ల నీటికి 10 లీటర్ల ఆవు మూత్రం 400గ్రాముల ఇంగువ కలిపి పిచికారి చేసుకోవాలి.

శిలీంద్ర నాశినిగా ఇంగువ : ఇంగువలో బ్యాక్టీరియా వ్యతిరేక, శిలీంద్ర నాశక లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అన్ని రకాల శిలీంద్ర సంబధిత సమస్యల్లో ఇంగువను వాడవచ్చు. ఆవు మూత్రంతో కలిపి లీటరుకు 2 గ్రాముల ఇంగువ పిచికారి చేసుకుంటే శక్తివంతంగా పనిచేస్తుంది.

ఇంగువ కషాయంతో అగ్గితెగులు నివారణ
ప్రాచీన విజ్ఞానం వరి పంటను అగ్గితెగులుబారినుండి కాపాడింది. అగ్గి తెగులు నివారణకు ఆయా ప్రాంతాల్లో రెండు రకాల కషాయలను వినియోగించారు.

మొదటి విధానం : మూడు కిలోల ఆవు పేడను పది లీటర్ల నీటిలో కలిపి వడకట్టి పక్కన పెట్టుకొండి. ఇప్పుడు సేకరించి శుభ్రపరచిన తాజా మారేడు ఆకులను రెండు లీటర్ల నీటిలో ఉడికించి దించి చల్లార్చి వడకట్టాలి. ఈ రెండింటిని 100 లీటర్ల నీటిలో కలపండి. దానికి మరో 3 లీటర్ల ఆవు మూత్రం కలిపి పిచికారి చేసుకోవాలి.
రెండవ పద్ధతి : మారెడు పత్రి – తులసి – ఇంగువ కషాయం : మారేడు, తులసి 100 గ్రాములు సేకరించి రెండు లీటర్ల నీటిలో ఉడికించి వడకట్టాలి. దానికి మూడు లీటర్ల ఆవు మూత్రం, 3 కిలోల పేడ, పది లీటర్ల నీటిలో కలిపి కల్లాపి నీటిలో కలిపి వడకట్టుకోవాలి. ఈ ద్రావణ మిశ్రమాన్ని 100 లీటర్ల నీటిలో కలుపు కోవాలి. దానికి 200 గ్రాముల ఇంగువ కలుపుకొని పిచికారి చేయాలి. ఇది ఖచ్చితమైన ఫలితాలను అందిస్తుంది. ఒరిస్సా రాష్ట్రంలో అగ్గి తెగులు వ్యాపించి భారీగా నష్టం జరిగినప్పుడు ఈ రెండు ద్రావణాలను వినియోగించిన పొలాలు మాత్రమే బతికి బట్టకట్టాయి.

Read More

అధిక దిగుబడి, గింజ నాణ్యతకు సప్తధాన్యాంకుర ద్రావణం

సప్తధాన్యాలను పాత్రలో వేసి నానిన తర్వాత మొలక కట్టాలి (విడివిడిగా).

  1. 100 గ్రా. పెసలు (మొలకలు)
  2. 100 గ్రా. మినుములు (మొలకలు)
  3. 100 గ్రా. అలసందలు (మొలకలు)
  4. 100 గ్రా. శనగలు (మొలకలు)
  5. 100 గ్రా. నువ్వులు (మొలకలు)
  6. 100 గ్రా. ఉలవలు (మొలకలు)
  7. 100 గ్రా. గోధుమలు (మొలకలు)

తడిగుడ్డతో వేలాడకట్టి మొలక వచ్చాక అన్ని కలిపి రుబ్బి ఒక లీ. నీరు కలపాలి. 10 లీ. ఆవు మూత్రం కలపాలి. కర్రతో బాగా కలియ త్రిప్పాలి. 2 గంటలు అలాగే ఉంచితే ఘనపదార్థం అడుగుకి చేరుతుంది. ఆ కషాయం వడపోసి మొక్కలపై పిచికారి చేయాలి. ఇది 48 గంటలు నిలువ ఉంటుంది. పైరు పాలు పోసుకునేటప్పుడు అన్ని పంటలకు పిచికారి చేస్తే దిగుబడి, గింజ నాణ్యత పెరుగుతుంది.

Read More

దశపత్ర కషాయం తయారీ ఎలా?

కావలసిన ఆకులు, పదార్థాలు: పిచ్చి తులసి - 250 గ్రా., తులసి - 250 గ్రా., పాలకొడిశ - 250గ్రా., తుత్తురుబెండ - 250 గ్రా., పొగాకు- 250 గ్రా., కాగితంపూల ఆకులు - 250 గ్రా., వేపాకులు - 250 గ్రా. టేకుఆకులు - 250 గ్రా., కలబంద - 250 గ్రా., బొప్పాయి ఆకులు - 250 గ్రా.

పైన సూచించిన ఆకులను మెత్తగా నూరి ముద్ద చేయాలి. దీనిని ఒక పెద్ద కుండలోగానీ లేదా ప్లాస్టిక్ డ్రమ్ములో గానీ వేసి దానికి 5 లీ. ఆవుమూత్రాన్ని, 5 లీ. నీరు కలపాలి. ఈ ద్రావణం ఉంచిన కుండపై మూతపెట్టి 10 రోజుల పాటు ప్రతిరోజు ద్రావణాన్ని సవ్య, అపసవ్య దిశలలో బాగా కర్రతో కలుపుతూ ఉండాలి. తరువాత ఈ ద్రావణాన్ని పలుచని గుడ్డతో వడపోయాలి. ఈ ద్రావణానికి 150 లీ. నీరు కలిపి ఒక ఎకరా పొలంలో సాయంత్రం వేళ పంటపై పిచికారీ చేయాలి.
Read More

భూమిలో సేంద్రియ కర్బనం పెంపుకు ‘రామబాణం’

విపరీతమైన రపాయనాల వాడకం వల్ల భూమిలో సేంద్రియ కర్బనం విపరీతంగా తగ్గిపోయింది. పత్తిపాటి రామయ్య బెంగుళూరు వైదిక విజ్ఞాన వర్సిటీలో పి.హెచ్.డి. చేసి “రామబాణం” అనే వ్యాసాన్ని ప్రచురించారు. అది 40 రోజుల ప్రోగ్రాం. చిత్తూరు జిల్లా రైతు మునిరత్నం నాయుడు రామబాణాన్ని తయారు చేసి తన భూమిలో వేసిన తర్వాత 0.5 ఉండే సేంద్రియ కర్బనం 0.75 కి పెరిగింది.

తయారు చేసే విధానం

  • మొదటి రోజు రెండున్నర కిలోల అల్లం, రెండున్నర లీటర్ల నీటితో కలిపి బాగా రుబ్బి ఒక కుండలో పోయాలి. పోసిన తరువాత గుడ్డతో కుండని కట్టాలి. కుండను గుంతలో పెట్టి మట్టి కప్పాలి.
  • ఆరవ రోజు ఉదయం 4 కి. ఆవుపేడ, 4 లీ. నీటితో కలిపి కుండకి గుడ్డకట్టి గుంతలో పెట్టాలి.
  • మొదటి రోజు పూడ్చిన అల్లం ద్రావణం కుండను 6వ రోజు సాయంత్రం 4 గంటలకు గుంతనుండి బయటకు తీసి అల్లం ద్రావణాన్ని 200 లీ. నీటిలో కలిపి ఎకరం పొలంలోని భూమిపై పిచికారి చేయాలి.
  • 11వ రోజు సాయంత్రం 6వ రోజు గుంతలో ఉంచిన ఆవుపేడ ద్రావణాన్ని బయటకు తీసి 200 లీ. నీటిలో కలిపి ఎకరం పొలంలోని భూమిపై పిచికారి చేయాలి.
  • 16వ రోజు 8 కి. బెల్లం 8 లీ. నీటిలో కలిపి కుండను గుంతలో పెట్టి మట్టి కప్పాలి. అదే రోజు 3 లీ. ఆవుమూత్రాన్ని 200 లీ. నీటిలో కలిపి ఎకరం పొలంలోని భూమిపై పిచికారి చేయాలి.
  • 21వ రోజు 21/4 కి. ముడి ఇంగువ 21/4 లీ. నీటిలో కలిపి కుండను గుంతలో పెట్టి మట్టి కప్పాలి. 16వ రోజు గుంతలో పెట్టిన బెల్లం ద్రావణాన్ని 200 లీ. నీటిలో కలిపి ఎకరం పొలంలోని భూమిపై పిచికారి చేయాలి.
  • 26 వ రోజు 4 కి. శనగపిండి 4 లీ. నీటిలో కలిపి కుండను గుంతలో పాతిపెట్టి మట్టి కప్పాలి. 21వ రోజు గుంతలో పెట్టిన ఇంగువ ద్రావణాన్ని 200 లీ. నీటిలో కలిపి ఎకరం పొలంలోని భూమిపై పిచికారి చేయాలి.
  • 31వ రోజు ఒకటిన్నర కిలోల ఆవుపెరుగు ఒకటిన్నర లీటర్ల నీటిలో కలిపి కుండను గుంతలో పాతి పెట్టి మట్టి కప్పాలి. 26వ రోజు పాతిపెట్టిన శనగ పిండిద్రావణాన్ని 200 లీ. నీటితో కలిపి ఎకరం పొలంలోని భూమిపై పిచికారి చేయాలి.
  • 36వ రోజున 31వ రోజున కుండలో ఉంచిన ఆవు పెరుగు ద్రావణాన్ని 200 లీ. నీటిలో కలిపి ఎకరం పొలంలోని భూమిపై పిచికారి చేయాలి.
  • అప్పటికి రామ బాణం ప్రయోగం పూర్తవుతుంది. తరువాత పొలాన్ని నాగలితో దున్నుకుని పైరు పెట్టుకుంటే సేంద్రియ కర్బనం 0.5 నుండి 0.75కి పెరిగి ఉంటుంది.
Read More

మొక్కకు పోషకాలనందించే సస్యామృతం

వివిధ రకాల ఔషధ మొక్కలు, ఆవు పేడ ఆవు మూత్రంలో పులియబెట్టడం ద్వారా దీనిని తయారు చేసుకోవచ్చు.

ప్రయోజనాలు : ఇది మొక్కకు పోషకాలను అందించడమే కాకుండా కీటకాలు, తెగుళ్ళను నివారిస్తుంది.

 తయారీకి కావలసిన పదార్థాలు : ఆవు పేడ - 30-40 కి.; ఆవు మూత్రం - 5 లీ.; పాలుకారే మొక్కల (పాలకొడిశ, జిల్లేడు, జట్రోఫా, బొప్పాయి మొదలైనవి) ఆకులు - 5 కి.; ఘాటైన వాసనగల మొక్కల (వయ్యారిభామ, అత్తాకోడలు, తంగేడు తదితరాలు) ఆకులు - 5 కి.; నూనె గింజల చెక్క (వేరుశనగ, ఆముదం, కానుగ, నువ్వులు, వేప) చెక్కలో ఏదైనా - 2 కి.; బెల్లం - 1కి.; నువ్వులు, కంది లేదా పొగాకు కట్టెలు కాల్చిన  బొగ్గు లేదా పిడకబూడిద; నీరు - 100 లీ.; పై పదార్థాలన్నీ పట్టే ప్లాస్టిక్ డ్రమ్ము లేదా తొట్టి. 

తయారీ విధానం :

  • ముందుగా సేకరించిన ఆకులను తరిగి పెట్టుకోవాలి.
  • వీటిని ఆవుపేడ, మూత్రాలతో కలిపి డ్రమ్ములో వేసుకోవాలి.
  • దీనికి నూనె చెక్క బూడిద, బెల్లం కలపాలి.
  • డ్రమ్ములో వేసిన ఈ పదార్థాలను రోజు కలుపుతూ ఉండాలి.
  • తొట్టి లేదా డ్రమ్ము పై గోనె పట్టా కప్పి వుంచాలి.
  • వారం రోజుల్లో పూర్తిగా పులిసిపోయిన తర్వాత తయారైన ద్రావణాన్ని వడపోయాలి. ఆకులు, ఇతర పదార్థాల పిప్పి ఏదైనా మిగిలి వుంటే మొక్కలకు మల్చింగ్గా ఉపయోగించాలి.
  • తయారైన ద్రావణాన్ని ఎకరాకు 200 లీటర్లు డ్రిప్పు ద్వారా లేదా కాలువ ద్వారా పారించాలి.
  • మొక్కల పూత, కాత, గింజకట్టే దశల్లో 5 శాతం ద్రావణాన్ని పిచికారి చేయాలి.
Read More