ఆయిల్‌పామ్‌లో అంతరపంటగా పసుపు సాగు చేయండి: మంత్రి తుమ్మల
ఆయిల్ పామ్‌లో అంతర పంటగా పసుపు సాగు చేసే అవకాశాలను పరిశీలించాల్సిందిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. గురువారం సచివాలయంలో మంత్రి తుమ్మలను పసుపు బోర్డ్ సెక్రెటరీ శ్రీమతి ఎన్. భవానీ శ్రీ కలిసి కొత్తగా ఏర్పాటైన పసుపు బోర్డు గత ఆరు నెలలుగా చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. కోత అనంతరం ఉపయోగపడే పసుపు ఉడకబెట్టే యంత్రాలు, పాలిషర్స్, గ్రైండర్లు వంటి వాటిని రైతులకు సరఫరా చేస్తున్నట్లు సెక్రటరీ తెలిపారు. అలాగే పసుపు రైతు ఉత్పత్తి సంఘాలను గుర్తించి వారికి 23 లక్షల వరకు రాయితీ కల్పించి, కోత అనంతరం పసుపులో అవసరమయ్యే పనిముట్లను, యంత్రాలను అందిస్తున్నట్లు తెలిపారు. రైతులకు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు, ఆర్గానిక్ సర్టిఫికేషన్‌లో తోడ్పాటునందిస్తున్నట్లు కూడా తెలిపారు. ప్రస్తుతం పసుపును పౌడర్ రూపంలో ఐటిసి, పతంజలి వంటి వివిధ కంపెనీలు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. తూర్పు, మధ్యమ దేశాలకు సరఫరా చేసే ఒక ప్రముఖ కంపెనీ 10 ఎకరాల స్థలంలో ప్రాసెసింగ్ యూనిట్ కూడా నిజామాబాద్‌లో స్థాపించడానికి ముందుకు వచ్చిందని మంత్రికి తెలియచేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ కుర్క్ మిన్ పసుపులో అధికంగా వచ్చే నూతన రకాల సాగు, పురుగు, కలుపు రకాల వినియోగం తగ్గించడం ద్వారా మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం, ఆయిల్ పామ్‌లో అంతర పంటగా పసుపు సాగు చేసే అవకాశాల్ని పరిశీలించాల్సిందిగా సూచించారు. పసుపు ఉత్పత్తులకు ఫార్మా మరియు ఆయుర్వేద రంగంలో ఉన్న అవసరాల దృష్ట్యా బోర్డు ద్వారా మార్కెటింగ్ లింకేజీలు కల్పించాలని కోరారు. ఆదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి సంపూర్ణ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలియచేశారు.

