వంద శాతం రాయితీపై మొక్కల పంపిణీ ప్రత్యేక దృష్టి సారించిన ఆంధ్రప్రదేశ్‌ సర్కారు తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఆయిల్‌పామ్‌ సాగుకు మంచి రోజులు వచ్చాయి. గతంలో కర్షకులకు ఎటువంటి రాయితీలు ఇవ్వకపోవడంతో రైతులు ఈ సాగు చేపట్టేందుకు పెద్దగా ఉత్సాహం చూపలేదు. ఇప్పుడు వంద శాతం రాయితీతో ఉద్యాన శాఖ ద్వారా ఈ మొక్కలు పంపిణీ చేస్తోంది. నీటి వసతి ఉన్న మెట్ట రైతులు ఈ పంట సాగుచేసుకుంటే లాభాలు పొందొచ్చని ఉద్యాన అధికారులు సూచిస్తున్నారు. ఎన్టీఆర్‌ జిల్లాలో ఇప్పటికే ఆయిల్‌పామ్‌ 4 వేల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ఈ ఏడాది పూర్తి ఉచితంగా రైతులకు మొక్కలు ఇచ్చి 2600 హెక్టార్లలో పంట సాగు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా ఇంతవరకు 1253 ఎకరాల్లో సాగుకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి కలెక్టర్‌ అనుమతి తీసుకుంటున్నారు. ఒక్కో ఎకరానికి 57 మొక్కలు నాటిస్తారు. వీటి కొనుగోలుకు ఎకరానికి రూ. 10,500 ఇస్తారు. నాలుగేళ్ల పాటు ఎరువుల కోసం ఏటా రూ.2100, అంతర పాటల సాగుకు రూ.2100 వంతున ఇస్తారు. మొదటి ఏడాది మొక్కలు, ఎరువులకు రూ.15,200 మంజూరు చేస్తారు. ఒక రైతు ఎన్ని ఎకరాల్లో అయినా సాగుచేసుకునే వీలుంది. మొదటి మూడు సంవత్సరాలు తోటలను పెంచాలి. నాలుగో ఏడాది నుంచి ఆయిల్‌పామ్‌ గెలలు చేతికొస్తాయి. నాలుగో ఏడాది ఎకరానికి రెండు టన్నులు దిగుబడి వస్తుంది. ఆరో ఏడాది నుంచి సంవత్సరానికి పది టన్నుల దిగుబడి వస్తుంది. ఇలా 30 ఏళ్ల వరకు ఈ పంట దిగుబడి పొందొచ్చు.

*మార్కెట్‌ సదుపాయం*

మార్కెట్లో ఉన్న ఆయిల్‌పామ్‌ ధర రూ. 18,700 ఉంది. వంట నూనెల స్వయం సమృద్ధికి ఈ పంట సాగును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. చందర్లపాడు, నందిగామ, మైలవరం, తిరువూరు, విస్సన్నపేట తదితర మండలాల్లో ఈ పంటను రైతులు సాగు చేస్తున్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు వద్ద పతంజలి ఫుడ్స్‌ సంస్థ ప్రభుత్వ మద్దతు ధరకు రైతుల నుంచి ఆయిల్‌పామ్‌ గెలలు కొనుగోలు చేస్తోంది. రైతులకు ఇలా మార్కెట్‌ సదుపాయం ఉంది.*ఆర్‌ఎస్‌కేల్లో దరఖాస్తులు స్వీకరణ* ఈ సాగుపై ఆసక్తి ఉన్న రైతులు గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో(ఆర్‌ఎస్‌కే) దరఖాస్తులు ఇవ్వాలి. పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌ కార్డు, బ్యాంకు పాసుపుస్తకం జిరాక్స్‌లను వీఏఏలకు అందజేయాలి. రైతులు సమీపంలోని ఆర్‌ఎస్‌ కేలు, ఉద్యానశాఖ అధికారులను సంప్రదించాలి.

*నీటివసతి ఉన్న కర్షకులకు లాభసాటి*

నీటి వసతి ఉన్న మెట్ట రైతులకు ఈ సాగు లాభసాటిగా ఉంటుంది. ప్రభుత్వం రైతులకు ఉచితంగా మొక్కలు ఇస్తుంది. నాలుగేళ్ల పాటు ఎరువులు, అంతర పంటల సాగుకు నిధులు ఇస్తుంది. ఆసక్తి ఉన్న రైతులు ఈ పంట సాగు చేస్తే ఏటా ఎకరానికి రూ. లక్ష ఆదాయం పొందొచ్చు.- పి. బాలాజీకుమార్‌, ఎన్టీఆర్‌ జిల్లా ఉద్యాన అధికారి