ఆంధ్రరాష్ట్రంలోని వ్యవసాయరంగ పరిస్థితులను కేంద్రమంత్రికి వివరించిన చంద్రబాబు నాయుడు
2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలకు కలిపి ప్రధాన మంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (పీఎంఆర్కేవీవై), పీడీఎంసీ పథకాల కింద రాష్ట్రానికి రూ. 695 కోట్లు ఇవ్వాలని కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. వాటర్‌షెడ్ మహోత్సవంలో పాల్గొనేందుకు గుంటూరు వచ్చిన చౌహాన్.. చంద్రబాబు ఆహ్వానం మేరకు మంగళవారం ఉండవల్లిలోని ఆయన నివాసానికి వెళ్లారు. వారిద్దరూ సుమారు గంటసేపు సమావేశమయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం పరిస్థితులు, మైనర్ ఇరిగేషన్ వంటి అంశాలపై చర్చ జరిగింది. మొంథా తుపాను వల్ల జరిగిన నష్టాన్ని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. మైనర్ ఇరిగేషన్ కింద సాగు చేసే రైతుల సంక్షేమానికి కేంద్రం సహకరించాలని సీఎం కోరారు. తోతాపురి మామిడి రైతులకు మార్కెట్ జోక్యం కింద ఇచ్చిన మద్దతు ధరలో కేంద్ర ప్రభుత్వ వాటా కింద ఇవ్వాల్సిన రూ.100 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

