తుఫాను గండం… వరి రైతులు అప్రమత్తంగా ఉండాలి
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం సోమవారం ఉదయానికి అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడింది. వాయుగుండం ప్రభావంతో బంగాళాఖాతంలో తేమ మేఘాలు ఆవరించాయి. దీంతో ఈనెల 27, 28 తేదీల్లో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల, ఉత్తరకోస్తాలో చెదురుమదురుగా వర్షాలు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. 29న కోస్తా, రాయలసీమల్లో ఎక్కువ చోట్ల వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మంగళ, బుధవారాల్లో దక్షిణ కోస్తా జిల్లాల్లో గంటకు 50 నుంచి 75 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దక్షిణ కోస్తా జిల్లాల్లో మంగళవారం తరువాత వరికోతలు నిలిపివేయాలని సూచించింది. కోసిన, నూర్చిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని కోరింది. ఉద్యాన తోటల్లో చెట్లు పడిపోకుండా బాదులతో ఊతం అందించాలని, పల్లపు పొలాల్లో నీరు నిలబడకుండా వాతులు చేసుకోవాలని సూచించింది.

