అమెరికాతో వాణిజ్య ఒప్పందాల గురించి రైతు సంఘాల నాయకులతో రాహుల్ భేటీ
రైతు సంఘాల నాయకలతో లోక్‌సభలో విపక్షనేత, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. పార్లమెంటు హౌస్ కాంప్లెక్స్‌లో ఈ భేటీ జరిగింది. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా, రైతులు, వ్యవసాయ కార్మికుల జీవనోపాధిని కాపాడటం కోసం దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టాల్సిన ఆవశ్యకతపై చర్చ జరిగినట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని రైతు సంఘాల నాయకులు వ్యతిరేకించారని, మొక్కజొన్న, సోయా, పత్తి సహా పండ్ల రైతుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని వారు ఆందోళన వ్యక్తంచేశారని తెలిపింది. ఈ సమావేశానికి అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుఖ్‌పాల్ సింగ్ ఖైరా, భారతీయ కిసాన్ మజ్దూర్ నేత అశోక్ బల్దారా, బీకేయూ క్రాంతికారి నాయకుడు బల్దేవ్ ఎస్.జీరా, కిసాన్ మజ్దూర్ మోర్చా నేత గుర్మీత్ సహా దేశంలోని పలువురు రైతు సంఘాల నేతలు హాజరయ్యారు.

