ఖరీఫ్‌లో కరవు.. 1.06 లక్షల హెక్టార్లలో పంట నష్టంరూ. 151.77 కోట్ల సాయం అందించండికేంద్ర బృందానికి నివేదిక
ఖరీఫ్‌లో కరవు పరిస్థితుల కారణంగా 5 జిల్లాల పరిధిలో 1.06 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. కరవు కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రూ. 151.77 కోట్ల సాయం అందించాలని కోరింది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ సంయుక్త కార్యదర్శి పెరిన్‌దేవి నేతృత్వంలోని అధికారుల బృందం బుధ, గురువారాల్లో రాష్ట్రంలో పర్యటించింది. వారు అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, శ్రీసత్యసాయి, కర్నూలు జిల్లాల్లోని రైతులతో మాట్లాడి.. పంటనష్టం తీరును తెలుసుకున్నారు. అనంతరం గురువారం తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెవెన్యూశాఖ (భూములు, విపత్తుల నిర్వహణ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా వారికి కరవు పరిస్థితులపై నివేదిక ఇచ్చారు.
ఉపశమన చర్యలు చేపట్టాం
కరవు ప్రభావంతో పత్తి, జొన్న, వేరుశనగ, కంది, శనగ, మొక్కజొన్న తదితర 14 రకాల పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీరావు, విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వివరించారు. ‘రూ. 16.67 కోట్లతో 80% రాయితీపై విత్తనాలు, రూ.55.47కోట్లతో పశుగ్రాస విత్తనాలు అందించాం. 60% రాయితీపై చాప్‌కట్టర్లు ఇచ్చాం. పశువైద్యశాలలకు మందులు సరఫరా చేశాం’ అని ఆయన పేర్కొన్నారు. కరవు నష్టంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
రైతులను ఆదుకునేలా చూస్తాం
కరవు ప్రభావ ప్రాంతాల్లో రైతులతో మాట్లాడి.. వాస్తవ నష్టాన్ని తెలుసుకున్నామని పెరిన్‌దేవి చెప్పారు. ‘కేంద్రానికి త్వరితగతిన నివేదిక ఇస్తాం. పంట నష్టపోయిన రైతుల్ని ఆదుకునేలా చూస్తాం’ అని హామీ ఇచ్చారు.
కరవు జిల్లాలు : కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు
పంట నష్టం : 1.06 లక్షల హెక్టార్లు
నష్టపోయిన రైతులు : 1.44 లక్షలు
ఉత్పత్తి నష్టం : రూ.240 కోట్లు
రంగాలవారీగా కేంద్రాన్ని కోరిన సాయం
రంగం సాయం (రూ. కోట్లలో)
వ్యవసాయం (పెట్టుబడి రాయితీ) 90.63
పశుసంవర్థక శాఖ 55.47
గ్రామీణ నీటి సరఫరా 0.78
పట్టణ నీటిసరఫరా 4.89
మొత్తం 151.77


