సేంద్రియ సాగు విస్తరించాలి

తెలంగాణలో సేంద్రియ సాగు విస్తరించాలని.. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి నేల, మానవ ఆరోగ్య పరిరక్షణకు కృషి చేయాలని ఉద్యాన శాస్త్రవేత్తలు సూచించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో అలబామ విశ్వవిద్యాలయం, ఏషియన్‌ పీజీపీఆర్‌ సొసైటీల ఆధ్వర్యంలో ‘మొక్కల ఆరోగ్యం – ఆహార భద్రత’పై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ దండా రాజిరెడ్డి మాట్లాడుతూ సేంద్రియ సాగుకు ఆధునికతను జోడిస్తేనే సురక్షిత ఆహారం, మానవ ఆరోగ్యం సాధ్యమన్నారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్టుగా ఉద్యాన పంటల ఉత్పత్తులను పెంచేందుకు సేంద్రియ పద్దతులను పాటించాలని, ఆధునిక పరిశోధన ఫలితాలను మేళవించి సుస్థిర వ్యవసాయ పద్ధతుల వైపు మరల్చాలని సూచించారు. అలబామ వర్సిటీ ప్రొఫెసర్‌, ఏషియన్‌ పీజీపీఆర్‌ సొసైటీ చైర్మన్‌ ఎంఎస్‌ రెడ్డి మాట్లాడుతూ సురక్షిత ఆహారానికి అనుగుణంగా పరిశోధనలు ముమ్మరం కావాలని చెప్పారు. ఉద్యాన వర్సిటీ అంతర్జాతీయ కార్యక్రమాల డైరెక్టర్‌ శ్రీనివాసన్‌, రిజిస్ట్రార్‌ భగవాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More

మూడోవారంలో ప్రారంభంకానున్న మామిడి ఎగుమతులు

నున్న మార్కెట్లో షాపులు తెరిచేందుకు సిద్ధం
పలు రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు సన్నాహాలు

మామిడి సీజన్‌ వచ్చేస్తోంది. ఆసియాలోనే అతిపెద్ద మామిడి మార్కెట్‌లో ఒకటైన నున్న మ్యాంగో మార్కెట్‌లో ఈనెల మూడో వారంలో షాపులు తెరిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మార్కెట్లో మొత్తం 40 దుకాణాలు ఉన్నాయి. ఇప్పటికే మామిడి కాపునకు రావడంతో వ్యాపారులు దుకాణాలను సిద్ధం చేసుకునేందుకు సమాయత్తమవుతున్నారు. రైతుల నుంచి మామిడి కొనుగోలు చేసి, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు సిద్ధమవుతున్నారు. 

కరోనా నుంచి తగ్గిన వ్యాపారం
నున్న మ్యాంగో మార్కెట్లో గతంలో మూడు పూలు ఆరు కాయలుగా ఉన్న మామిడి ఎగుమతులు కరోనా నుంచి తగ్గుముఖం పట్టాయి. ఓపక్క వాతావరణం అనుకూలించక మామిడి దిగుబడులు తగ్గడం వలన సతమతమైన వ్యాపారులు కరోనా కాలంలో మరింతగా దెబ్బతిన్నారు. ఈ ఏడాదైనా దిగుబడి పెరిగి వ్యాపారం అభివృద్ధి చెందుతుందనే ఆశాభావంతో ఉన్నారు. ఇక్కడి నుంచి దేశంలోని పలు రాష్ట్రాలకు మామిడి కాయలు ఎగుమతి చేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ, పంజాబ్‌, హర్యానా, మహారాష్ట్ర, రాజస్థాన్‌, గుజరాత్‌, కర్ణాటక తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేయాలని చూస్తున్నారు. బంగినపల్లి, చెరుకు రసాలు, నీలాలు, కోలాపూరీ, చిన్న రసాలు, పెద్ద రసాలు, సుందరి తదితర రకాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి.

లోకల్‌ మండీలతో కష్టాలు
నున్న మ్యాంగో మార్కెట్‌కు ప్రధానంగా నూజివీడు, విస్సన్నపేట, ఆగిరిపల్లి, తాడేపల్లిగూడెం, ఏలూరు, ద్వారకా తిరుమలతో పాటు తుని, అన్నవరం ప్రాంతాల నుంచి రైతులు మామిడి పంటను దిగుమతి చేస్తుంటారు. అయితే, ఆయా ప్రాంతాల్లో కొంతకాలంగా లోకల్‌ మండీ వ్యాపారులతో దిగుమతులు కొంతమేర తగ్గాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కొనుగోలుదారులతో లోకల్‌ మండీలు, పెద్ద రైతులు సత్సంబంధాలు కలిగి ఉండటంతో పలువురు ఇతర రాష్ట్ర కొనుగోలుదారులు నేరుగా తోటల వద్దకు వెళ్లి ఎగుమతులు చేసుకుంటున్నారు.

Read More

చిరుధాన్యాల సాగుకు సవాళ్లేమిటి?

వ్యవసాయ విశ్వవిద్యాయలం అధ్యయనం

పోషకాహారాలైన చిరుధాన్యాల సాగు పెంపుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. రాష్ట్రంలో ఏటా 2.10 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతుండగా.. ఇందులో 6 లక్షల ఎకరాల్లోనే (3%) చిరుధాన్యాలు పండుతున్నాయి. ఉత్పత్తులు 5.3 లక్షల టన్నుల వరకే ఉంటున్నాయి. ఈ క్రమంలో చిరుధాన్యాల సాగు, వినియోగం పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆదేశాలు ఇచ్చింది. దీంతో వర్సిటీ ఆహార, పోషకాల శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెస్సీ, బీఎస్సీ వ్యవసాయ, హోంసైన్స్‌ విద్యార్థులు సర్వే చేస్తున్నారు. ఈ నెలాఖరుకు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.

సమగ్ర సమాచార సేకరణ
ప్రస్తుతం చిరుధాన్యాలు సాగు చేస్తున్న రైతులు, వారి స్థితిగతులు, సాగు విధానాలు, పంటలను ఆశిస్తున్న తెగుళ్లు, దిగుబడులు, మార్కెటింగ్‌, మద్దతు ధరలు, లాభనష్టాలు, రైతులు ఆశిస్తున్న సహకారం తదితర అంశాలపై సర్వే చేస్తున్నారు. రైతు ఉత్పత్తి సంఘాలు, ప్రభుత్వ శాఖలు, పారిశ్రామిక వేత్తలు, అంకుర వ్యవస్థాపకుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఇతర పంటలను సాగు చేస్తున్న రైతులు చిరుధాన్యాల వైపు ఎందుకు రావడం లేదు? నాబార్డు, రైతు ఉత్పత్తి సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు వారిలో అవగాహన కోసం ఏమైనా చర్యలు చేపడుతున్నాయా అనే కోణంలోనూ సర్వే సాగుతోంది. భారత చిరుధాన్యాల సంస్థ ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన కిసాన్‌ మేళాకు హాజరైన వివిధ రాష్ట్రాల రైతులు, అంకుర సంస్థల వ్యవస్థాపకులు, రైతు ఉత్పత్తి సంఘాల నుంచి వ్యవసాయ, హోంసైన్స్‌ కళాశాల విద్యార్థినులు సమాచారం తీసుకున్నారు.

Read More

జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం జాతీయ సంస్థ నార్మ్‌తో అవగాహన ఒప్పందం

– వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్య

ఇటీవల ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నెలకొల్పిన మానవ వనరుల అభివృద్ధి కేంద్రానికి సాంకేతిక సహకారం అందించడం కోసం భారత వ్యవసాయ పరిశోధన మండలి సంస్థ అయిన నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌ (నార్మ్‌) తో అవగాహన ఒప్పందంపై ఆ సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌. సి. అగర్వాల్‌ మరియు ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జి.ఇ.సిహెచ్‌. విద్యాసాగర్‌ విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్‌ అల్దాస్‌ జానయ్య సమక్షంలో సంతకాలు చేశారు. ఈ అవగాహన ఒప్పందం ప్రకారం వచ్చే మూడు సంవత్సరాలలో వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు / సిబ్బందికి నూతన అంశాలు, వ్యక్తిత్వ వికాసం తదితర అంశాలపై నార్మ్‌ సహకారంతో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్య తెలియజేశారు. ఈ సందర్భంగా నార్మ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌. సి. అగర్వాల్‌ మాట్లాడుతూ వ్యవసాయ విశ్వవిద్యాలయ అభివృద్ధికి తాము ఎప్పుడూ కట్టుబడి ఉన్నామని, అవగాహన ఒప్పందం చేసుకొనుటకు ముందుకు వచ్చిన విశ్వవిద్యాలయ ఉపకులపతిని అభినందించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, మానసిక వికాసం అంశాలు మరియు సిబ్బందికి నిర్వహించే సాంకేతిక, నైపుణ్యాభివృద్ధి మరియు పరిపాలన తదితర శిక్షణ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ మానవ అభివృద్ధి కేంద్రానికి తమ సంస్థ నుండి పూర్తి సహకారం అందిస్తామని అగర్వాల్‌ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు డాక్టర్‌ బలరాం, డాక్టర్‌ ఝాన్సీరాణి మరియు డాక్టర్‌ వి. రాములు నార్మ్‌ అధికారులు పాల్గొన్నారు

Read More

రబీలో రారాజు శనగ!

  • చింతపల్లి పరిశోధన స్థానం ప్రయోగాత్మక సాగుతో గుర్తింపు
  • ఒకే మొక్కకు 330 కాయలు

రబీలో నీటి వసతి లేని ప్రాంతాల్లోనూ దేశవాళీ శనగ (కొమ్ముశనగ) మంచి దిగుబడి ఇస్తోందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సేద్య విభాగం సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ బాలహుస్సేన్‌ రెడ్డి మంగళవారం తెలిపారు. ”రబీలో నీరులేక గిరిజన ప్రాంతాల్లో పొలాలను రైతులు ఖాళీగా వదిలేస్తారు. ఆ కాలంలో కేవలం పొగమంచుతో శనగ పండే అవకాశాలున్నట్లు గుర్తించాం. ప్రయోగాత్మకంగా పరిశోధన స్థానంలో, గూడెంకొత్తవీధి మండలం దామనాపల్లిలో కొందరు రైతుల పొలాల్లో దేశవాళీ (నంద్యాల బెంగాల్‌ గ్రామ్‌) విత్తనాలు వేసి, సేంద్రియంగా సాగు చేయించాం. సాధారణంగా ఒక మొక్క 100 నుంచి 120 కాయలు కాస్తుంది. తమ క్షేత్రంలో సాగుచేసిన మొక్క ఏకంగా 330 కాయలు కాసింది. తక్కువ పెట్టుబడి, నీటి వసతి అవసరం లేని పంటగా శనగను గుర్తించాం. రైతులూ సాగుచేసేలా ప్రోత్సహిస్తాం” అని బాలహుస్సేన్‌రెడ్డి తెలిపారు.

Read More

రైతులు పారిశ్రామికవేత్తలుగా మారాలి జాతీయ చిరుధాన్యాల సదస్సులో ఐఐఎంఆర్‌ డైరెక్టర్‌

రైతులు పారిశ్రామికవేత్తలుగా మారాలని, వారు పండించిన చిరుధాన్యాల ఉత్పత్తులను శుద్ధి చేసుకొని వ్యాపారాలు చేసుకోవాలని, ఎగుమతులను చేపట్టాలని భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ సంచాలకురాలు తారా సత్యవతి సూచించారు. రైతులు సొంతంగా మార్కెటింగ్‌ చేసుకోగలిగితే మధ్యవర్తుల పాత్రను నిరోధించవచ్చని, వినియోగదారులకు చిరుధాన్యాలను విస్తృతంగా అందుబాటులోకి తేవచ్చన్నారు. చిరుధాన్యాల ఉత్పత్తి, విలువ-జోడింపు సాంకేతికతలపై వ్యవసాయ వర్సిటీలోని ఆడిటోరియంలో మంగళవారం జరిగిన సదస్సులో ఆమె ప్రసంగించారు. ”చిరుధాన్యాల సాగు అన్నదాతలకు అన్నివిధాలా లాభదాయకం. సులభంగా విత్తనాలు లభిస్తాయి. తక్కువ నీటి వినియోగం, చీడపీడలు, ఎరువుల శ్రమ లేకుండానే పంటలు పండుతాయి. ఐఐఎంఆర్‌ ద్వారా అధిక దిగుబడినిచ్చే చిరుధాన్యాల విత్తనాలను విక్రయిస్తున్నాం. పంట కోత, నూర్పిడి, శుభ్రపరచడం మొదలైన వాటి కోసం పరికరాలన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇవి రైతులకు సాగు ఖర్చును, శ్రమను తగ్గిస్తాయి. చిరుధాన్యాల పరిశ్రమలతో రైతులు అనుసంధానమయ్యే అవకాశం కల్పిస్తున్నాం” అని తారాసత్యవతి వివరించారు. నెహ్రూ జూపార్కు డైరెక్టర్‌ డాక్టర్‌ సునీల్‌ హిరేమఠ్‌ మాట్లాడుతూ… జూపార్కులో జంతువుల దాణా, పశు గ్రాసం కోసం చిరుధాన్యాల విత్తనాలను ఉపయోగిస్తున్నామని, వాటి ద్వారా జంతువుల ఆరోగ్యం మెరుగుపడిందన్నారు. సదస్సులో ఒడిశా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన శాస్త్రవేత్తలు ఎస్కే స్వైన్‌, మహేశ్‌ పాటిల్‌ తదిత రులు పాల్గొని వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. అనంతరం చిరుధాన్యాల సాగులో ఉత్తమంగా నిలుస్తున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలకు చెందిన రైతులకు తారాసత్యవతి, ఇతర ప్రముఖులు పురస్కారాలను అందజేశారు.

Read More

చిరుధాన్యాల రవాణాకు 50% కేంద్రసాయం కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ సహాయమంత్రి భగీరథ్‌ చౌదరి

చిరుధాన్యాల రైతులకు పంట ఉత్పత్తుల రవాణాకు అయ్యే ఖర్చులో 50 శాతం భరించేందుకు త్వరలోనే దేశవ్యాప్తంగా కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నామని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ సహాయమంత్రి భగీరధ్‌ చౌదరి తెలిపారు. దీనివల్ల రైతులకు లబ్ధి చేకూరడమే గాక వినియోగదారులకు చౌకధరలకు చిరుధాన్యాలు లభ్యమవుతాయన్నారు. ఎరువుల సబ్సిడీని భవిష్యత్‌లో నేరుగా రైతుల ఖాతాకు బదిలీ చేస్తామని, కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా రుణపరిమితిని రూ.5 లక్షలకు పెంచుతామని చెప్పారు. హైదరాబాద్‌లోని భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ(ఐఐఎంఆర్‌) సోమవారం వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో నిర్వహించిన కిసాన్‌మేళా సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ”చిరుధాన్యాల సాగు ఏటేటా విస్తరిస్తోంది. రైతులకు దక్కే ధరలు, వ్యాపారులు వినియోగదారులకు అమ్మే ధరల్లో అంతరం ఉంటోంది. దీనిని తగ్గించేందుకు రైతుకు అయ్యే రవాణా ఖర్చులో 50 శాతం కేంద్రం చెల్లిస్తుంది. చిరుధాన్యాల సాగును లాభదాయకంగా మార్చడానికి మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడంలో కేవీకేలు, రైతు ఉత్పత్తి సంఘాలు కీలకపాత్ర పోషించాలి” అని సూచించారు. చిరుధాన్యాలపై రైతుల్లో చైతన్యం కలిగించేందుకు ఐఐఎంఆర్‌ విశేష కృషి చేస్తోందని సంస్థ డైరెక్టర్‌ తారా సత్యవతి తెలిపారు. వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల ఉప కులపతులు జానయ్య, రాజిరెడ్డి.., ఎన్‌ఐఆర్డీ డైరెక్టర్‌ జనరల్‌ నరేంద్రకుమార్‌లు మాట్లాడుతూ.. చిరుధాన్యాల సాగును ఉద్యమస్థాయిలో విస్తరించాలని, మద్దతు ధరలను ప్రకటించడంతో పాటు రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు. అపెడా రీజినల్‌ డైరెక్టర్‌ ఆర్పీనాయుడు, అతారి డైరెక్టర్‌ మీరా, ఐఐవోఆర్‌ డైరెక్టర్‌ మాథుర్‌, నిమ్స్‌మే డీజీ గ్లోరీ స్వరూప పాల్గొన్నారు. ఐఐఎంఆర్‌కు చెందిన 30 ప్రచురణలను మంత్రి ఆవిష్కరించారు. ఉత్తమ రైతులకు పురస్కారాలను అందించారు. అనంతరం చిరుధాన్యాల కిసాన్‌మేళా ప్రదర్శనను భగీరథ్‌ చౌదరి ప్రారంభించారు.

Read More

వచ్చే సీజన్‌ కల్లా వ్యవసాయ కనెక్షన్లన్నీ ఇస్తాంవిద్యుత్తుశాఖ మంత్రి గొట్టిపాటి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా 69,975 వ్యవసాయ కనెక్షన్ల కోసం రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పటికే40,336 కనెక్షన్లు మంజూరు చేశాం. 22,709 కనెక్షన్లను వినియోగం లోకి తీసుకొచ్చాం. వచ్చే వ్యవసాయ సీజన్‌ కల్లా మిగతావన్నీ ఇస్తాం’ అని విద్యుత్తుశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు. సోమవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ‘కేంద్ర ప్రభుత్వ పీఎం కుసుమ్‌ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకుని కేంద్రాన్ని సంప్రదించి దీన్ని అమల్లోకి తెచ్చారు. రాష్ట్రానికి 4.50 లక్షల వ్యవసాయ కనెక్షన్లు అవసరం. ఇప్పటికే కేంద్రం లక్ష కనెక్షన్లు మంజూరు చేసింది. మరో 2 లక్షల కనెక్షన్లకు టెండర్లు పిలుచుకునేందుకు అనుమతిని ఇచ్చింది. పీఎం కుసుమ్‌ ద్వారా సోలార్‌ విద్యుత్తును తెచ్చి రాబోయే రోజుల్లో పగటిపూటనే నిరంతరాయంగా 9 గంటల విద్యుత్తును అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని మంత్రి వివరించారు.

*70 కొత్త సబ్‌ స్టేషన్లు*

‘రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 70 సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచాం. ఎసైన్డ్‌ భూముల్లో దొంగ కనెక్షన్లు ఏర్పాటు చేస్తే రద్దు చేస్తాం. చోరీల నుంచి కాపాడేందుకు కాపర్‌తో కాకుండా ట్రాన్స్‌ఫార్మర్లను అల్యూమినియంతో తయారు చేయిస్తున్నాం’ అని రవికుమార్‌ వివరించారు.

Read More

హోలీ వేడుకలకు ఆవుపేడతో గులాల్‌

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని సహారన్‌పుర్‌లోగల ‘శ్రీ శాకంబరి కన్హా ఉపవన్‌ గోశాల’లో హోలీ వేడుకల కోసం ఆవుపేడతో గులాల్‌ తయారుచేశారు. దీని వాడకం వల్ల ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవని చెబుతున్న నిర్వాహకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు పర్యావరణ హితమైన ఈ గులాల్‌ను పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ సంజయ్‌ చౌహాన్‌ పర్యవేక్షణలో ప్రకృతి సిద్ధంగా రూపొందిన ఈ గులాల్‌ సింథటిక్‌ రంగులతో కలిగే హాని బారిన పడకుండా చక్కటి ప్రత్యామ్నాయమని అంటున్నారు. మున్సిపల్‌ కార్పొరేషను ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ గోశాల ప్రయోగాలకు ఐఎస్‌వో ధ్రువపత్రం కూడా ఉందని, గతంలో పర్యావరణహిత పెయింటు కూడా తయారుచేసినట్లు సంజయ్‌ చౌహాన్‌ తెలిపారు. 4 రంగుల్లో రూపొందించిన గులాల్‌ ప్యాకెట్లను అన్‌లైనులో అందుబాటులో ఉంచినట్లు గోశాల చీఫ్‌ ఇంజినీరు బీకే సింగ్‌ వెల్లడించారు.

Read More

ప్రకృతి సాగు.. ఆరోగ్యానికెంతో బాగు

అన్నదాతలకు అవగాహన కల్పించిన పాలేకర్‌

సాగులో రసాయనాల వాడకం వల్ల పంట ఉత్పత్తులు విషపూరితంగా మారుతున్నాయని ప్రకృతి వ్యవసాయ నిపుణులు సుభాష్‌ పాలేకర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వాటి వల్ల ప్రజల్లో మధుమేహం, క్యాన్సర్‌, గుండెజబ్బుల ముప్పు పెరుగుతోందన్నారు. సహజ పద్ధతుల్లో పండించిన ఆహార ఉత్పత్తులు ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయని సూచించారు. మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లా పడ్లి గ్రామంలో సహజ వ్యవసాయం ద్వారా మంచి దిగుబడి సాధిస్తున్న రైతు ధ్యానేశ్వర్‌ రేవ్‌గడేకు చెందిన పొలంలో పాలేకర్‌ నేతృత్వంలో ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు వెయ్యి మంది అన్నదాతలు హాజరయ్యారు. వీరిలో ఏపీ, తెలంగాణకు చెందిన సుమారు 700 మంది రైతులు ఉన్నారు. రసాయనాలు వినియోగించే ఏ వ్యవసాయ విధానమైనా ఆరోగ్యానికి చేటు చేసేదేనని ఈ సందర్భంగా పాలేకర్‌ పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులకు ప్రకృతి వ్యవసాయం ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. ధ్యానేశ్వర్‌ తన మూడెకరాల పొలంలో అయిదు రకాల అరటి, 20 రకాల కూరగాయలు, స్ట్రాబెర్రీలు, దోసకాయలు, పుచ్చకాయలు పండిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారని పాలేకర్‌ వివరించారు. సాధారణంగా స్ట్రాబెర్రీలు శీతల వాతావరణంలో పెరుగుతాయని, అయితే 38 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే నాసిక్‌లోనూ ప్రకృతి వ్యవసాయం ద్వారా వాటిని పండించడం అభినందనీయమన్నారు. ముంగసరే గ్రామానికి చెందిన రైతు హితేశ్‌ పటేల్‌ పొలాన్ని కూడా అన్నదాతల బృందం సందర్శించింది.

Read More