అతి భారీ వర్షాలు కురిసే రోజులు పెరుగుతున్నాయ్‌

ఈ ఏడాది నైరుతి రుతుపవనాల నాలుగు నెలల సీజన్‌లో అనేక అసాధారణ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈసీజన్‌లో 108 శాతం వర్షపాతం నమోదు అయ్యింది. సీజన్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (24 గంటల వ్యవధిలో 11.5 నుంచి 20.45 సెం.మీ.) కురిసిన సందర్భాలు 2,632, అత్యంత భారీ వర్షాలు, కుంభవృష్టి (20.45 సెం.మీ. కంటే ఎక్కువ) కురిసిన సందర్భాలు 473 వరకూ ఉన్నాయి. గత ఐదేళ్ళతో పోలిస్తే ఈ సంఖ్య క్రమేపి పెరుగుతోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు జులై, ఆగస్టు నెలల్లో కురుస్తున్నాయి. గడచిన ఐదేళ్ళుగా పరిశీలిస్తే పశ్చిమ తీరం, ఈశాన్య తూర్పు, ఉత్తర భారతంలో వర్షాల తీవ్రత పెరుగుతున్నట్లు వాతావరణ శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది కేరళ నుంచి గుజరాత్‌ వరకు పశ్చిమ తీరం, తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ఒడిస్సా, బీహార్‌, పశ్చిమబెంగాల్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, అసోం, మేఘాలయ వంటి చోట్ల వర్ష బీభత్సం కనిపించింది. దానికి వాతావరణంలో మార్పు ఒక్కటే కారణమని చెప్పలేమని, అక్కడ స్థానిక పరిస్థితులు, పట్టణీకరణ, భారీ ఎత్తున నిర్మాణాలు, పరిశ్రమలు, వాహన కాలుష్యం వంటివి కూడా కారణాలుగా చెప్పవచ్చని ఆంధ్ర విశ్వవిద్యాలయం వాతావరణ, సముద్ర అధ్యయన విభాగాధిపతి ఆచార్య సునీత అన్నారు. అయితే వర్షాల తీవ్రత పెరగడంపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని కూడా ఆమె చెప్పారు.

Read More

రూ. 17,043 కు పెరిగిన పామాయిల్ గెలల ధర

పామాయిల్ రైతులకు అధిక ధరలను అందించి, రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును లాభసాటిగా చేసి కొత్త రైతులను ప్రోత్సహించాలనే ఉద్ధేశ్యంతో, ముడిపామ్ ఆయిల్ పై దిగుమతి సుంకాన్ని తిరిగి విధించి దేశీయ పామ్ ఆయిల్ రైతులను ఆదుకొనేవిధంగా చర్యలను తీసుకోవాలని ఇటీవల తెలంగాణా వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ గారిని కోరిన విషయం తెలిసిందే.
ఇందుకనుగుణంగా, కేంద్రప్రభుత్వం ఇటీవల ముడి పామాయిల్ పై దిగుమతి సుంకాన్ని 5.5 % నుండి 27.5 % కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనివలన ముడిపామాయిల్ గెలల ధర రూ. 14,392 నుండి అమాంతం రూ. 2651 పెరిగి ప్రస్తుతం రూ. 17,043 చేరుకుంది. పెరిగిన ధరలు ఈ నెల నుంచే అమలులోకి రానున్నాయి. దీనివలన రైతులకు ఈ నెలలో అదనంగా రూ. 12 కోట్లు లబ్ధి చేకూరనుంది.
గతంలో ముడిపామ్ ఆయిల్ దిగుమతిపై సుంకం ఎత్తివేయడం వలన ఆయిల్ పామ్ గెలల ధర తగ్గి రైతులు నిరాశ పడడమే కాకుండా, కొత్తగా ఆయిల్ పామ్ వైపు సాగు వేయాలనుకున్న రైతులపై ప్రతికూల ప్రభావం చూపించిందని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 44,444 ఎకరాల పామ్ ఆయిల్ తోటల నుండి సాలీన 2.80 లక్షల టన్నుల ఆయిల్ పామ్ గెలల దిగుబడి రావడం జరుగుతుంది.. ఈ ధరల పెరుగుదల వలన 9,366 మంది ఆయిల్ పామ్ రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు.
పామ్ ఆయిల్ దిగుమతిపై భారత ప్రభుత్వానికి సంవత్సరానికి 80 వేల కోట్ల రూపాయల విదేశిమారక ద్రవ్యం ఖర్చవుతుందని, దిగుమతి సుంకాలు విధించడం వలన దేశంలోని పామ్ ఆయిల్ రైతులు, ముఖ్యంగా తెలంగాణ పామ్ ఆయిల్ రైతులు ప్రయోజనం పొందుతారని, అంతేకాకుండా గెలల ధరల పెరుగుదల వలన నూతనంగా రైతులు పామ్ ఆయిల్ వైపు మొగ్గు చూపే అవకాశం ఏర్పడనుందని మంత్రివర్యులు పేర్కొన్నారు.


తెలంగాణ ప్రభుత్వం (31) జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరణ చేపట్టేందుకు (14) కంపెనీలకు అనుమతులివ్వడం జరిగిందని, ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో సుమారు 2.23 లక్షల ఎకరాలను ఆయిల్ పామ్ సాగు కిందకు తీసుకురావడమైందన్నారు.
పెరిగిన ధరల నేపథ్యంలో రాష్ట్రంలో చాలా మంది రైతులు పామాయిల్ సాగు వైపు చూసే అవకాశం ఉందని, కావునా ఆయిల్ పాం కంపెనీలు ఇందుకోసం సన్నద్ధం కావాలని మంత్రిగారు కోరారు. పామ్ ఆయిల్ సాగు చేయాలనుకునే రైతుల కోసం పామాయిల్ మొక్కలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
పామాయిల్ రైతుల సంక్షేమం, ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎళ్లవేలలా కృషి చేస్తుందని, ఈ సందర్భంగా మంత్రివర్యులు పేర్కొన్నారు.

Read More

కేంద్రప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్‌ యోజనకు 20 వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తుంది

ప్రధాన మంత్రి కిసాన్‌ యోజన పథకం కింద ఈనెల 5వ తారీఖున రైతుల బ్యాంకు ఖాతాలో రూ. 2000/-లు జమ కానున్నాయి. దేశంలోని 9.5 కోట్ల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ. 2000/-ల చొప్పున బదిలీ చేస్తారు. ఇందుకుగాను కేంద్ర ప్రభుత్వం 20 వేల కోట్ల రూపాయలు వెచ్చించనుంది. ఇందుకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్రమోడి మహారాష్ట్రలోని వాషిమ్‌ నుండి అక్టోబర్‌ 5న రైతుల ఖాతాలకు బదిలీ చేస్తారు. కొత్తగా ఈ పథకంలోకి అర్హత పొందాలనుకునే రైతులు అక్టోబరు 5 లోపు బ్యాంకు ఖాతా యొక్క లి-దిగిబీ ని పూర్తి చేయడం తప్పనిసరి. లి-దిగిబీ తో పాటు పి.యం. కిసాన్‌ లబ్దిదారుడు భూమి ధృవీకరణను పొందడం కూడా అవసరం. రైతుల బ్యాంకు ఖాతాను ఆధార్‌ కార్డుతో అనుసంధానించడం కూడా చాలా ముఖ్యం.

Read More

రైతులకు దసరా కానుక ప్రకటించిన మోదీ

రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దసరా కానుకగా ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన కింద అక్టోబరు 5వ తేదీన నిధులను విడుదల చేయబోతుంది. అర్హులైన రైతులందరికి వారివారి ఖాతాలలోకి డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్సఫర్‌ (డిబిటి) రూపంలో దీనిని కేంద్రప్రభుత్వం జమ చేయనుంది. ఈ విధానంలో లబ్దిదారులకు పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధులను జమ చేయడం వల్ల ఏలాంటి జాప్యం లేకుండా తక్షణమే ఆర్థికంగా ఆదుకున్నట్లు అవుతుంది. రైతుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అయిన వెంటనే రిజిస్టర్డ్‌ ఫోన్‌ నంబరుకు మెసేజ్‌ అందుతుంది.

Read More

ప్రపంచ మొక్కల పరిశోధకుల జాబితాలో ఐకార్‌ శాస్త్రవేత్త జూకంటి అరవింద కుమార్‌ ఎంపిక

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్‌) శాస్త్రవేత్త జూకంటి అరవింద్‌కుమార్‌ ప్రపంచ మొక్కల జీవ, వృక్ష శాస్త్రం పరిశోధకుల్లో స్థానం సంపాదించారు. ప్రపంచ జాబితాలో దేశంలోని ఐకార్‌ నుంచి 22 మందికి అవకాశం దక్కగా అందులో అరవింద్‌కుమార్‌ ఒకరు. అమెరికాలోని స్టాన్‌ఫర్డ్‌ వర్సిటీ వ్యవసాయ విభాగాధపతి జాన్‌ పీఏ అయోడినిస్‌ నేతృత్వంలో ఈ పరిశోధనలు సాగాయి. 2023-24లో చేసిన పలు అధ్యయనాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. నారాయణఖేడ్‌కు చెందిన అరవింద్‌కుమార్‌ 2012లో ఐకార్‌లో చేరారు 2017 నుంచి రాజేంద్రనగర్‌లోని వరి పరిశోధన సంస్థలో ఆయన పనిచేస్తున్నారు. జాబితాలో చోటు లభించడంపై శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఆయనకు అభినందనలు తెలిపారు.

Read More

సాగునీటి వ్యవస్థకు పూర్వ వైభవం తెస్తాము

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో సాగు నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామని, నవంబరు మొదటి వారానికల్లా వాటిని పూర్తి చేస్తామని జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇప్పటికే ఎన్నికలకు ఉత్తర్వులు వెలువడ్డాయని, ఓటర్ల జాబితాలు నవీకరిస్తున్నారని శుక్రవారం మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిర్వీర్యమైన సాగు నీటి వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టి, వాటికి పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పారు. చివరి ఎకరా వరకు నీరు అందించేలా సాగునీటి సంఘాలను సమన్వయం చేసుకుంటూ జలవనరుల శాఖ పని చేస్తుందన్నారు.

Read More

గ్రామీణ రైతు ఇంట ‘కోటి’ వెలుగులు

‘నేషనల్‌ లైవ్‌స్టాక్‌ మిషన్‌’ కింద రూ. కోటి రుణం
రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తం అందుకున్న తొలి రైతు!
మారుమూల పల్లెలోని ఓ రైతు ఇంట జాతీయ పథకం సిరులజల్లు కురిపించింది. చిన్న పరిశ్రమల ఏర్పాటులో రైతులకు ప్రోత్సాహకాన్ని అందిస్తున్న ‘నేషనల్‌ లైవ్‌స్టాక్‌ మిషన్‌’ను సద్వినియోగం చేసుకోవడంతో రూ. కోటి రుణం మంజూరైంది. ఇందులో 50 శాతం రాయితీ కాగా… రూ. 50 లక్షలను ఆయన తిరిగి చెల్లించాలి. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలోని అరికెల గ్రామ పంచాయతీ, గోసువారిపల్లెకు చెందిన రైతు చిన్నరెడ్డెప్పరెడ్డి… గొర్రెల పెంపకం యూనిట్‌ ఏర్పాటు నిమిత్తం ఈ మొత్తం అందుకున్నారు. ఈ చెక్కును మదనపల్లె సబ్‌కలెక్టర్‌ మేఘనస్వరూప్‌ రైతుకు గురువారం అందజేశారు. ‘రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాన్ని ఓ మారుమూల ప్రాంత రైతు సద్వినియోగం చేసుకోవడం ఆహ్వానించదగినది. ఏ పథకం కిందనైనా ఓ రైతు ఇంత మొత్తంలో రుణం అందుకోవడం రాష్ట్రంలో ఇదే తొలిసారి’ అని కలెక్టర్‌ పేర్కొన్నారు. అధికారుల సలహాలు, సూచనలు తీసుకుని అందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మదనపల్లె పశుసంవర్థకశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ సత్యనారాయణ, ఏడీఏ రోహిణి, పశువైద్యాధికారి లారెన్స్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More

వ్యవసాయ పంపుసెట్లకు… రూ.508 కోట్లతో విద్యుదీకరణ పథకం

తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్తు సంస్థ కొత్తగా వ్యవసాయ పంపు సెట్ల విద్యుదీకరణ పథకాన్ని రూపొందించింది. రూ. 508.95 కోట్ల విలువైన ఈ పథకానికి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నల్గొండ, సూర్యాపేట, సరూర్‌నగర్‌, మెదక్‌, వికారాబాద్‌, యాదాద్రి, నారాయణపేట్‌, రాజేంద్రనగర్‌, గద్వాల్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ఆపరేషన్‌ సర్కిళ్లకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. ప్రస్తుత విద్యుత్తు లైన్లకు దూరంగా ఉన్న పొలాలకు ఈ పథకంలో ప్రాధాన్యమివ్వనున్నారు. ఈ పథకం కింద 25 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి నాలుగైదు హెచ్‌పీ పంపు సెట్లకు కనెక్షన్‌ ఇవ్వనున్నారు. 25కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌, దానికి అవసరమైన 11 కేవీ కండక్టర్‌, ఎల్‌టీ కేబుల్‌, పోల్స్‌ వంటివి ఏర్పాటు చేయాలంటే దాదాపు రూ.3 లక్షల వరకు ఖర్చవుతుంది. ఒక్కో కనెక్షన్‌కు రూ. 75 వేల వ్యయం కానుంది. ఒక వ్యవసాయ కనెక్షన్‌కు రైతు చెల్లించేది రూ. 5 వేలు మాత్రమే. మిగిలిన రూ. 70 వేలను ప్రభుత్వం రాయితీ కింద భరించనుంది. దీనికి సంబంధించిన పనులన్నీ సంస్థ పరిధిలోనే జరుగుతాయి.

Read More

ప్రపంచవ్యాప్తంగా మన తెలంగాణ విత్తనం ప్రాముఖ్యత పొందాలి

మన భారత దేశానికే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మన తెలంగాణ విత్తనం ప్రాముఖ్యత పొందాలని, దానికి తగ్గట్లుగా ప్రభుత్వ ప్రయత్నాలకు మీరందరూ కలిసి రావాలని FICCI భవన్‌లో జరిగిన సీడ్‌మెన్‌ అసోసియేషన్‌ 29వ AGM లో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 1995వ సంవత్సరంలో 20 నుంచి 30 మందితో ఆరంభమైన ఈ సీడ్‌మెన్‌ అసోసియేషన్‌ నేడు 507 మంది సభ్యులతో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన అన్ని విత్తన కంపెనీలకు ప్రాతినిధ్యము వహిస్తుంది. మన తెలంగాణాను విత్తనోత్పత్తిలో అగ్రస్థానంలో ఉంచిన అందరికీ, రాష్ట్రములో ఉన్న 5 లక్షల మంది విత్తన ఉత్పత్తి రైతులకు మంత్రి శుభాకాంక్షలు తెలియచేశారు. విత్తనోత్పత్తి చేసే రైతులకు పంట రుణాలను సాధారణ రైతుల కంటే 30% నుండి 50% మేర పెంచి ఇవ్వాల్సిందిగా బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏ ఒక్క రైతూ కూడా ఫలానా కంపెనీ విత్తనం వలన పంట నష్టపోయాం అనే మాట రాకుండా విత్తన కంపెనీలు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయడానికి ప్రయత్నం చేయాలని, మీ ప్రయత్నాలకు మా ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి మాట ఇచ్చారు.

Read More

గొర్రెలు, మేకల పెంపకం యూనిట్లకు 50% రాయితీ

జాతీయ లైవ్‌స్టాక్‌ మిషన్‌ ద్వారా 50 శాతం రాయితీపై గొర్రెలు, మేకలు, కోళ్ళు, పందుల పెంపకం యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ, పశుసంవర్థక శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. 20 లక్షల నుంచి కోటి రూపాయల వరకు యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చని, యూనిట్‌ వ్యయంలో 50% రాయితీ లభిస్తుందని, 40% బ్యాంకు రుణం, రైతు 10% శాతం వాటా చెల్లించాల్సి ఉంటుందని మంత్రి తెలియచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినియోజిక వర్గంలో యూనిట్లు ఏర్పాటు జరిగేలా చూస్తామన్నారు. ఔత్సాహిక గ్రామీణ యువతకు ఈ పథకంపై అవగాహన కల్పించడం ద్వారా రైతులను వ్యాపారవేత్తలుగా చేస్తామని మంత్రి తెలిపారు.

Read More