తక్కువ ఖర్చుతో టెర్రస్‌ గార్డెన్‌ 

పలు రకాల కారణాల వలన ఇటీవల కాలంలో హైదరాబాద్‌ నగరంతో పాటు ఇతర ప్రాంతాలలో కూడా ఇంటి పంటను చేపట్టే వారు పెరుగుతున్నారు. ఇంటిపంటదారుల సంఖ్య పెరిగేకొలది ఇప్పటి వరకే ఇంటి పంట మొదలు పెట్టిన వారికి మరియు కొత్తగా మొదలు పెట్టే వారికి అనేక రకాలుగా ఉపయోగం ఉంటుంది. మొదటలో కొద్ది మంది మాత్రమే ఇంటి పంటను చేస్తున్న సమయంలో విత్తనాల కొరకు, చిన్న చిన్న సలహాల కొరకు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ ఇంటి పంట దారుల సంఖ్య పెరిగే కొలది అనేక రకాల సమస్యలకు పరిష్కారాలు సులభంగా అందుబాటులోకి వస్తున్నాయి కాబట్టి ఇంటిపంట వైపు అడుగులు వేసే వారి సంఖ్య ఏఏటికాయేడు పెరుగుతూ ఉంది. ఇంటి పంట వైపు అడుగులు వేసేవారిలో అన్ని వర్గాల వారు, అన్ని వయసుల వారు ఉంటున్నారు. మిగతా వారితో పోల్చుకుంటే ఉద్యోగ బాధ్యతల నుంచి పదవీవిరమణ చేసిన వారికి ఇంటిపంట బాగా ప్రయోజనకారిగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.  తమకు అవసరమయిన ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల లాంటి వాటిని ఎలాంటి రసాయనాలు వేయకుండా ఆరోగ్యకరంగా పండించుకొని తింటూ తమ తమ ఆరోగ్యాలను కాపాడుకోవడంతో పాటు పదవీ విరమణ అయిన తరువాత ఎలాంటి వ్యాపకం లేకుండా ఇబ్బందులు ఎదుర్కొనే వారికి ఇంటి పంట ఒక ఆరోగ్యకర వ్యాపకంగా ఉపయోగపడుతుండడంతో పదవీవిరమణ చేసిన వారికి అన్ని రకాలుగా ప్రయోజనకారి ఇంటిపంట అని గ్రహించి తాము చేస్తున్న ఉద్యోగాల నుంచి పదవీ విరమణ పొందిన తరువాత టెర్రస్‌ గార్డెన్‌ మొదలు పెట్టారు హైదరాబాదు మధురానగర్‌కి చెందిన వినయకుమార్‌, సృజన దంపతులు.

వినయ్‌కుమార్‌ పవర్‌గ్రిడ్‌లో మేనేజరు బాధ్యతలు నిర్వర్తించి పదవీ విరమణ పొందారు. సృజన ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని చేస్తూ పదవీ విరమణ పొందారు. వీరు తమ పదవీ విరమణ అయిన తరువాత ఒక మంచి వ్యాపకం కోసం 2020వ సంవత్సరములో తమ మిద్దె మీద మిద్దెతోటను ప్రారంభించారు. మిద్దెతోట వలన ఆరోగ్యకర ఆహారాన్ని పొందడముతో పాటు శారీరక శ్రమతో పాటు మానసిక ఉల్లాసం దొరుకుతుందని ఇటువైపు అడుగులు వేశారు. వారు మిద్దెతోటను ప్రారంభించే సమయానికి అనేక మంది ఇంటి పంటదారులు ఉన్నారు కాబట్టి కొన్ని రకాల మెళకువలు చేపట్టడానికి అవకాశం కుదిరింది. తెలుసుకున్న వెళకువలలో భాగంగా మొక్కల పెంపకానికి ఉపయోగించే కంటెయినర్ల విషయంలో ఎక్కువ ఖర్చు చేయకుండా తక్కువ ఖర్చుతో ఇంట్లో అందుబాటులో ఉండే వృథాగా పడవేసే టైర్లు, డబ్బాలు, నీటి డబ్బాలు, బక్కెట్లు, నూనె టిన్నుల లాంటి వాటితో పాటు స్క్రాప్‌ దుకాణాలలో తక్కువ ధరలో అందుబాటులో ఉండే కూరగాయల ట్రేలు, సూట్‌కేసుల లాంటి వాటిని అతి తక్కువ ధరలో సేకరించి వివిధ రకాల మొక్కల పెంపకం మొదలు పెట్టారు.

టెర్రస్‌ మీద నీళ్ళు పడితే స్లాబ్‌ పాడైపోయే అవకాశం ఉంది కాబట్టి కంటెయినర్లను స్లాబ్‌ మీద పెట్టకుండా కొంచెం ఎత్తులో ఏర్పాటు చేసుకున్నారు. ఈ విధంగా ఎత్తులో ఏర్పాటు చేసుకోవడం వలన స్లాబ్‌ మీద పడిన నీరు వెంటనే ఆరిపోయి స్లాబ్‌ పాడవకుండా కాపాడుకోగలిగారు. మట్టి మిశ్రమానికి గాను మిద్దెతోట ప్రారంభించిన మొదటిలో ఒక ట్రాక్టరు ట్రక్కు మట్టిని కొనుగోలు చేసుకుని ఇప్పటివరకు ఆ మట్టిని వినియోగిస్తున్నారు. మట్టి మిశ్రమములో మట్టి, కోకోపిట్‌, ఎరువులను సమానంగా తీసుకుని దానికి కొద్దిమొత్తంలో వేపపిండిని కలిపి ఆ మిశ్రమాన్ని కంటెయినర్లలో నింపి మొక్కల పెంపకం మొదలు పెట్టారు.

విత్తనాల కొరకు కూడా పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోలేదు. మిద్దెతోట ప్రారంభించిన కొత్తలో ఒక్కసారి మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయడం జరిగింది. తరువాత తమ మిద్దెతోటలోని మొక్కల నండి విత్తనాలను సేకరించి తాము ఉపయోగిస్తూ తోటివారికి అందిస్తూ ఉన్నారు. ఇందుకు గాను ఇంటి పంటను పెంచేవారితో కొన్ని గ్రూపులను ఏర్పాటు చేసుకుని ఆ గ్రూపులలో విత్తనాల గురించి, ఇంటి పంటకు సంబంధించిన విషయాల గురించి చర్చించుకుంటూ, ఒకరికొరకు చేదోడుగా ఉంటూ, విత్తనాలు, నారు లాంటి వాటిని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మిద్దె తోటను కొనసాగిస్తున్నారు. మొక్కలకు పోషకాలకు మరియు చీడపీడల నివారణకు గో-కృపామృతం, వేస్ట్‌డికంపోజర్‌, కిచెన్‌ వేస్ట్‌ ద్రావణాన్ని ఉపయోగిస్తున్నారు. అన్ని రకాల మెలకువలు తీసుకుంటూ తక్కువ ఖర్చుతో మిద్దెతోటలో వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. తమ మిద్దెతోటలో వివిధ రకాల ఆకుకూరలతో పాటు, వంగ, టమాట, చిక్కుడు, పచ్చిమిర్చి, చింత, ఉసిరి, స్ట్రాబెర్రి, జామ, సపోట, యాపిల్‌ బేర్‌, నిమ్మ, డ్రాగన్‌ఫ్రూట్‌, బత్తాయి లాంటి వాటితో పాటు తులసి, అరటి లాంటి మొక్కలను కూడా పూర్తి సేంద్రియ పద్ధతులలో పెంపకం చేస్తున్నారు.కొత్తగా ఇంటిపంటను చేపట్టేవారు కంటెయినర్ల విషయంలో ఎక్కువ 

ఖర్చు  పెట్టకుండా తమ ఇంట్లో వృథాగా పడి ఉన్న టైర్లు, వాటర్‌ క్యానులు, నూనె క్యానులు, బక్కెట్ల లాంటి వాటితో పాటు స్క్రాప్‌ దుకాణాలలో దొరికే కూరగాయల ట్రేలు, ప్లాస్టిక్‌ డబ్బాలు, బక్కెట్లు లాంటి వాటిని తక్కువ ధరలో కొనుగోలు చేసుకుని మొక్కల పెంపకం చేపట్టగలిగగితే ఖర్చులు తక్కువగా అవుతాయి. విత్తనాల విషయంలో తమ లాంటి ఇంటి పంట దారులను సంప్రదిస్తే విత్తనాలు అందుబాటులోవస్తాయి కాబట్టి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనే కొత్తగా ఇంటిపంటను చేపట్టే వారిని వారు కోరుతున్నారు.

  – వై. శ్రవణ్‌ కుమార్‌, స్పెషల్‌ కరస్పాండెంట్‌

Read More

ఆర్యోకరమైన సరదా… ఇంటి పంట

ప్రతి వ్యక్తికి కొన్ని సరదాలు / అలవాట్లు / వ్యాపకాలు ఉంటాయి. ప్రస్తుతం సమాజంలో వ్యక్తుల అలవాట్లను గమనించినట్లయితే చాలావరకు తమకు, సమాజానికి నష్టం కలిగించేవిగానే ఉన్నాయి. ఉదాహరణకు కొంతమందికి డ్రైవింగ్‌ సరదాగా ఉండవచ్చు. అనవసరమైన డ్రైవింగ్‌ వలన ఇంధనము రూపంలో డబ్బు ఖర్చు అవటంతోపాటు ఊహించని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండవచ్చు. ఇంకొంతమంది ప్రొగత్రాగడానికి, డ్రగ్స్‌కు, అల్కహాలుకు, బెట్టింగుల లాంటి అలవాట్లను సరదాగా మొదలు పెట్టి చివరకు వాటికి బానిసలు అయ్యి ఎంతో నష్టపోతుంటారు. ఇంకా కొంతమంది ఫోన్ల వాడకం సరదాగా మొదలు పెట్టి అది అలవాటుగా మారి చివరకు ఫోన్లకు కూడా బానిసలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈవిధంగా చెప్పుకుంటూపోతే సమాజంలో అనేక రకాల సరదాలు, అలవాట్ల వలన తాము నష్టపోవడంతోపాటు సమాజానికి కూడా నష్టం వాటిల్లుతుంది. ఈ సమస్యకు పరిష్కారం కావాలంటే మన సరదాలు, మన అలవాట్లు మనతో పాటు తోటి వారికి ఉపయోగపడేవిగా, మన ఆరోగ్యాన్ని కాపాడేవిగా, శారీరక శ్రమకు అవకాశం ఉండేవిగా ఉండాలి. అప్పుడు అన్ని రకాలుగా ఫలితాలు ఉంటాయి. అలాంటి సరదాలలో/అలవాట్లలో ఇంటిపంట మొదటి వరుసలో ఉంటుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ విషయాన్ని గ్రహించిన చాలామంది ఇంటిపంటవైపు అడుగులు వేశారు, వేస్తున్నారు. ఈ కోవకు చెందుతారు హైదరాబాద్‌ రాంపల్లి, నేతాజీనగర్‌లో టెర్రస్‌గార్డెన్‌ పెంచుతున్న ఎలిజబెత్‌.

ఎలిజిబెత్‌ రెండున్నర సంవత్సరాల క్రితం సరదా కోసం ఇంటి పంటను మొదలు పెట్టారు. ప్రస్తుతం ఆ ఇంటి పంట తమ ఆరోగ్యాలను కాపాడటంతో పాటు తన పరిచయాలను కూడా పెంచి ఒక మంచి సర్కిల్‌ను ఏర్పాటు చేసింది. ఈ సరదాకోసం మొదలు పెట్టిన ఇంటి పంట ద్వారా రెండున్నర సంవత్సరాలలో నైపుణ్యాన్ని పెంచుకొని తక్కువ కాలంలో తోటి వారికి అవగాహన కల్పించే స్థాయికి ఎలిజబెత్‌ ఎదిగింది. ఎలిజబెత్‌ ప్రస్తుతం తన అనుభవాలను తోటి వారికి పంచడంతో పాటు ఉద్యాన శాఖ వారు ఇంటి పంటపై ఏర్పాటు చేసే అవగాహన సదస్సుల ద్వారా కూడా తన అనుభవాలను తోటి ఇంటి పంటదారులకు తెలియచేస్తున్నారు. 

తన ఇంటి పంటలో పునాస మామిడి, చిన్న రసాలు, పెద్ద రసాలు, బంగినపల్లి, పందిరిమామిడి, అల్‌టైమ్‌ మామిడి లాంటి మామిడి మొక్కలు, యాపిల్‌ బేర్‌ 5 మొక్కలు, నేరేడు రెండు రకాలు, దానిమ్మ, డ్రాగన్‌ఫ్రూట్‌, అంజూర, అరటి, స్టార్‌ఫ్రూట్‌, జీడిమామిడి, టేబుల్‌ నిమ్మ, తీపినిమ్మ, బత్తాయి, చింత మొదలగు పండ్ల మొక్కలతో పాటు అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలతో పాటు మందార, గులాబి లాంటి మొక్కలు కూడా పెంచుతున్నారు.

తమ ఇంటిపంటలో ఉన్న మొక్కలను ప్రతిరోజూ గమనిస్తూ పిండినల్లి లాంటి చీడపీడలను బ్రష్‌తో, పేనుబంకను (ఎఫిడ్స్‌) గంజి+ఇంగువ+పసుపు ద్రావణంతో నివారించుకుంటున్నారు. ప్రతి 10 రోజులకు మ్యాజిక్‌ కంపోస్టు (వివరాలను బాక్సు చూడగలరు)ను అందిస్తున్నారు. తీగజాతి కూరగాయలకు 3 జి కటింగ్‌ (వివరాలకు బాక్సు చూడగలరు) చేస్తూ ఎక్కువ దిగుబడి పొందుతున్నారు. కాకర, సొర, బీర లాంటి తీగ జాతి కూరగాయలు మగ, ఆడపూలు విడివిడిగా ఉంటాయి కాబట్టి రెండుకంటే ఎక్కువ మొక్కలు వేస్తున్నారు. తన ఇంటి పంటలో ఉన్న మొక్కలలో కొన్నింటిని తోటి ఇంటిపంట దారుల వద్ద నుంచి సేకరించి అభివృద్ధి చేసినవి ఉన్నాయి అని తనకు మొక్కలు అందచేసిన వారికి కృతజ్ఞతలు తెలియచేశారు. అదేవిధంగా తాను కూడా ఇతరులకు విత్తనాలు, మొక్కలు అందచేస్తూ తోటివారిని ఇంటిపంటవైపు అడుగులు వేయించడంలో తన వంతు కృషి చేస్తున్నారు. తన అనుభవాన్ని వేరే వారికి తెలియపరచడానికి ఏవిధమైన ఇబ్బంది పడకుండా తోటి వారిని ఇంటి పంట వైపు ప్రోత్సహిస్తున్నారు. తమ కుటుంబానికి, తోటి సమాజానికి, పర్యావరణానికి ఉపయోగపడే అలవాటును సరదాగా తీసుకొని కొనసాగిస్తున్న ఎలిజబెత్‌ని నిజంగా అభినందించవలసిందే. మరిన్ని వివరాలు మరియు ఇంటి పంటకు అవసరమైన సలహాలను ఎలిజబెత్‌ 8142055527కి ఫోను చేసి తెలుసుకోగలరు.  

మ్యాజిక్‌ ఫార్ములా

200 గ్రాముల ఆవపిండి, 200 గ్రాముల వర్మికంపోస్టు, 200 గ్రాముల వేపపిండి, 50 గ్రాముల తాజా టీ పొడి, తొక్కతో ఉన్న 4 అరటి పండ్ల పేస్టు. వాటన్నింటిని 20 లీటర్ల నీటిలో కలిపి ప్రతి రోజు రెండుసార్ల చొప్పున కట్టెతో 3 రోజులు కలిపితే మ్యాజిక్‌ కంపోస్టు తయారవుతుంది. 4వ రోజు నుండి ఈ ద్రవ ఎరువును ఉపయోగించుకోవచ్చు. లీటరు ద్రవ ఎరువుకు 10 లీటర్ల నీటిని కలిపి సాయంకాలం పూట మొక్కల పాదులలో అందించాలి. సున్నితమైన మొక్కలకు అయితే ఒక లీటరు ద్రవ ఎరువుకు 15 లీటర్ల నీటిని కలిపి మొక్కల పాదులలో అందించాలి. ఈ ద్రవ ఎరువును ప్రతి 10 రోజులకు ఒకసారి మొక్కలకు అందిస్తే ఫలితం బాగా ఉంటుంది.

మట్టి మిశ్రమం

30 శాతం ఎర్రమట్టి, 30 శాతం వర్మికంపోస్టు లేదా మాగిన ఆవుపేడ, 30 శాతం ఇసుక (కోకోపిట్‌ తప్పనిసరి కాదు) 10% వేప పిండిని కలిపి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకున్నట్లయితే 30 నుంచి 40 రోజుల వరకు ఎలాంటి పోషకాలు అందించ కుండానే మొక్కలు ఎదుగుతాయి. 40 రోజుల తరువాత పోషకాలు అందించవలసి ఉంటుంది. 

అలోవేరాతో అనేక ఉపయోగాలు

ఆలోవేరాని అంగుళం ముక్కలుగా కోసుకుని, ఒక లీటరు నీటిలో ఒక ముక్క వేసి 5 గంటలు నానిన తరువాత ఆ నీటిని మొక్కకు ఒక్కొక్క కప్పు చొప్పున పాదులలో అందిస్తే వర్షాకాలంలో నీరు ఎక్కువ అయినందువలన వచ్చే సమస్య నుండి మొక్క తేరుకుంటుంది. అంతేకాకుండా మల్బరి, గులాబి, మందార లాంటి కొమ్మలను కలబంద జ్యూస్‌లో ముంచి నాటుకున్నట్లయితే త్వరగా వేర్లు అభివృద్ధి చెందుతాయి అని ఎలిజబెత్‌ తాను పాటించిన పద్ధతులు వివరించారు. 

3జి కటింగ్‌

బీర, సొర, కాకర లాంటి తీగజాతి మొక్కలను 3 జి కటింగ్‌ చేసినట్లయితే ఎక్కువ ఆడపూలు పుష్పించి దిగుబడి పెరుగుతుందని ఎలిజబెత్‌ వివరిస్తున్నారు. ఇందుకు గాను తీగజాతి కూరగాయ మొక్క రెండు అడుగులు పెరిగిన తరువాత తల త్రుంచినట్లయితే రెండు ఇగుర్లు వస్తాయి. అవి కూడా ఒక అడుగు వచ్చిన తరువాత మరలా వాటి తలను త్రుంచితే ఈసారి ఒక్కొక్క దానికి రెండు చొప్పున రెండు తీగలకు 4 తీగలు వస్తాయి. మరలా అవి కూడా ఒక అడుగు పెరిగిన తరువాత తల గిల్లినట్లయితే ఈసారి 8 తీగలు వస్తాయి. ఈ 8 తీగలను వదలి వేసినట్లయితే ఎక్కువ బ్రాంచీలు వచ్చి ఆడ పూల శాతం పెరిగి ఎక్కువ దిగుబడి వస్తుందని ఎలిజబెత్‌ తన అనుభవాన్ని వివరించారు. 

చింత చిగురు పొందడం

ఇంట్లో డ్రమ్ములో చింత చెట్టు పెంచుకొంటూ ముదురు ఆకులని క్రమం తప్పకుండా గిల్లుతూ ఉన్నట్లయితే చింత చిగురు వస్తూ ఉంటుంది. తాను ఆ విధంగానే తన మిద్దె తోటలో పెంచుతున్న చింత చెట్టు నుండి చింత చిగురు పొందుతున్నానని ఎలిజబెత్‌ వివరించారు.

Read More

పెరటితోట బహుళార్థక సాధక ప్రాజెక్ట్‌ : రఘోత్తమరెడ్డి

మనిషికి ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆరోగ్యం లేని జీవితాలలో ఆనందం ఉండదు. కాబట్టి అందరికీ ఆరోగ్యం తప్పనిసరి. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నారు మన పెద్దలు. మన ఆరోగ్యం ప్రధానంగా మనం పీల్చుకునే గాలి, త్రాగే నీరు, తినే ఆహారం, వ్యాయామం లాంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. ఈ నాలుగు అంశాలలో ఆహారం తప్పితే మిగతావి అన్నీ కూడా వేరేవారిపై ఆధారపడవలసిన అవసరంలేదు. ఆహారం మాత్రం చాలావరకు వేరేవారిపై ఆధారపడాలి. గ్రామాలలో జీవించేవారు, పంటల సాగు చేసే వారు మాత్రం కొంతవరకు తామే సొంతంగా పండించుకుంటూ కొంతవరకు మాత్రమే మిగతా వారిపై అంటే అవి పండించే రైతుల ద్వారా పంట ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేసే వ్యాపారులపై ఆధారపడాలి. వేరే వారిపై ఆధార పడటం అంటే నమ్మకం కుదరక పోవచ్చు. ఈ సమస్యకు పరిష్కారం పెరటి తోట లేదా మిద్దెతోట లేదా ఇంటి పంట. ఇంటి పంట అవసరం ప్రస్తుతం అందరికీ ఉంటుంది. ఈ విషయాన్ని ముందుగానే గ్రహించి 12 సంవత్సరాల క్రితమే ఇంటి పంటను మొదలు పెట్టారు తుమ్మేటి రఘోత్తమరెడ్డి. సక్రమంగా ఇంటిపంటను చేపట్టినట్లయితే ఇంటి పంట ఒక బహుళార్థక సాధక ప్రాజక్ట్‌ అని రఘోత్తమ రెడ్డి తన అనుభవంలో గ్రహించారు.

రఘోత్తమరెడ్డిది స్వతహాగా వ్యవసాయ నేపథ్యం. చదువుకునే రోజుల్లో కూడా పొలం పనులలో తనవంతు పాత్ర పోషిస్తుండేవారు. సింగరేణిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ కూడా తన నివాస స్థలంలో పెరటి తోటను పెంచేవారు. మొత్తం మీద మొక్కల సాగులో 40 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. సింగరేణి సంస్థలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్న రఘోత్తమరెడ్డి ఒకానొక సందర్భంలో తాను నిర్వర్తించే ఉద్యోగ బాధ్యతలు సరైనవి కావు అని భావించి చేస్తున్న ఉద్యోగాన్ని వదలి మిద్దెతోట వైపు అడుగులు వేశారు. ఉప్పల్‌ సమీపములోని నారపల్లిలో 160 గజాల స్థలంలో ఇంటి నిర్మాణం మొదలు పెట్టారు. స్థలం తక్కువగా ఉండటం వలన పెరటి తోట కుదరదు. పెరటి తోటకు ప్రత్యామ్నాయం మిద్దెతోట అని గ్రహించి ఇంటి పైన మిద్దెతోట పెంచాలని నిర్ణయించుకుని అందుకు అనుగుణంగా ఇంటి నిర్మాణం చేయించారు. మిద్దెపైన కుండీలలో మొక్కలు పెట్టి మొక్కల పెరుగుదలకు నీటిని అందిస్తుంటాము కాబట్టి ఆ నీరు క్రిందకు కారకుండా ఉండేందుకు వీలుగా స్లాబును వేయించారు. మిద్దెపై కొన్ని  మడులు నిర్మించుకున్నారు. మొక్కలు పెంచుకోవడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలతో ఇల్లు నిర్మించుకున్నారు కాబట్టి గత 12 సంవత్సరాలకు పైగా మిద్దె తోటలో వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో పాటు బొప్పాయి, జామ, అరటి లాంటి పండ్ల మొక్కలను కూడా పెంచుతూ ఆరోగ్యరమైన దిగుబడులు తీస్తున్నారు.

మిద్దెపై నిర్మించిన మడులలో మరియు కుండీలు, ఇంట్లో వృథాగా పడిఉన్న కూలర్‌ బాక్సులు, బక్కెట్ల లాంటి వాటిలో కూడా వాటికి అనువైన మొక్కలు సాగు చేస్తున్నారు. వంటింటి వ్యర్థాలను మొక్కలకు అందిస్తూ చీడపీడల నివారణకు వేపనూనె లాంటివి ఉపయోగిస్తుంటారు. ప్రతిరోజు కొంత సమయాన్ని మిద్దెతోటలో గడుపుతూ ప్రతి మొక్కను పరిశీలిస్తూ ప్రాథమిక థలో ఉన్న చీడపీడలను చేతులతో కూడా నివారిస్తుంటారు. ఎక్కవగా నాటు రకం విత్తనాలను ఉపయోగిస్తూ తాను పెంచిన మొక్క నుంచే విత్తనాలను అభివృద్ధిపరుస్తూ అవసరమైన తోటి ఇంటి పంట ఔత్సాహికులకు విత్తనాలను అందిస్తూంటారు.

మిద్దెతోటను పెంచినందువలన ఇంటిలోపల ఉష్ణోగ్రత ఎండాకాలంలో కొద్దిగా తగ్గడం రఘోత్తమరెడ్డి తెలుసుకున్నారు. వేడి తగ్గి చల్లదనం లభిస్తే ఎండాకాలం ఏసిలు, కూలర్ల అవసరం లేకుండా పోయింది కాబట్టి విద్యుత్‌ను ఆదా చేయవచ్చు. సాయంకాలం సమయంలో కొంత సమయం కుటుంబ సభ్యులందరూ మిద్దె తోటలో గడిపినట్లయితే ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపినట్లవుతుంది. అందరూ ఎంతో కొంత శారీరక శ్రమ చేయటానికి అవకాశం కుదురుతుంది. కాబట్టి మిద్దె తోటను ఒక బహుళార్ధక సాధక ప్రాజక్ట్‌ అని రఘోత్తమరెడ్డి అంటారు. రఘోత్తమ రెడ్డి స్వతహాగా కవి కాబట్టి మిద్దె తోటలో గడుపుతూ కవితలు రాస్తూ ఉంటారు.

ప్రస్తుతం గ్రామాలలో ఉన్న రైతులు ఏకపంట విధానానికి అలవాటు పడ్డారు కాబట్టి గ్రామాలలో కూడా ఇంటి పంట అవసరం ఉందని గ్రహించారు. పట్టణాలలో మరియు గ్రామాలలో కూడా ఇంటి పంట సాగుదారులను పెంచాలనే ధ్యేయంతో ఇంటిపంట ఆవశ్యకతను, ఇంటి పంటలో మెళకువలను సామాజిక మాధ్యమాల ద్వారా అందరికి తెలియచేస్తూ ఉంటారు. రైతునేస్తం తరఫున ఇంటి పంటపై జరుగుతున్న అవగాహన సదస్సులకు హాజరయ్యి తన అనుభవ పాఠాలను తోటి ఔత్సాహికులకు తెలియచేస్తుంటారు. అవగాహనా సదస్సులకు ఎలాంటి పరిమితులు విధించకుండా ఏ ప్రాంతానికైనా వెళ్ళి అక్కడ అవగాహనా సదస్సులలో భాగస్వాములవుతుంటారు. మిద్దెతోటకు సంబంధించిన పుస్తకాలను కూడా రైతునేస్తం పబ్లికేషన్స్‌ ద్వారా ముద్రించారు. ఇంటి పంట అభివృద్ధికి శక్తికి మించి కృషి చేస్తున్నారు.

ప్రస్తుత సమాజంలో సమాచారాన్ని విశ్వవ్యాపితం చేయటానికి సామాజిక మాధ్యమాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రఘోత్తమ రెడ్డి ప్రతిరోజూ ఇంటి పంటకు సంబంధించిన సమాచారాన్ని, చిత్రాలను వాట్సప్‌, ఫేస్‌బుక్‌ల ద్వారా తోటి ఔత్సాహికులకు తెలియ చేస్తుంటారు. తాను తెలియపరిచే సమాచారం అంతా కూడా సరళమైన తెలుగు భాషలో అందరికీ అర్థం అయ్యేలా తెలుగులో టైపు చేసి పంపిస్తుంటారు. జిల్లాల వారీగా వాట్సప్‌ గ్రూపులను ఏర్పాటు చేసి తన సూచనలను సలహాలను ప్రతి జిల్లాలోని మారుమూల ప్రాంతాలలోని మిద్దెతోట/ఇంటిపంట ఔత్సాహికులకు చేరేలా చర్యలు చేపడుతుంటారు. ఇంటి పంటకు సంబంధించి సదస్సులు ఏర్పాటు చేసే నిర్వాహకుల ఆహ్వానం మేరకు సదస్సులకు హాజరై తన అనుభవ పాఠాలను వివరిస్తూ ఉంటారు. సదస్సుకు హాజరయ్యే ఔత్సాహికుల సంఖ్యతో సంబంధం లేకుండా అన్ని సదస్సులకు హాజరవుతూ ఎక్కువ మందిని ఇంటిపంట వైపు అడుగులు వేయించడమే తన లక్ష్యం అంటూ ముందుకు నడుస్తున్నారు. ఇంటి పంట/పెరటి తోట / మిద్దె తోటల పెంపకంలో మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ అనుభవం ఉన్న వారి గురించి ప్రస్తావిస్తే రఘోత్తమరెడ్డి ముందు వరుసలో ఉంటారు అనడంలో ఎలాంటి సందేహంలేదు. మరిన్ని వివరాలు 90001 84107 కి ఫోను చేసి తెలుసుకోగలరు. 

Read More
  • 1
  • 2