మామిడి సాగులో రైతులు భారీగా నష్టాలు చవిచూస్తున్నారు. ప్రత్యామ్నాయంగా పామాయిల్పై దృష్టి సారిస్తున్నారు. దీర్ఘకాలం ఇష్టంతో పెంచుకున్న తోటలను నిలువునా నరికేస్తున్నారు. ప్రస్తుతం పామాయిల్కు గిరాకీ నేపథ్యంలో, మామిడి నష్టాలను పూడ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో నూజివీడు తర్వాత అత్యధికంగా మామిడి సాగుకు మైలవరం నియోజకవర్గం పేరుగాంచింది. నియోజకవర్గ వ్యాప్తంగా నాలుగు మండలాల పరిధిలో ఐదారు దశాబ్దాల కిందటి నుంచి సాగు చేస్తున్న రైతులను మోతుబరులను చేసింది. రారాజుగా, అధిక విస్తీర్ణంలో సాగు చేసిన పంటగా ఘనత దక్కించుకున్న మామిడి నేడు రైతులను నిరాశలో ముంచెత్తుతోంది. గడిచిన నాలుగైదేళ్లుగా సగానికిపైగా మామిడి సాగు రైతులు కనీస ఆదాయాన్ని చూడలేదంటే అతిశయోక్తి కాదు. ఏయేటికాయేడు అనుకూల పరిస్థితుల కోసం ఆశగా ఎదురుచూసినా, ఈ ఏడాది ఎదురైన ప్రతికూల పరిస్థితులు వారి ఆశలపై పూర్తిగా నీళ్లు చల్లాయి. నాలుగైదేళ్లు కిందటి వరకు గోదావరి జిల్లాలకే పరిమితమైన పామాయిల్ సాగు క్రమేపీ ఎన్టీఆర్ జిల్లాకు ప్రవేశించింది. ప్రభుత్వ మద్దతు ధర ఉండడంతో పాటు, కరోనా సమయంలో, మద్దతు ధర కంటే రెట్టింపు ధరలు పలకడంతో రైతుల్లో ఈ సాగుపై మక్కువ పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మొక్కలను ఉచితంగా ఇవ్వడమే గాక, అంతర పంటలకు ప్రోత్సాహం, రాయితీపై బిందు సేద్య పరికరాలు, ఉపాధిహామీ పథకానికి అనుసంధానించడంతో రైతుల్లో పామాయిల్ సాగుపై మరింత ఆసక్తి పెరిగింది.