కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎకరానికి ఏడు క్వింటాళ్ల పత్తినే కొనుగోలు చేయాలనే సీసీఐ నిబంధనను ఎత్తివేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. 20 తేమ శాతం ఉన్నా కొనాలని కోరారు. ఈ మేరకు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు, సీసీఐ ఎండీ లలిత్ కుమార్ గుప్తాలకు సోమవారం ఆయన లేఖ రాశారు. ”అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి… దిగుమతి సుంకాలు ఎత్తి వేయడం వల్ల పత్తి రైతులకు మార్కెట్లో గిట్టుబాటు ధర లభించడం లేదు. ఈ తరుణంలో కేంద్రం అసంబద్ద ఆంక్షలతో వారిని ఇబ్బందులకు గురిచేస్తోంది. కిసాన్ కపాస్ యాప్‌లో నమోదు, జిన్నింగ్ మిల్లులను ఎల్1, ఎల్2గా విభజించడం, తేమ శాతాన్ని 8-12కు పరిమితం చేయడం సమస్యగా మారింది. రాష్ట్రంలో ఎకరానికి 15 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటికే సీసీఐ ఒక్కో రైతు నుంచి ఎకరానికి 12 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేసింది. ఈ తరుణంలో 7 క్వింటాళ్ల కంటే ఎక్కువ కొనవద్దంటూ కొనుగోలు కేంద్రాల అధికారులను సీసీఐ ఆదేశించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ నిబంధనను వెంటనే ఎత్తివేయాలి. రైతులతో పాటు జిన్నింగ్ మిల్లర్ల సమస్యలను పరిష్కరించాలి” అని లేఖలో తుమ్మల కోరారు.

4 Nov, 2025
