ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 69,975 వ్యవసాయ కనెక్షన్ల కోసం రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పటికే40,336 కనెక్షన్లు మంజూరు చేశాం. 22,709 కనెక్షన్లను వినియోగం లోకి తీసుకొచ్చాం. వచ్చే వ్యవసాయ సీజన్ కల్లా మిగతావన్నీ ఇస్తాం’ అని విద్యుత్తుశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. సోమవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ‘కేంద్ర ప్రభుత్వ పీఎం కుసుమ్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకుని కేంద్రాన్ని సంప్రదించి దీన్ని అమల్లోకి తెచ్చారు. రాష్ట్రానికి 4.50 లక్షల వ్యవసాయ కనెక్షన్లు అవసరం. ఇప్పటికే కేంద్రం లక్ష కనెక్షన్లు మంజూరు చేసింది. మరో 2 లక్షల కనెక్షన్లకు టెండర్లు పిలుచుకునేందుకు అనుమతిని ఇచ్చింది. పీఎం కుసుమ్ ద్వారా సోలార్ విద్యుత్తును తెచ్చి రాబోయే రోజుల్లో పగటిపూటనే నిరంతరాయంగా 9 గంటల విద్యుత్తును అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని మంత్రి వివరించారు.
*70 కొత్త సబ్ స్టేషన్లు*
‘రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 70 సబ్స్టేషన్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచాం. ఎసైన్డ్ భూముల్లో దొంగ కనెక్షన్లు ఏర్పాటు చేస్తే రద్దు చేస్తాం. చోరీల నుంచి కాపాడేందుకు కాపర్‌తో కాకుండా ట్రాన్స్ఫార్మర్లను అల్యూమినియంతో తయారు చేయిస్తున్నాం’ అని రవికుమార్ వివరించారు.

