వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు మార్క్ ఫెడ్, మార్కెటింగ్ అధికారులతో ధాన్యపు కొనుగోళ్ళు, పత్తి కొనుగోళ్ళు, ఇతర పంటల కొనుగోళ్ళ మీద పూర్తి స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ముందుగా మార్క్‌ఫెడ్ అధికారులతో సమావేశమై ఖరీఫ్ కొనుగోళ్ళపై ఆరా తీశారు. మార్క్ ఫెడ్ ఎండీ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ, పెసర కొనుగోళ్ళు పూర్తి కావచ్చాయని, ఇప్పటికే 8.03 కోట్లు విలువ గల 924.85 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని, ఇంకా ఒకట్రెండు మార్కెట్లలో మాత్రమే పెసరు పంట వస్తుందని, అంతేకాకుండా 35.86 కోట్లు వెచ్చించి 4,793 రైతుల వద్ద నుండి 7330.50 మెట్రిక్ టన్నలు సోయాచిక్కుడు కొనుగోలు చేశామని, ఇంకా 50,000 టన్నులు వచ్చే మార్కెట్లకు అవకాశాముందని మార్కెఫెడ్ అధికారులు మంత్రికి తెలియజేశారు. పంట కొనుగోలు పూర్తి కాగానే, ఎక్కడ ఏ మార్కెట్లలో ఎక్కువ రేటు ఉందో విచారించి, డిస్పోసల్ చేసేవిధంగా ప్రణాళిక చేసుకోవల్సిందిగా, తద్వారా మార్క్‌ఫెడ్ ఆదాయం పెంచే విధంగా చూడాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. ఎరువుల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి ప్రతియేటా మార్క్‌ఫెడ్‌కు నిర్వహణ ఖర్చులు, రవాణా ఖర్చులను సహేతుక పద్దతుల ద్వారా నిర్వహించి, ప్రతి ఏటా పెరిగే ఖర్చుల భారాన్ని తగ్గించే విధంగా ప్రయత్నించాలని, రైతులకు ఇబ్బంది రాకుండా వచ్చే యాసంగిలో కూడా ఎరువుల సరఫరా సక్రమంగా అయ్యేటట్లు చూడాలని మంత్రి ఆదేశించారు.
ఆ తరువాత రాష్ట్రంలో పత్తి కనీస మద్దతు ధర (MSP) కార్యకలాపాలపై మార్కెటింగ్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ మరియు మార్కెటింగ్ అధికారులతో సమీక్షించారు పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా నిర్వహించేందుకు మరియు రైతులకు అవసరమైన మద్దతు ధర అందించేందుకు మంత్రి పలు సూచనలు చేశారు. పత్తి MSP కొనుగోలుకు సంబంధించి నాణ్యత ప్రమాణాలపై రైతులకు మార్కెట్ యార్డుల్లో, కొనుగోలు కేంద్రాల వద్ద నిరంతరము అవగాహన కల్పించాలని, మార్కెటింగ్ అధికారులు, ఉన్నతాధికారులు నిరంతరము ఆయా మార్కెట్‌యార్డులలో, కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిబంధనల ప్రకారం పత్తిని కొనుగోలు జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పత్తి రైతులు తేమ విషయంలో పడుతున్న ఇబ్బందులను CMD, CCI గారితో మాట్లాడి వారి దృష్టికి తీసుకెళ్లాలని, పత్తిలో తేమశాతం ఎక్కువ ఉన్నా కూడా CCI వారే కొనుగోలు చేసేలా చూడాలన్నారు. పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, వారి సమస్యలు వెంటనే పరిష్కరించే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. పత్తి రైతులకు అవసరమైన మద్దతు అందించి, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. అంతేకాకుండా ధాన్యపు కొనుగోలు ఆరంభమైనందున, అన్ని కొనుగోలు కేంద్రాలలో అవసరమైనంత మేర టార్ఫలిన్ అందుబాటులో ఉంచాలని, డ్రైయర్లు, ప్యాడీ క్లీనర్లు, సన్నబియ్యం నిర్ధారణ చేసే పరికరాలు ప్రతీ కొనుగోలు కేంద్రానికి చేరాయా లేదా అనేది చూసుకోవాల్సిందిగా అడిషనల్ డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లను ఆదేశించారు.

26 Oct, 2024
