తెలంగాణా రాష్ట్రంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఈ సారి మిల్లర్లకు కేటాయించవద్దని పౌరసరఫరాల సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు ఇచ్చే ధాన్యంలో తేమ నిబంధనను 17 నుంచి 14 శాతానికి తగ్గించాలని, సన్న బియ్యం మిల్లింగులో 67% బియ్యం రావని నిబంధనలు మార్చాలని, సన్న బియ్యం సరఫరాలో క్వింటాలుకు రు. 300 పరిహారం.. కస్టోడియన్ మిల్లింగ్, రవాణా ఛార్జీలు పెంచాలని కొంతమంది మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సమస్యలు పరిష్కారం కానిదే ధాన్యాన్ని మిల్లింగ్‌కు తీసుకోమని కొంతమంది మిల్లర్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వ శాఖల, సంస్థల పరిధిలోని గోదాములలో నిల్వ చేయాలని పౌర సరఫరాల శాఖ చేసిన ప్రతిపాదనను తెలంగాణ వ్యవసాయ శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిసింది. తాజాపరిణామాల నేపథ్యంలో ధాన్యం నిల్వ చేసే విషయమై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సంప్రదింపులు జరిపారు. పౌర సరఫరాల శాఖ ముఖ్యకార్యదర్శి డిఎస్ చౌహాన్ కూడా మంత్రి తుమ్మలతో మాట్లాడారు.

11 Oct, 2024
