పెసర, శనగ, వేరుశనగ పంటలలో తెగుళ్ళను తట్టుకోగల కొత్తవంగడాలను ఆచార్య ఎన్‌.జి, రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రూపకల్పన చేశారు.
లాంపెసర: ఎల్‌జీజీ-610 రకం లాం పెసర రబీ సీజనుకు అనువైంది. పంటకాలం 74 రోజులు. ఎల్లో మొజాయిక్‌ వైరస్‌ను నిరోధించగల శక్తి ఈ రకానికి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. యంత్రంతో కోతకు అనుకూలమైన ఈ పెసరలో ప్రోటీన్‌ 23.16% ఉంటుంది.
నంద్యాల శనగ: నంద్యాల గ్రామ్‌ (ఎన్‌బీఈజీ-1267)గా పిలిచే దేశీయ శనగ రకం రబీలో వర్షాధారంగా అనుకూలమైంది. పంటకాల పరిమితి 90-95 రోజులు, ఎండు తెగులును తట్టుకోగల ఈ వంగడం రబీలో హెక్టారుకు 20.95 క్వింటాళ్లు దిగుబడి ఇవ్వగలదని అంచనా. యంత్రాలతో కోతకు అనుకూలమైన ఈ దేశీయ శనగను 1-2 రక్షిత నీటి తడులతో కూడా పండించవచ్చు. 15.96% సీడ్‌ ప్రోటీన్‌ ఈ రకంలో ఉంటుంది.
తిరుపతి వేరుశనగ: కోణార్క్‌లోని ఐసీఏఆర్‌ సహకారంతో తిరుపతి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు తయారు చేసిన టీసీజీఎస్‌-1707 రకం వేరుశనగ ఖరీఫ్‌ సీజనుకు అనుకూలమైనది. ఈ రకం కాలపరిమితి 110-115 రోజులు. హెక్టారుకు 24.76 క్వింటాళ్ళ దిగుబడి రావచ్చు. రసం పీల్చే పురుగులను తట్టుకుంటుంది. ఆకుమచ్చ తెగులు, వేరుకుళ్ళు, కాండం కుళ్ళు, వేరు ఎండు తెగుళ్ళను మధ్యస్తంగా తట్టుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.