తెలంగాణా రాష్ట్రంలో మరోమారు భూమి దస్త్రాల ప్రక్షాళన చేయనున్నారు. ప్రతి కమతానికి ‘భూధార్‌’ సంఖ్యను కేటాయించేందుకు దస్త్రాల పరిశీలన తప్పనిసరి కానుంది. కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా అన్ని రాష్ట్రాలలో అమలు చేయనున్న ఈ విధానాన్ని తెలంగాణ రాష్ట్రం కూడా అమలు చేయనుంది. ప్రతి పౌరుడికి ‘ఆధార్‌’ కేటాయించినట్లే ప్రతి కమతానికి ఒక విశిష్ట సంఖ్యను కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. ఇదే ‘భూధార్‌’. దీని వలన ఆస్తులకు రికార్డు ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సాయం, హక్కుల పరంగా గుర్తింపు వంటివి లభిస్తాయి. ఇకపై భూధార్‌ సంఖ్యను నమోదు చేస్తే చాలు ఆ రైతు భూమి సమాచారం కనిపించనుంది. దీని వలన రుణాలు, రాయితీలు, బీమాతో పాటు ఇతరత్రా పథకాల అమలు సులువుగా మారనుంది.