వచ్చే రెండు సంవత్సరాల్లో కోటిమంది రైతులను ప్రకృతి వ్యవసాయంలోకి ప్రోత్సహిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఉత్పత్తులకు బ్రాండింగ్, సర్టిఫికేషన్ ఇస్తామని తెలిపింది. శాస్త్రసాంకేతిక సంస్థలు, గ్రామ పంచాయతీల ద్వారా దీన్ని అమలు చేస్తామని, పదివేల బయో-ఇన్‌పుట్ రిసోర్స్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి ప్రాధాన్యతను ఇచ్చింది. వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలకు రూ. 1.52 లక్షల కోట్లు కేటాయించింది. కూరగాయల సాగుకు భారీ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని, కూరగాయల సేకరణ, నిల్వ, మార్కెటింగ్ కోసం ప్రత్యేక సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేసేలా అంకుర సంస్థలు, సహకార సంఘాలు, రైతు సంఘాలను ప్రోత్సహిస్తామని కేంద్రప్రభుత్వం తెలియచేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులను సైతం తట్టుకోగలిగి అధిక దిగుబడినిచ్చే కొత్త వంగడాల దిశగా వ్యవసాయ పరిశోధనలను ప్రోత్సహిస్తామని కేంద్రప్రభుత్వం తెలియచేసింది.

23 Jul, 2024
