ఈసారి వేసవి పగటి ఉష్ణోగ్రతలు సరాసరి 40 డిగ్రీల సెంటిగ్రేడ్ మించి నమోదు అవుతున్నాయి. వేసవికాలంలో ఎండల తీవ్రత, అధిక ఉష్ణోగ్రత, వేడిగాలులు వీచడం వలన ఉష్ణతాపానికిగురై పాడి పశువులు తీవ్ర అనారోగ్యానికి, అసౌకర్యానికిలోను కావడమే కాకుండా వడదెబ్బకు గురవుతూ ఉంటాయి. ఆవులు కంటే గేదెలు ఉష్ణతాపానికి ఎక్కువగా గురవుతాయి. గేదెలు నలుపు వర్ణంలో ఉడటంవలన నలుపు ఉత్తమ ఉష్ణగ్రహకము కావడము వలన ఈ ప్రభావము ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పశుపోషకులు వేసవికాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే,పాడిపశువులు అనారోగ్యానికి గురికాకుండా వడదెబ్బబారిన పడకుండా సంరక్షించుకోవచ్చు.
వడదెబ్బ
- అధిక ఉషోగ్రత, గాలి ప్రసరణ సరిగా లేకపోవడం, పశువుల షెడ్లలో అధికసంఖ్యలో కిక్కిరిసి ఉండటం, ఉక్కపోత, నీటి సౌకర్యం అందుబాటులో లేకపోవడం వలన పశువు వడదెబ్బకు గురవుతుంది. దాహం పెరుగుతుంది. పశువు తూలుతూనడుస్తూ పడిపోవడం, రొప్పుతూ, శ్వాస కష్టమవడంతో ఒక్కొకసారి అపస్మారక స్థితికి వెళ్ళి మరణిస్తాయి.
పశువులలో ఉష్ణోగ్రత ప్రభావం
- పశువు శరీర ఉష్ణోగ్రత 38-39.3 డిగ్రీల సెంటీగ్రేడ్ అయిన పాడి పశువుల సౌకర్యవంతమైన ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెంటీగ్రేడ్ మాత్రమే. ఈ ఉష్ణోగ్రతకు మించి వాతావరణ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఉష్ణ తాపానికి గురవుతాయి.

- దీని వలన శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. నోటినుండి చొంగకారుతుంది. జీర్ణక్రియకు, నెమరువేయడానికి కావలిసిన లాలాజలం లభించదు. ముట్టె ఎండిపోవడం, చర్మం సున్నితత్వం కోల్పోయి మందంగా అవడం గమనించవచ్చు. దాహం అధికంగా ఉండటంతో ఎక్కువనీరు తాగుతాయి. తాగిన నీరు చెమట రూపంలో బయటకు వచ్చి ఎలోక్ట్రోలైట్స్ నష్టపోయి జీవక్రియలు మందగిస్తాయి. మూత్రపిండాలు సరిగా పనిచేయకపోవడం వల్ల మూత్రం తక్కువగా పోస్తుంది. శ్వాస, గుండె, నాడీ వేగం పెరుగుతుంది.
- మేత సరిగా తినక పోవడం వలన శరీరంలో గ్లూకోజ్ నిలువలు తగ్గిపోతాయి.పశువు క్రమంగా నీరసించి, బలహీనంగా మారతాయి. పశువు సరిగ్గా నడవలేక తూలుతూ పడుకోవడానికి ప్రయత్నిస్తాయి. జీవక్రియ తగ్గిపోవడం, ఆకలి మందగించడం, ఆహరం తక్కువగా తీసుకోవడం వలన పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది.
- వ్యాధి నిరోధక శక్తి తగ్గటం వలన ఇతర వ్యాధులు, పరాన్నజీవులు ఆశించే అవకాశం పెరుగుతుంది. పునరుత్పత్తి సామర్థ్యం మందగించును. కొన్ని సమయాల్లో దాహంతో ఉన్న పశువులు మురికి గుంటలలో ఉన్న నీటిని తాగడం వల్ల పారుడు వంటి జీర్ణకోశ వ్యాధులు సంభవిస్తాయి.
- అధిక వేడివల్ల హార్మోన్ల ఉత్పతి సమతుల్యత లోపించడం వల్ల పునరుత్పత్తి కుంటుపడుతుంది. చూడి పశువులలో గర్భస్రావాలు సంభవించే అవకాశాలున్నాయి. పశువులు సకాలంలో ఎదకురావు, వచ్చినా ఎద లక్షణాలు స్పష్టంగా కనిపించవు. చూలు కట్టే అవకాశం తగ్గుతుంది. ఈతల మధ్య కాలం పెరుగుతుంది. పునరుత్పత్తి సక్రమంగా ఉండదు.
వడదెబ్బకు గురైన పశువులకు ప్రథమచికిత్స
- వడదెబ్బకు గురైన పశువులను వెంటనే చల్లని గాలి వీచే ప్రదేశంలోకి తీసుకెళ్ళి శరీర ఉష్ణోగ్రత తగ్గించడానికి పలుమార్లు నీటితో కడగటం, తల, నుదుటి మీద మంచుముక్కలు ఉంచడం లేదా చల్లని గోనే సంచిని దానిపై కప్పాలి. వెంటనే పశువైద్యున్ని సంప్రదించాలి. పశువైద్యుని పర్యవేక్షణలో గ్లుకోస్ సెలైన్, సోడియం క్లోరైడ్ అందించాలి. శరీర ఉష్ణోగ్రతలు తగ్గించడానికి సోడియం సలిసిలైట్, పారాసిట్మాల్ ఇంజక్షన్లు వేయించాలి.
వేసవి యాజమాన్య పద్ధతులు
- ఎండ తీవ్రత నుండి రక్షించడానికి పశువుల పాకను ఎత్తైన ప్రదేశంలో గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేవిధంగా ఏర్పాటు చేసుకోవాలి. పాకాల ఎత్తు 12-14 అడుగులు ఉండేలా నిర్మించుకోవాలి. సూర్యరశ్మి నేరుగా పడకుండా దీర్ఘఅక్షం తూర్పుపడమరలుగా నిర్మించుకోవాలి. పాకాల చుట్టూ సుబాబుల్, అవిశ చెట్లను నాటడం వలన నీడతో పాటు పశుగ్రాసం లభిస్తుంది.

- పాకాల పైకప్పుభాగాన తాటాకుతోగాని వరి గడ్డితో గాని కప్పి తరచు తడుపుతూ ఉండాలి. పాకలను కడగడం, చుట్టూ పరిసరాలలో నీళ్ళు చల్లడం వల్ల షెడ్డు లోపలి వాతావరణం చల్లగా ఉంటుంది. చల్లని నీటితో పశువుల్ని రోజుకు 2-3సార్లు కడగాలి. శుభ్రమైన చల్లని త్రాగునీటిని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలి.
- రైతు ఆర్దిక స్థోమత మరియు పశువుల సంఖ్యను బట్టి పాకల్లో ఫ్యాన్లను లేదా తుంపర్లను వెదజల్లే యంత్రాలను కూడాఏర్పాటుచేసుకోవచ్చు. కప్పుపై భాగంపై తెల్లని రంగు వేయించడం వల్ల సూర్యకిరణాలు పరివర్తనం చెందుతాయి.
వేసవిలో మేత
- ఎండవేడివల్ల పాడిపశువు ఎక్కువగా మేత తినలేదు. వేసవితాపంతో జీర్ణక్రియ, సన్నగిల్లుతుంది. అందువల్ల సులువుగా జీర్ణించుకునే పిండిపదార్థాలైన గంజి, జావ లాంటి పదార్థాలు ఇవ్వడం మంచిది.

- ఎక్కువ శాతం పచ్చిగడ్డి ఇవ్వాలి. ఒకవేళ మాగుడు గడ్డి సమృద్దిగా ఉంటే అందించవచ్చు. పచ్చిగడ్డిని ఉదయం సమయాలలో, ఎండుగడ్డిని రాత్రిసమయాలలో విభజించి ఇవ్వాలి. అధిక పాలను ఇచ్చేపశువులకు పశు దాణ నీటితో కలిపి ఇవ్వాలి. అందుబాటులో ఉండే సమీకృత దాణ ఇవ్వడంవలన తక్కువ మోతాదులో అన్ని పోషకాలను సమకూర్చవచ్చు. మినరల్ మిక్చర్, ఉప్పు కలిపిన ద్రావణం ఇవ్వడం మంచిది.
- మేపు కొరకు పశువుల్ని ఎండవేళల్లో కాకుండా ఉదయంపూట 6 నుండి 10 గంటల వరకు మరియు సాయంత్రం 4 నుండి 7 గంటల వరకు మేత కొరకు పశువులను బయటకు పంపడంమంచిది.
ఆరోగ్య పరిరక్షణ
- వ్యాధినిరోధక శక్తి తగ్గడం వల్ల ఇతర వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది కావున నివారణకై పశువులలో ముందుగానే గాలికుంటు వ్యాధి, గొంతువాపు, జబ్బవాపు వ్యాది నివారణ టీకాలు వేయించాలి.
- దాహంతో ఉన్నపశువులు మురుగునీరు త్రాగటం వల్ల పారుడు వంటి జీర్ణకోశ రోగం వచ్చే అవకాశం ఉంది కావున ఎల్లవేళల మంచి చల్లని త్రాగునీరు అందుబాటులో ఉంచాలి.
- అంతర పరాన్నజీవుల నిర్మూలనకు నట్టల నివారణ మందులు క్రమంతప్పకుండా త్రాగించాలి.బాహ్య పరాన్నజీవుల నిర్మూలనకు బ్యూటాక్స్ మందు తగుపాళ్ళలో నీటిలో కలిపి పశువుశరీరంపై పిచికారిచేయాలి. పరిసరాలనుపరిశుభ్రంగా ఉంచాలి.
- పశుపోషకులు ముందుగానే పై జాగ్రత్తలు పాటించడం వలన పశువుల ఆరోగ్యం కాపాడటంతోపాటు, పాల దిగుబడి తగ్గకుండా, ఆర్దికంగా నష్టం వాటిల్లకుండా చూడవచ్చు.
డాక్టర్. జి. రాంబాబు, పశువైద్యాధికారి, కడప. ఫోన్: 96184 99184

