వివిధ రకాల కారణాల వలన ఇటీవల కాలంలో ఇంటి పంటను చేపట్టే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుందనే విషయం అందరికీ తెలిసిందే. ఇంటి పంటవలన ప్రయోజనాలను గ్రహించిన చాలామంది ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అంటే పెరట్లో, మేడ మీద, మెట్ల మీద, పిట్ట గోడల మీద.. ఈ విధంగా తమ అనకూలతను బట్టి కొన్ని మొక్కలను పెంచుతూ పోతున్నారు.

ఇంటి పంటను చేపట్టే వారిలో సొంత ఇంటిదారులతో పాటు అద్దెకు ఉండేవారు కూడా ఉన్నారు. సొంత ఇంటిదారులకు పెద్దగా ఇబ్బందులు ఉండవు కాని అద్దెకు ఉండే వారి విషయంలో అనేక సమస్యలు ఉంటాయి. ఇల్లు మారవలసిన సందర్భంలో మొక్కలను కుండీలతో కలిపి వేరే ఇంటికి మార్చడము చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని మొక్కలు పనికి రాకుండా పోయే అవకాశాలు ఉంటాయి. రవాణా ఖర్చులు, ఎగుమతి, దిగుమతి ఖర్చులు కూడా ఎక్కువగా అవుతుంటాయి. కాబట్టి ఇంటి పంటపై, పచ్చదనంపై మక్కువ ఉన్నవారు సొంత ఇంటి కలను తొందరగా సాకారం చేసుకోవాలని ఉంటారు. ఈ దారిలోనే నడచి తమకు పచ్చదనంపై ఉన్న మక్కువతో తమ సొంత ఇంటి కలను వేగంగా సాకారం చేసుకున్నారు విశాఖపట్టణం, మధురవాడకు చెందిన ఝాన్సీరాణి.

ఝాన్సీరాణి డిగ్రీ వరకు చదువుకుని కొన్ని రోజులు ఉద్యోగం చేసి పచ్చదనంపై ఉన్న మక్కువతో చేస్తున్న ఉద్యోగాన్ని మానివేసి, ప్రస్తుతం గృహిణి బాధ్యతలు నిర్వర్తిస్తూ తన పూర్తి సమయాన్ని కుటుంబానికి, తమ మిద్దెతోటకు కేటాయిస్తున్నారు. ఝాన్సీరాణికి పచ్చదనంపై మక్కువ చాలా ఎక్కువ. కాబట్టి అద్దె గృహాలలో ఉండే సమయంలో కూడా అవకాశం ఉన్న చిన్న ప్రదేశాన్ని కూడా వదలకుండా మొక్కలు పెంచుతుండేవారు. ఇళ్ళు మారవలసి వచ్చినప్పుడు మొక్కలను మార్చడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు ఎంతో ప్రేమగా, ఎంతో కాలం నుంచి పెంచుకున్న కొన్ని మొక్కలు పాడై పోవడం ఝాన్సీరాణిని బాధిస్తుండేవి. ఇలాంటి అన్ని సమస్యలకు సొంత ఇల్లు సరైన పరిష్కారం అని నిర్ణయించుకుని చాలా వేగంగా సొంత ఇంటి కలను సాకారం చేసుకుని 3 అంతస్తుల సొంత ఇంట్లో మిద్దె మీద మిద్దె తోటను పెంపకం చేయడముతో పాటు మూడు అంతస్తులకు ఎక్కేదారిలో ఉండే అన్ని మెట్ల మీద మరియు ఇంట్లో అవకాశం ఉన్న అన్ని ప్రాంతాలలో చివరకు గోడలకు కూడా వృథాగా పడవేసే నూనె క్యాన్లను బిగించి అన్నింటిలో ఇండోర్ ప్లాంట్స్ పెంపకం చేస్తున్నారు.

ఝాన్సీరాణికి ఇంటిపంటలో 8 సంవత్సరాల అనుభవం ఉంది. ప్రస్తుతం 800 చదరపు అడుగుల విస్తీర్ణంలో మిద్దె మీద వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు., స్లాబు మీద నీరు పడితే స్లాబు పాడై పోతది కాబట్టి స్లాబు మీద నీరు పడకుండా స్టాండులు ఏర్పాటు చేసుకుని స్టాండుల మీద వివిధ సైజు ప్లాస్టిక్ కుండీలు, టబ్బులు ఏర్పాటు చేసుకుని ఆ టబ్బులలో బరువు తక్కువగా ఉండే సాయిల్ మిక్స్‌ని నింపి అందులో వివిధ రకాల మొక్కలు పెంపకం చేస్తున్నారు.

ప్రస్తుతం వారి మిద్దెతోటలో ఆకుకూరలు, కూరగాయలు, ఔషధ మొక్కలు, సుగంధ మొక్కలు, క్రోటాన్స్, పూలమొక్కలు, పండ్ల మొక్కలు లాంటి అవకాశం ఉన్న మొక్కలను వదలకుండా పెంపకం చేస్తున్నారు. మొక్కల నిర్వహణకు ఎక్కువగా ఫిష్ ఎమినో యాసిడ్, వేపనూనె, ఎగ్ ఎమినో యాసిడ్, ఫ్రూట్ పర్మెంటెడ్ జ్యూస్, థపర్ణి కషాయం, పంచగవ్య, అల్లం+ బెల్లం ద్రావణం, తాటికల్లు+ దాల్చిన చెక్క ద్రావణం, వెల్లుల్లి+ బెల్లం ద్రావణం లాంటి ఎన్నో రకాల ద్రావణాలను సొంతంగా తయారు చేసుకుంటూ మొక్కలకు ఉపయోగిస్తూ ఆరోగ్యకరమైన మిద్దె తోటను పెంచుతున్నారు.

మిద్దె తోటలో పండే పంటలపై తమతో పాటు ప్రకృతిలో ఉండే వివిధ రకాల పకక్షులకు కూడా అధికారం ఉందని నమ్మి తమ మిద్దెతోటలో వివిధ రకాల పకక్షులు నివశించడానికి, పకక్షులు తమ మిద్దెతోటను ఉపయోగించుకోవటానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి వివిధ రకాల పకక్షులు వాటికి ఇష్టమైన అంజూర, దానిమ్మ లాంటి పండ్లను తమకంటే ముందు పకక్షులే తింటుంటాయి.

అయినా కాని మేము ఏ మాత్రం బాధపడకుండా పకక్షులు కూడా ప్రకృతిలో భాగం కాబట్టి పకక్షులకు ఆహారం ఏర్పాటుకు తమకు అవకాశం దొరికినందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటారు. కేవలం 800 చదరపు అడగుల విస్తీర్ణంలో రెండు, మూడు రెట్లు ఎక్కువ మొక్కలు పెంచుతున్న వారి మిద్దె తోటను అనేకమంది ప్రముఖులు సందర్శించారు. ఇంకా సందర్శిస్తూనే ఉన్నారు. మరిన్ని వివరాలు 63025 09928 కి ఫోను చేసి తెలుసుకోగలరు.
వై. శ్రవణ్ కుమార్, స్పెషల్ కరస్పాండెంట్

