ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాలలో అత్యధిక శాతం గేదెలు నిండుచూడిథలో ఉండి త్వరలో ఈనడానికి సిద్ధంగా ఉన్నాయి. పాడిపశువులకు ఇది చాలా క్లిష్టమైన సమయం. పాలు ఇవ్వడం లేదనే కారణంతో ఈథలో వీటి పోషణపట్ల అశ్రద్ధవహిస్తే, ఈనే సమయంలో ఎదురయ్యే సమస్యలతోపాటు ఆ తర్వాతి పాడి కాలంలో కూడా ఆశించిన స్థాయిలో పాల ఉత్పత్తిని పొందలేక యజమానులు తమకు తెలియకుండానే భారీ నష్టాలకు గురయ్యే ముప్పుఉండవచ్చు. నిండు చూడి థలో పోషకాహారలోపాలవల్ల ఎదురయ్యే సమస్యలలో పాలజ్వరము మరియు రక్తంలో చక్కెర శాతాలు క్షీణించుట వల్ల కలిగే కీటోసిస్ అనే వ్యాధులు చాలా ముఖ్యమైనవి. వీటికి అనుబంధంగా మెయ్యదిగుట, మాయ విసర్జన సకాలంలో జరుగకపోవుట, పుట్టేదూడలు బలహీనంగా తక్కువ శరీర తూకంతో జన్మించుట, తల్లుల నుండి దూడలకు సరిపడే జున్నుపాలను అందించకపోవుట వంటి ఇతర సమస్యలు కూడా ఎదురుకావచ్చు. పోషకాహార లోపం వల్ల ఎదురయ్యే ముఖ్యసమస్యలలో రక్తంలో కాల్షియం లోపం వల్ల వచ్చే పాల జ్వరము, చక్కెర హీనతవల్ల వచ్చే కీటోసిస్ వ్యాధులు ముఖ్యమైనవి. ఈ రెండు సమస్యలు ఈనే కొన్ని రోజుల ముందు నుండి ఈనిన తర్వాత కొన్ని రోజుల వరకు కనిపిస్తాయి. వీటి ప్రభావం తల్లుల పాల ఉత్పత్తితో పాటు, దూడల ఎదుగుదల విూద కూడా పడి రెండు తరాల ఉత్పాదకత విూద కనిపిస్తుంది.
పాలజ్వరము: వాస్తవనికి శరీర సాధారణ ఉష్ణోగ్రత 102-103 డిగ్రీల ఫారిన్‌హీట్ నుండి 96-98 డిగ్రీల కంటే తక్కువకు తగ్గిపోతుంది. శరీరం చల్లగా ఉండి, పశువు చాలా నీరసంగా ఉంటుంది. మెడ కండరాలలో పటుత్వం తగ్గుట వల్ల మెడను ముందుకు వంచి నేలవిూద ముట్టెను ఆన్చి ఉండటం, లేదా మెడను ప్రక్కకు ఛాతివైపు వంచి ముట్టె ఆన్చి ఉండటం కనిపిస్తుంది. పశువు ఎక్కువగా కూర్చొని ఉంటుంది. లేదా తీవ్రత పెరిగినప్పుడు అడ్డంగా పడిపోవటం జరుగుతుంది. నడ్డి ఆర్చివలె వంగి ఉంటుంది. పేడ గట్టిగా ఉండటం లేదా పూర్తి మలబద్ధకం కూడా ఉండవచ్చు. అధికపాలనిచ్చే పశువులలో ఈ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.

రక్తనమూనా పరీక్షలో కాల్షియం పరిమాణం చాలా దిగువకు పడిపోయి కనిపిస్తుంది. ఆశించిన స్థాయిలో పాల ఉత్పత్తి ఉండదు.
చికిత్స: కాల్షియం బోరోగ్లూకొనేట్ ఇంజక్షను 350-450 మిల్లీలీటర్లు నెమ్మదిగా మెడసిరలోకి ఎక్కించాలి. సిరలోకి ఇంజక్షనుకు ప్రత్యామ్నాయంగా ఒక్కొక్క చోట చర్మం క్రిందకు 100 నుండి 120 మిల్లీలీటర్లు మెడప్రక్క చర్మం క్రిందకు కూడా ఎక్కించవచ్చును లేదా నోటి ద్వారా వినియోగించదగిన వివిధ కాల్షియం ఉత్పత్తులు ద్రవరూపంలో లభ్యమౌతున్నాయి. వాటిని ఉత్పత్తిదారులు లేదా పశువైద్యుల సూచనలమేరకు పట్టించవచ్చును. వీటితోపాటు బి-కాంప్లెక్స్ ఇంజక్షన్లు ఇస్తే పశువు నీరసం నుండి కొంతవరకు బయట పడుతుంది. ఆ తర్వాత నమ్మకమైన ఖనిజలవణ మిశ్రమాన్ని దాణాలో కలిపి వాడాలి. జొన్నలు-సజ్జలు-మొక్కజొన్నలు-రాగుల నూకను నువ్వుల పిండిని మడ్డికూడుగా వండి వరితవుడు లేదా గోధుమ తవుడుతో కలిపి వరుసగా 4-5 రోజులు రోజుకు 2 నుండి 3 కిలోలు దాణాగా మేపినా వెంటనే పాల ఉత్పత్తి పెరిగే అవకాశాలు ఉంటాయి.
మునగ ఆకు, అవిసె ఆకు, తులసి, మారేడు వంటి ఆకులను మేతతో కలపి మేపితే పశువు త్వరగా మామూలు స్థాయికి వస్తుంది. పారా, నేపియర్, ల్యూసర్న్ వంటి మేలు జాతి పచ్చిమేతలు కూడా పాలజ్వరం ప్రభావాలను చాలా వరకు తగ్గించగలవు.
పాలజ్వరం నివారణ: ఈనడానికి రెండు నెలల ముందు నుండి పాలు పిండుట నిలిపివేయాలి. చూడి పశువుకు కూడా రోజుకు 20-30 గ్రాముల నాణ్యమైన ఖనిజ లవణ మిశ్రమాన్ని దాణాతో కలిపి మేపాలి. సవిూకృత దాణాను పశువు శరీర బరువును, ఇతర గ్రాసాల నాణ్యతలను గమనించి రోజుకు ఒకటి నుండి రెండు కిలోలు ప్రతి రోజూ మేపాలి. మేతలో తులసి, అవిసె, మల్బరీ, సుబాబుల్, మునగ వంటి ఆకుల్ని కలుపుట వల్ల చాలావరకు పోషకాహార లోపాలను నివారించవచ్చు.
చూడి థలో రెండు-మూడు నెలలకు ఒకసారి పరాన్నజీవుల నిర్మూలనకు అవసరమైన మందుల్ని లేదా కలబంద గుజ్జు, గాడిదగరప, పొట్ల ఆకులు, దానిమ్మ బెరడు మిశ్రమాలను బెల్లంతో కలిపి ముద్ద చేసి తినిపించవచ్చు. చూడి పశువులన్నింటికీ వేలంవెర్రిగా కాల్షియం ఇంజక్షన్లు చేయించుటకంటే నోటిద్వారా సహజసిద్ధమైన దాణాలు, మేతల్ని అందిస్తే సరిపోతుంది.
పైన పేర్కొన్న జాగ్రత్తల్ని పాటిస్తే పాలజ్వరంతోపాటు రక్తంలో చక్కెర హీనత వల్ల ఎదురయ్యే కీటోసిస్, మెయ్యదిగుటం, మాయ సకాలంలో విసర్జించకపోవుట, బలహీనమైన దూడలు జన్మించటం వంటి అనేక ఇతర సమస్యలు కూడా ఎదురుకావు.
డా. యం.వి.జి. అహోబలరావు, 93930 55611

