పెరుగుతున్న నిరుద్యోగులకు అవసరమయిన ఉపాధి అవకాశాలు చూపించే సత్తా మనదేశంలో వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలకే ఉందని నిస్సందేహంగా చెప్పవచ్చు. మన దేశంలో జనాభాతో పాటు నిరుద్యోగుల సంఖ్య కూడా ఏఏటికాయేడు పెరుగుతూనే ఉంది. కొత్తగా స్థాపించే పరిశ్రమలు కాని, సేవా రంగాలు కాని, ప్రభుత్వ ఉపాధి అవకాశాలు గాని నిరుద్యోగులందరికి ఉద్యోగ అవకాశాలు చూపించలేకపోతున్నాయనే విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి నిరుద్యోగ యువత వ్యవసాయం మరియు దాని అనుబంధరంగాలవైపు అడుగులు వేస్తున్నారు. కాని కొంతమంది అవగాహన లేకుండా ఎక్కువ పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నారు. అలా నష్టపోయిన వారిని చూసి కొంతమంది వెనుకంజవేస్తున్నారు. కాని అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి తక్కువ పెట్టుబడితో ఉపాధి అవకాశాలను మొదలుపెట్టి జాగ్రత్తలు పాటించినట్లయితే తప్పని సరిగా ఫలితం పొందవచ్చు. తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టగలిగే లాభదాయకమయిన వ్యవసాయ అనుబంధ రంగాలలో నాటుకోళ్ళ పెంపకం ముందు వరుసలో ఉంటుందని చెప్పవచ్చు. 100 కోళ్ళతో నాటుకోళ్ళ పెంపకం చేపట్టి కుటుంబ అవసరాలకు సరిపోను ఆదాయాన్ని పొందవచ్చు అంటున్నాడు ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం, చిన్న ఆగిరిపల్లికి చెందిన శివనాగమల్లేశ్వరరావు.

2004 నుండి 2015 వరకు అంటే 11 సంవత్సరాల పాటు బ్రాయిలర్ కోళ్ళ పెంపకం చేపట్టి వివిధ రకాల కారణాల వలన బ్రాయిలర్ కోళ్ళ పెంపకాన్ని ఆపివేసి 2015 నుండి నాటు కోళ్ళ పెంపకం చేపట్టి కొనసాగిస్తున్నాడు. నాటుకోళ్ళతో పాటు గిన్నెకోళ్ళు కడక్‌నాథ్ కోళ్ళు, టర్కీకోళ్ళు, బాతుల లాంటి వాటిని కూడా పెంపకం చేస్తూ తనకు అనుభవం ఉన్న రంగంలో కొనసాగుతున్నాడు. బ్రాయిలర్ కోళ్ళ పెంపకానికి ఏర్పాటు చేసిన మౌలిక వసతులు ఉన్నాయి కాబట్టి కేవలం కోళ్ళను మాత్రమే కొనుగోలు చేసుకుంటే సరిపోతది కాబట్టి 2015వ సంవత్సరం కేవలం 70 నాటుకోళ్ళతో మొదలు పెట్టడం జరిగింది. కొత్తగా ఈ రంగంలో అడుగు పెట్టేవారు షెడ్ నిర్మాణానికి ఎక్కువ ఖర్చులు పెట్టకుండా తక్కువ ఖర్చుతో కోళ్ళు తడవకుండా షెడ్ ఏర్పాటు చేసుకుంటే పెట్టుబడి తగ్గించుకోవచ్చనే సలహా ఇస్తున్నాడు. కోళ్ళను ఫ్రీరేంజ్‌లో తిప్పినట్లయితే అందుబాటులో ఉన్న కలుపు గింజలు, పురుగులు, చిన్నచిన్న మొక్కలను తింటాయి కాబట్టి కోళ్ళకు రోగనిరోధక శక్తి పెరిగి జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి శివనాగమల్లేశ్వరారవు అదే పద్ధతిని అనుసరిస్తున్నాడు. దాణాగా గంట్లు, రాగులు, నూకలు, వడ్లు వంటివి అందిస్తున్నాడు.

మొదటలో కోళ్ళు పొదగటానికి ఎలాంటి కృత్రిమ పద్ధతులు ఉపయోగించకుండా ప్రకృతి సిద్ధమైన పద్ధతులనే అనుసరించాడు. ఈ పద్ధతిలో జననాల రేటు ఆశాజనకంగా ఉండకపోవటముతో 2018 వ సంవత్సరం 3500 పిల్లల ఉత్పత్తి సామర్థ్యం గల ఇంకుబేటరుకు అప్పట్లో 2,10,000/- లు పెట్టి కొనుగోలు చేయడం జరిగింది. బ్యాచికి 3500 గుడ్లకు గాను 3000 పిల్లలను పొందుతూ అందులో 500 పిల్లలను సొంతానికి ఉపయోగించుకుంటూ ప్రతి బ్యాచికి 2500 పిల్లల చొప్పున అమ్మకం చేసుకుంటూ వస్తున్నాడు.

అన్ని సక్రమంగా ఉంటే నాటుకోళ్ళు 5 నుంచి 6 నెలలలో రెండు నుండి రెండున్నర కిలోల వరకు ఎదుగుతాయి. కోళ్ళకు అందించే నీటి విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. ప్రతిరోజు మంచి శుభ్రమైన నీటిని అందించటంతోపాటు నీటి పాత్రలను ప్రతిరోజు శుభ్రం చేస్తూ ఉండాలి. కోళ్ళ ఆరోగ్య విషయంలో తప్పనిసరిగా డాక్టరును సంప్రదించి క్రమం తప్పకుండా సక్రమ సలహాలను పాటిస్తూ తోటి కోళ్ళ పెంపకందార్లును కూడా కలుస్తూ వారి అనుభవాలను తెలుసుకుంటూ ఉండాలి. ఆరోగ్య విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ చూపించినా కూడా కోళ్ళను నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి కోళ్ళకు అందించే టీకాల విషయంలో ఎలాంటి అశ్రద్ధకు తావు ఇవ్వకుండా క్రమం తప్పకుండా తను పెంపకం చేసే కోళ్ళకు అన్ని టీకాలు సమయానుసారం అందిస్తూ వస్తున్నాడు.
మార్కెటింగ్ విషయంలో మధ్యవర్తుల మీద ఆధారపడకుండా సొంతంగా మార్కెట్ చేసుకుంటున్నాడు. సామాజిక మాద్యమాలను సక్రమంగా వినియోగించుకోవటంతోపాటు కోళ్ళను ప్రకృతిసిద్ధంగా పెంపకం చేస్తున్నాడు కాబట్టి కోడి మాంసం రుచిని ఒకసారి చూసిన వారు ప్రక్కవారికి చెప్పడంతో పాటు మరలా, మరలా కొనుగోలు చేస్తుండడము వలన తాను పెంపకం చేసే కోళ్ళ మార్కెటింగ్ విషయంలో శివనాగమల్లేశ్వరరావు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం లేదు. గత 19 సంవత్సరాల నుండి ఈ రంగంలో ఉన్నాడు కాబట్టి వినియోగదారులు నేరుగా కొనుగోలు చేయడంతోపాటు వేరే రకాల గురించి కూడా అడుగుతున్నారు కాబట్టి వినియోగదారులకు అన్ని రకాలను అందించాలనేధ్యేయంతో నాటుకోళ్ళతో పాటు కడక్‌నాథ్ కోళ్ళు, గిన్నె కోళ్ళు, టర్కీ కోళ్ళు, బాతుల లాంటివాటిని కూడా పోషిస్తూ వినియోగదారులకు ఎక్కువ రకాల కోళ్ళను అందుబాటులో ఉంచుతున్నాడు.
కోళ్ళ పెంపకం దగ్గర పాముల సంచారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పాముల నుంచి రక్షణకొరకు కొన్ని టర్కీ మరియు గిన్నె కోళ్ళను పెంచినట్లయితే పాముల సంచారం తగ్గుతుందని భావించి వాటి పెంపకం చేపట్టి కొనసాగిస్తున్న సమయంలో వినియోగదారులు వీటిని కూడా అడుగుతున్నారు కాబట్టి వాణిజ్యసరళిలో వాటిని పెంచుతున్నాడు. కాని కొత్తగా ఈ రంగంలో అడుగుపెట్టే వారు టర్కీ మరియు గిన్నె కోళ్ళను ఎక్కువ కొనుగోలు చేయకుండా ఒక్కొక్క రకం 10 చొప్పున కొనుగోలు చేసి పోషిస్తుంటే పాముల నుండి రక్షణ లభించడంతోపాటు వినియోగదారుల అవసరాలను పరిశీలించగలిగితే ముందుముందు వాటిని కూడా వాణిజ్యసరళిలో పెంపకం చేయవచ్చు అని కొత్తవారికి శివనాగమల్లేశ్వరరావు సలహా ఇస్తున్నాడు. మరిన్ని వివరాలు 9492979049 కి ఫోను చేసి తెలుసుకోగలరు.

