లేగదూడలలో అధిక మరణాలు కలుగ చేసే వ్యాధులలో ముఖ్యమైనది తెల్ల పారుడు వ్యాధి. ఈ వ్యాధి ఇ.కోలి అనే సూక్ష్మ క్రిమి ద్వారా వస్తుంది. ఈ సూక్ష్మ జీవి సహజ సిద్ధముగా దూడ పేగులలో ఉంటుంది. ఐతే ఈ సూక్ష్మజీవిలో కొన్ని రకాలు వ్యాధిని కలుగ చేసే స్వభావమును కలిగి ఉంటాయి. దూడలు అపరిశుభ్రమైన పొదుగు లేదా పాత్రలలో పాలు తాగినప్పుడు, ఒక్కసారిగా ఎక్కువగా పాలు తాగినప్పుడు, వెన్న ఎక్కువగా ఉన్న చివరి పాలు తాగినప్పుడు, చల్లగా ఉన్న పాలను తాగినప్పుడు, పాలు తాగే సమయాలలో వ్యత్యాసము ఉన్నప్పుడు, జున్నుపాలు సరిగా తాగనప్పుడు, దూడల వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు హానికర ఇ.కోలి సంఖ్య పెరిగి తెల్లపారుడు వ్యాధి కలుగుతుంది. ఈ వ్యాధి తీవ్రత గేదె మరియు సంకర జాతి దూడలలో ఎక్కువగా ఉంటుంది. వ్యాధి సోకిన దూడలు తెల్లగా పారతాయి. పారినప్పుడు బాగా దుర్వాసన వస్తుంది. దూడల శరీరము నుండి నీరు కోల్పోయి కనుగుంటలు బాగా లోపలికి పోయి ఉంటాయి. చర్మము ముడుతలు పడి ఉంటుంది. దూడ ఎక్కువగా పారి నీరసించి చనిపోతుంది. ఈ వ్యాధిని అరికట్టడానికి సాధారణముగా యాంటిబయోటిక్ మందులను వాడతారు. ఐతే నేడు అధికముగా యాంటిబయోటిక్ మందులను వాడడము వలన యాంటిబయోటిక్‌కు గూడా లొంగని ఇ.కోలి సూక్ష్మజీవి రకాలు కొత్తగా రూపాంతరము చెందాయి. ఇవి గనుక దూడలకు సోకితే ఎటువంటి యాంటిబయోటిక్ మందు పనిచేయక దూడ తప్పనిసరిగా చనిపోతుంది. ఇటువంటి సూక్ష్మజీవులు మనుషులకు గూడా అత్యంత ప్రమాదకరము. కాబట్టి వీటిని నివారించాలంటే ప్రత్యామ్నాయ మందులు అవసరము. ఇటువంటి ఒక ప్రత్యామ్నాయమే స్వీయ ప్రోబయాటిక్స్. స్వీయ ప్రోబయాటిక్స్ ను అదే జాతికి చెందిన ఆరోగ్యమైన దూడల పొట్టనుండి వేరుచేసి తయారు చేస్తారు. సాధారణ ప్రోబయాటిక్స్‌తో పోలిస్తే స్వీయ ప్రోబయాటిక్స్ వ్యాధి కారక సూక్ష్మజీవులను సమర్ధవంతముగా అరికడతాయి. స్వీయ ప్రోబయాటిక్స్‌ను అదే జాతికి చెందిన దూడలనుండి సంగ్రహించడము వలన ఇవి సులభముగా పేగుల లోపల చేరి పేగు గోడలకు అంటుకొంటాయి. ఇవి ఇతర హానికరమైన సూక్ష్మజీవులను పేగు గోడలకు అంటుకోకుండా చూస్తాయి. దీని వలన వ్యాధి కారక సూక్ష్మజీవుల పెరుగుదల జరగక అరికట్ట బడతాయి.
స్వీయ ప్రోబయాటిక్స్ మీద డిపార్ట్‌మెంట్ అఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, భారత ప్రభుత్వము వారు ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్‌ను డిపార్ట్‌మెంట్ అఫ్ మైక్రోబయాలజీ, ఎన్. టి. ఆర్ పశువైద్య శాలకు మంజూరు చెయ్యడము జరిగినది. ఈ ప్రాజెక్ట్‌లో నెల లోపు ఆరోగ్యకరమైన, ఎటువంటి యాంటిబయోటిక్ మందులు వాడని లేగ దూడల నుండి లాక్టోబాసిల్లస్ అనే ప్రోబయాటిక్ సూక్ష్మజీవిని వేరు చెయ్యడము జరిగినది. ఈ విధముగా వేరు చేసిన వానిని అవి దూడలకు ఇచ్చినప్పుడు వాని పేగులలో అంటుకొనే శక్తి ఎలా ఉంది, అవి పేగులోని వాతావరణ పరిస్థితులను తట్టుకొని మన గలుగుతున్నాయా, యాంటిబయోటిక్ రెసిస్టెంట్ సూక్ష్మజీవులను సమర్ధవంతముగా అరికడుతున్నాయా, వీనిలో వేనికైనా యాంటిబయోటిక్ రెసిస్టన్స్ ఉందా, ఇవి ఇచ్చినప్పుడు ఏవైనా ఇతర సమస్యలు ఉన్నాయా అనే అంశాల మీద వివిధ పరీక్షలు నిర్వహించి వానిలో మూడు రకాల లాక్టోబాసిల్లస్‌లను గుర్తించడము జరిగినది. ఈ విధముగా గుర్తించిన మూడు రకాల లాక్టోబాసిల్లస్‌లను కలిపిన మిశ్రమ స్వీయ ప్రోబయాటిక్ మందును తయారు చెయ్యడము జరిగినది. ఈ విధముగా తయారు చేసిన మిశ్రమ స్వీయ లాక్టోబాసిల్లస్ దూడ పొట్టలో బాగా పెరగడానికి మానాన్‌ఒలిగోశాఖారైడ్ అనే ప్రీబయోటిక్‌తో కలిపి చివరిగా సిన్బయోటిక్ అనే మందును తయారు చెయ్యడము జరిగినది. ఈ విధముగా తయారు చేసిన సిన్‌బయోటిక్ దూడలలో పరీక్షించడము జరిగినది. సిన్‌బయోటిక్ మందును తీసికొన్న దూడలలో యాంటిబయోటిక్‌కు కూడా లొంగని ఇ.కోలి సూక్ష్మజీవి సమర్ధవంతముగా అరికట్టడము గమననించడం జరిగినది. అంతే కాకుండా మిగిలిన దూడల కంటే సిన్‌బయోటిక్ ఇచ్చిన దూడలలో అధిక వ్యాధి నిరోధక శక్తి, పెరుగుదల గూడా గమనించడము జరిగినది. ఆ విధముగా సిన్‌బయోటిక్ మందు పనితనము నిర్ధారించుకొన్న తరువాత ఈ మందును తెల్ల పారుడు కలిగిన దూడలలో ఇవ్వడము జరిగినది. సిన్‌బయోటిక్ మందు ఇచ్చిన దూడలలో రెండవ రోజు నుండి తెల్లపారుడు తగ్గి ఐదవ రోజుకు పేడ మామూలుగా మారడము గమనించడము జరిగినది. ఈ విధముగా యాంటిబయోటిక్ అవసరము లేకుండా స్వీయ ప్రోబయాటిక్స్‌తో తయారు చేసిన సిన్‌బయోటిక్ దూడలలో తెల్లపారుడు అరికట్ట వచ్చని నిరూపితమైనది.

దూడ పుట్టిన వెంటనే త్రాగించే జున్నుపాల ద్వారా వచ్చే వ్యాధి నిరోధక శక్తి రెండు వారాల వరకే ఉంటుంది. తరువాత దూడ లో వ్యాధి నిరోధక శక్తి తగ్గి క్రమముగా వివిధ వ్యాధుల బారిన పడే అవకాశముంది. దూడలకు తెల్ల పారుడు రాకుండా ముందుగానే ఈ సిన్‌బయోటిక్ మందును వరుసగా రెండు వారాలు వాడితే ఈ వ్యాధి సమర్ధ వంతముగా అరికట్టబడడమే కాకుండా దూడలలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. యాంటిబయోటిక్‌తో పోలిస్తే ఈ మందు ఖర్చు గూడా బాగా తక్కువ. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, భారత ప్రభుత్వము మరియు డిపార్ట్‌మెంట్ అఫ్ మైక్రోబయాలజీ, ఎన్.టి.ఆర్ పశువైద్య కళాశాల వారి సహకారంతో తయారు చేసిన ఈ మందును రైతులకు అందించడము కొరకు మందు తయారీ టెక్నాలజీని తయారీ దారులకు మార్పిడి చేస్తున్నాము. కావున స్వీయ ప్రోబయాటిక్స్‌తో తయారు చేసిన సిన్బయోటిక్ త్వరగా పశుపోషకులు అందుతుందని ఆశిస్తున్నాము.
డా. ఎం. శ్రీవాణి, అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్, డిపార్ట్‌మెంట్ అఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాజెక్ట్, ఎన్.టి.ఆర్. పశువైద్య కళాశాల, గన్నవరం, కృష్ణా జిల్లా, ఫోన్: 995138 3366

